Strong Counters To CPI Narayana: మెగాస్టార్ పై కానీ.. ఆయన కుటుంబసభ్యులపై కానీ ఎవరైనా విమర్శలకు దిగితే వెంటనే నాగబాబు కౌంటర్ ఇస్తారు. గట్టిగానే సమాధానం చెబుతారు. గతంలో చాలా సందర్భాల్లో ఇదే జరిగింది. వాస్తవానికి చిరంజీవి మృదు స్వభావి. తనపై ఎంతటి స్థాయి విమర్శలు వచ్చినా ఆయన స్పందించరు. కానీ నాగబాబు అలా కాదు. ఎవరైనా పురుష పదజాలంతో విమర్శలకు దిగినా అదే స్థాయిలో ప్రతివిమర్శ చేస్తారు. అవసరమైతే సవాళ్లు, ప్రతిసవాళ్లకు దిగుతారు. అవతలి వారు ఎంతటివారైనా చూడరు. నోటికి పని చెబుతారు. పదునైన మాటలతో కౌంటర్ ఇస్తారు. ఇప్పుడది సీపీఐ నారాయణ వంతు వచ్చింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై ఇటీవల నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. అయితే దీనిపై చిరంజీవి కానీ..పవన్ కళ్యాణ్ కానీ స్పందించలేదు. నాగబాబు మాత్రం సోషల్ మీడియా వేదికగా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సీపీఐ నారాయణగారు గత కొద్దిరోజులుగా ఆహారం తీసుకోవడం మానేశారు. ఎండుగడ్డి, చెత్తా చెదారం తిని బతుకుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు. అటువంటి తెలివితక్కువ మనిషి అన్న మాటలకు కోపం తెచ్చకోకుండా ఆయనకు కాస్తా అన్నం పెట్టండి అంటూ మెగా అభిమానులకు, జన సైనికులకు నాగబాబు పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ సర్కిల్ లో పెద్ద దుమారమే రేగుతోంది. తన సోదరులపై నారాయణ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో చిర్రెత్తికొచ్చిన నాగబాబు ఘాటైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. అసలు మెగా అభిమానుల మధ్యకు నారాయణ ఎందుకు వచ్చినట్టు? నాగబాబు ఎందుకు అంత రియాక్ట్ అయ్యారు? అసలేం జరిగింది అన్న దానిపై ప్రతిఒక్కరూ ఆరా తీస్తున్నారు.

చిరంజీవి ఊసరవెల్లి…
ఆ మధ్యన భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.అయితే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించడాన్ని సీపీఐ నారాయణ తప్పుపట్టారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు.. పార్టీలు మార్చుతున్న చిరంజీవిని పిలవడమేమిటని ప్రశ్నించారు. ఆయన్ను బదలులు సూపర్ స్టార్ కృష్ణను పిలిచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అంతటితో ఆగకుండా పవన్ కల్యాణ్ ను ల్యాండ్ మైన్ తో పోల్చారు. అది ఎప్పుడు పేలుతుందో.. ఎప్పుడు పేలదో తెలియదని ఎద్దేవా చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు మెగా అభిమానులు, జన సైనికులను బాధించాయి. గత ఎన్నికల్లో పవన్ వామపక్షాలతో కలిసి నడిచారు. ఓటమి ఎదురుకావడంతో బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి పవన్ ను వామపక్షాల నాయకులు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. పవన్ పై ఉన్న కోపం చిరంజీవిపై చూపిస్తున్నారు. మొన్నటి అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంపై మాట్లాడిన సీపీఐ నారాయణ పనిలో పనిగా చిరంజీవిపై విమర్శలు గుప్పించారు. అంటితో ఆగకుండా పవన్ పై కూడా స్పందించారు. అయితే అన్నదమ్ములపై ఎవరైనా విమర్శలు చేస్తే మాత్రం పవన్ ఊరుకోరు. వారి భరతం పట్టేలా వ్యాఖ్యలు చేస్తారు. అంతెందుకు సాక్షాత్ తన సోదరుడు హాజరైన అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్నే నాగబాబు ఎద్దేవా చేశారు. తన సోదరుడు తప్ప అందరూ భలే నటించారంటూ కామెంట్స్ చేశారు. దీనిపై బీజేపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అటువంటప్పుడు బీజేపీతో తెగతెంపులు చేసుకోవచ్చు కదా అని కొందరు నెటిజెన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పుడు అదే వేదికను టార్గెట్ చేసుకొని నారాయణ చేసిన కామెంట్లపై కూడా నాగబాబు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. అయితే దీనిపై నారాయణ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరీ.
బుల్లితెర కార్యక్రమాలపై..
అయితే సీపీఐ నారాయణ వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా ఆయన సినీ ప్రముఖులనే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా బుల్లితెరలో వస్తున్న కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆ మధ్య నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బీగ్ బాస్ షోను వ్యభిచార కొంపగా అభివర్ణించారు. వెకిలి చేష్టలు, అశ్లీలతలు కనిపించే బుల్లితెర కార్యక్రమాలను నిషేధించాలని కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై నాగబాబు యాక్టివ్ గా ఉన్నారు. నారాయణ వ్యాఖ్యాలు నాగబాబుకు చాలాసార్లు బాధ తెప్పించాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బహుశా అప్పటి నుంచి కూడా నాగబాబు నారాయణపై కన్నేసి ఉంచారని తెలుస్తోంది. అందుకే తన సోదరులపై కామెంట్స్ చేసిన తరువాత నారాయణను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు.