Nagababu Pawan Kalyan మెగా సోదరుల్లో చిరంజీవి మృదు స్వభావి. అందుకే కాబోలు రాజకీయాల్లో రాణించలేకపోయారు. ఇప్పటి రాజకీయాలకు తాను సూటు కానని కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తనకు సినిమా రంగమంటే ఇష్టమని.. రాజకీయాల్లోకి వెళ్లి విలువైన సమయాన్ని వృథా చేసుకున్నానని ఇటీవల బాధపడ్డారు. అయితే చిరంజీవి మిగతా ఇద్దరు సోదరులు మాత్రం చిరులా కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎన్నిఒడిదుడుకులు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారు. తనకంటే బలమైన రాజకీయ ప్రత్యర్థులతో తలపడుతున్నారు. సమాజంలో మార్పు కోసమే పార్టీ పెట్టారు. అందు కోసం పోరాడుతున్నారు. జనాలు తనను ఆదరించకపోయినా.. అదే జనాన్ని ప్రేమిస్తున్నారు.వారి కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. స్టార్ డమ్ ను వదులుకొని మరీ ప్రజా జీవితం కోసమే విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు. మరో సోదరుడు నాగబాబు పవన్ వెన్నంటి నడుస్తున్నారు. పవన్ పై ఎవరైనా చిన్న విమర్శ చేసినా రియాక్టు అవుతారు. అదే స్థాయిలో తిప్పికొడతారు. చాలా సందర్భాల్లో ఆయన ఎమోషన్ అయ్యారు. తాజాగా పవన్ కోసం ఓ అభిమాని రాసిన రాయల్ యోగి పుస్తకావిష్కరణలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

పదవులు, డబ్బులు కోసం వెంపర్లాడే మనస్తత్వం పవన్ ది కాదని.. అతడు పార్టీ పెట్టకుండా టీడీపీ, బీజేపీలో చేరి ఉంటే మంత్రి పదవి వచ్చుండేదని కామెంట్స్ చేశారు. పవన్ పదవుల కోసం పార్టీ పెట్టలేదని… ప్రజలకు మంచి చేయాలని మాత్రమే పార్టీ పెట్టారని.. ఇది గుర్తించుకొని విమర్శలు చేయాలని రాజకీయ ప్రత్యర్థులకు హితవు పలికారు. సామాజిక రుగ్మతలు, అవినీతిని, లంచగొండితనాన్ని నిలదీయడానికే పార్టీ పెట్టాడని.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని నడుపుతున్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని విమర్శిస్తుండడం బాధేస్తోందన్నారు.
వారాహి వాహనం చుట్టూ తిరుగుతున్న వివాదంపై కూడా నాగబాబు స్పందించారు. ప్రచార రథాన్ని ఏపీలో తిరగకుండా చూస్తామని కొందరు సన్నాసులు హెచ్చరిస్తున్నారని.. ఎలా తిరగనివ్వరో చూస్తామన్నారు. 30 ఏళ్ల కిందట పవన్ ఎలా ఉన్నాడో? ఇప్పుడూ అలానే ఉన్నాడని.. పదవుల కోసం , డబ్బుల కోసమో వెంపర్లాడే రకం కాదన్నారు. సినిమాల్లో సంపాదించిన డబ్బును తెచ్చి పార్టీ నడుపుతున్నాడని కూడా గుర్తుచేశారు. ప్యాకేజీ స్టార్, పావలా నాయకుడంటూ ఆరోపణలు చేస్తున్న వారు పవన్ గురించి తెలుసుకొని మాట్లాడాలని గట్టిగానే హెచ్చరించారు. లోలోపల బాధపడుతునే రాజకీయ ప్రత్యర్థులకు హెచ్చరికలతో కూడిన సంకేతాలు పంపారు.
పవన్ ను చూసి తమ కుటుంబం ఎంతో గర్వపడుతుందన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు పవన్ అన్నారు. కానీ అతడి కంటే తక్కువ సినిమాలు నటించిన హీరోల వద్ద కోట్లాది రూపాయలు ఉన్నాయని.. పవన్ మాత్రం తాను సంపాదించిన ఆస్తిని పార్టీ కోసమే వినియోగిస్తున్నాడని చెప్పారు. చివరకు పిల్లల చదువులకు ఉన్న సొమ్మును సైతం ప్రజలకు పంచిపెడుతున్నాడని.. అటువంటి నాయకుడి గురించా మీరు మాట్లాడేదంటూ ఎమోషనల్ అయ్యారు. నాగబాబు మాట్లాడుతున్నంత సేపు అభిమానులు మౌనాన్నే ఆశ్రయించారు. ఆసాంతం శ్రద్ధగా విన్నారు. అటు నాగబాబు తాజా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసైనికులు రియాక్టవుతున్నారు. పవన్ ఆశయాన్ని, ఆయన ప్రజల గురించి పడుతున్న తపనను ప్రజలు తప్పకుండా అర్థం చేసుకోవాలని ఏపీ సమాజాన్ని కోరుతున్నారు.