Murud Janjira fort history: భారత దేశంక్ష 1500 కోటలు ఉన్నాయి. సాధారణంగా రాజులు కోటలను కొండలపై నిర్మించేవారు. కానీ మహారాష్ట్ర తీరంలో అరేబియా సముద్రం మధ్యలో ఒక అద్భుతమైన కోట నిర్మించారు. దానిపేరు మురుద్–జంజీరా. ముంబై నుంచి 165 కిమీ దూరంలో, రాయ్‌గడ్ జిల్లాలోని మురుద్ గ్రామం సమీపంలో ఈ ద్వీప కోట ఉంది. 500 ఏళ్లుగా ఎవరూ దీనిని జయించలేకపోయారు. మొఘలులు, మరాఠాలు, పోర్చుగీసు వారూ ఓటమి పాలయ్యారు. ఇది భారత చరిత్రలో అత్యంత దుర్భేద్యమైన కోటగా నిలిచింది.
ఇంజినీరింగ్ అద్భుతం
ఈ కోటను కోడిగుడ్డు ఆకారంలో నిర్మించిన ఈ కోట సముద్రమట్టం నుంచి 90 అడుగుల ఎత్తులో ఉంది. పునాది సముద్రంలో 20 అడుగుల లోతు వరకు ఉండటం వల్ల అలల దాడులు, ఫిరంగి గుండ్లు పనిచేయలేదు. 40 అడుగుల ఎత్తున్న గోడలు కింద వెడల్పుగా (30 అడుగులు), పైకి సన్నగా (12 అడుగులు) ఉంటాయి. శత్రువులు ఎక్కలేని విధంగా. 22 గుండ్రని బురుజులు అన్ని దిక్కుల నుంచి కాల్పులు జరిపేలా డిజైన్ చేశారు. ఈ కోటకు రహస్య దర్వాజాలు ఉన్నాయి. షేర్ దర్వాజా 20 మీటర్ల దగ్గరకు వెళ్లే వరకూ కనిపించదు. దరియా దర్వాజ సముద్రం లోతైన నీటి వైపు తెరిచే రహస్య మార్గం. అత్యవసర సమయాల్లో ఉపయోగపడేవి. దీనిని ‘దొంగ ద్వారం‘ అని పిలిచేవారు. జంజీర్ కోటలో 1,914 ఫిరంగులు (కలాల్ బాండీ 22 టన్నుల బరువు, భారతదేశంలో మూడవ అతిపెద్ద ఫిరంగి) కిలోమీటర్ల దూరం నుంచే శత్రు ఓడలను ధ్వంసం చేసేవి ఎన్నాయి.
సిద్ధీల అపరాజిత సామ్రాజ్యం
5వ శతాబ్దంలో ఇథియోపియా (అబిసీనియా) నుంచి బానిసలుగా వచ్చిన సిద్ధీ జాతి వారు ఈ కోటను నిర్మించారు. ఢిల్లీ సుల్తానులు, బహ్మనీ సుల్తానుల వద్ద సైనికులుగా పనిచేసి, తర్వాత స్వతంత్రులయ్యారు. 1567లో మాలిక్ అంబర్ (ఇథియోపియా బానిస, నిజాం సేనాధిపతి) చెక్క కోట స్థానంలో రాతి కోట నిర్మాణం ప్రారంభించాడు. 22 ఏళ్లు, 22 ఎకరాల్లో నిర్మాణం పూర్తయ్యింది. 1618లో మాలిక్ అంబర్ తనను తాను మొదటి నవాబుగా ప్రకటించుకుని, స్వతంత్ర సముద్ర రాజ్యంగా మార్చాడు. జంజీరాను నావికాదళ రాజధానిగా అభివృద్ధి చేశాడు.
ఆక్రమణకు ప్రయత్నాలు..
అక్బర్ (1600), జహంగీర్ (1618), ఔరంగజేబు ప్రయత్నించినా విఫలమయ్యారు. ఔరంగజేబు స్నేహం చేయాల్సి వచ్చింది. 1670, 1682లో ఛత్రపతి శివాజీ, సంభాజీ మహారాజ్ ఎన్నిసార్లు ప్రయత్నించినా గెలవలేకపోయారు. సంభాజీ సురంగం తవ్వడానికి ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు. శివాజీ పద్మదుర్గ్ కోటను (జంజీరాకు 8 మైళ్ల దూరంలో) 1676లో నిర్మించాడు. 1818లో యుద్ధం చేయకుండా, రాజకీయ ఒత్తిడితో బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. 1948లో భారత్‌లో విలీనమైంది.
అసాధారణ రక్షణ వ్యవస్థ..
కోట చుట్టూ తక్కువ నీటిమట్టం, రాళ్లు, బురద ఉండడంతో ఓడలు దగ్గరకు రాలేవు, కూరుకుపోతాయి. 400 మీటర్ల దూరం నుంచి బోట్ల ద్వారా మాత్రమే చేరుకోవచ్చు. ఇక కోటలో వర్షపు నీటి నిల్వ గుంతలు (2 పెద్ద చెరువులు), మంచినీటి బావి, నెలల తరబడి నిల్వలు (బియ్యం, జొన్న, సజ్జ)ముట్టడిని తట్టుకునే శక్తి ఉండేవి. సముద్రం నుంచి చూస్తే పై గోడ మాత్రమే కనిపిస్తుంది. అసలు ఎత్తు, బలం దాగి ఉంటుంది. శత్రువులు అంచనా వేయలేకపోయారు. అన్ని దిక్కుల నుంచి కాల్పులు, శత్రు ఓడలు దగ్గరకు రాకముందే ధ్వంసం. కలాల్ బాండీ 3–4 కిమీ దూరం గురి తప్పకుండా కొట్టేది. ప్రవేశ ద్వారం వద్ద పులి–ఏనుగు శిల్పం (సిద్ధీల శక్తి చిహ్నం), లోపల పరిపాలనా భవనం, ఆయుధాగారాలు ఉండేవి.
ప్రధాన ఆకర్షణలు..
ఇక్కడి నుంచి బోట్ల ద్వారా కోటకు చేరుకోవచ్చు (20 నిమిషాల ప్రయాణం). నవాబు ప్యాలెస్ అవశేషాలు, మసీదు, బావులు, ఫిరంగులు ఇప్పటికీ కనిపిస్తాయి. 1958 చట్టం కింద రక్షిత స్మారకం. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు సందర్శనకు అనుమతి ఉంటుంది.
చరిత్రలో మురుద్–జంజీరా ప్రాముఖ్యం
సిద్ధీల నావికాదళం అరేబియా సముద్రంలో ఆధిపత్యం సాధించి, వాణిజ్య మార్గాలను నియంత్రించింది. పైరసీని అరికట్టి, స్థానిక మత్స్యకారులకు రక్షణ కల్పించింది. 16వ శతాబ్దంలోనే అంత లోతైన పునాది, స్ట్రాటజిక్ డిజైన్ ఆ కాలానికి అత్యాధునికం. యూరప్ కోటల కంటే ముందుగానే అడ్వాన్స్‌డ్ టెక్నిక్స్ వాడారు. మొఘలులతో సంధి, మరాఠాలతో పోరాటం, బ్రిటిష్‌తో ఒప్పందం సిద్ధీల డిప్లొమసీ గొప్పది. 300 ఏళ్లకుపైగా స్వతంత్రంగా ఉండగలిగారు. 500 ఏళ్ల అపరాజిత రికార్డు భారత కోటల చరిత్రలో ఇదే ప్రత్యేకత. ఇప్పుడు పర్యాటక ఆకర్షణగా, చరిత్ర పాఠశాలగా మారింది.
మురుద్–జంజీరా కేవలం కోట కాదు..సముద్రంలో నిర్మించిన యుద్ధ నౌక, ఇంజినీరింగ్ అద్భుతం, సిద్ధీల ధైర్య చిహ్నం. ఇది భారత రక్షణ వ్యూహాలకు, నావికాదళ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం. శతాబ్దాల తరబడి ఎవరూ గెలవలేని ఈ కోట, ఇప్పుడు పర్యాటకులకు చరిత్ర పాఠం నేర్పుతోంది.