Munugode Politics JP Nadda: మునుగోడు లో ఎన్నికల రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పోలింగ్‌కు గడువు సమీపిస్తున్న తరుణంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేయడంలో ఊహించని చర్యలకు పాల్పడుతున్నారు. ఒకపక్క మాటల తూటాలు పేలుతుంటే, మరోపక్క పోస్టర్లలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా మునుగోడులో ఎన్నికల రాజకీయం బౌండరీలు దాటి ఏకంగా గోతులు తవ్వి సమాధులు కట్టే దాకా వెళ్లింది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సమాధి..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డాకు మునుగోడు నియోజకవర్గంలో సమాధి కట్టడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో నడ్డాకు గుర్తుతెలియని వ్యక్తులు సమాధి కట్టారు. మట్టితో సమాధిని ఏర్పాటు చేసి దానిపై జేపీ.నడ్డా ఫోటోను పెట్టి పూలమాలవేసి పసుపు కుంకుమ చల్లి హంగామా చేశారు. అక్కడే నడ్డాతో ఫొటోతో ఏర్పాటుచేసిన పోస్టర్‌లో రీజనల్ ఫ్లోరైడ్ మిటిగేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ చౌటుప్పల్ అని రాసి పెట్టారు.
ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ హామీ నెరవేర్చలేదని..
మునుగోడుకు ప్రాంతీయ ఫ్లోరైడ్ సెంటర్ ఇవ్వనందుకు జేపీ.నడ్డాకు సమాధి కట్టినట్టు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇక ఈపని చేసింది టీఆర్‌ఎస్ కార్యకర్తలే అన్న టాక్ వినిపిస్తోంది. 2016 లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా జేపీ.నడ్డా మర్రిగూడలో పర్యటించి, చౌటుప్పల్ మండలంలో కచ్చితంగా ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక అదే సంవత్సరం 8.2 ఎకరాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు కోసం చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురంలో కేటాయించింది. ఆరేళ్లు గడిచినా ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కాలేదు.
బీజేపీ నేతల ఆగ్రహం..
మల్కాపురంలో ఇప్పటి వరకు ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయకపోవడంతో ఇచ్చిన హామీని నెరవేర్చలేదని జేపీ.నడ్డా సమాధి కట్టి ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఇక ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి రావడంతో బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసం ఇంతగా దిగజారుతారా అంటూ టీఆర్‌ఎస్ పార్టీ నేతల తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీకి ప్రజల ఆదరణ చూసి ఒర్చుకోలేకే ఈ చర్యలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు.
చట్టప్రకారం చర్యలు..
దండు మల్కాపురంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డాకు సమాధి కట్టడంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్ నాయకులు ఓటమి భయంతో ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గెలుపుపై విశ్వసం లేకపోవడంతోనే ఇలా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. మొన్న ముఖ్యమైన మంత్రి కేటీఆర్ బీజేపీ నేతకు ఫోన్‌చేసి బతిమిలాడడం, ఇప్పుడు నడ్డాకు సమాధి కట్టడం చూస్తుంటే టీఆర్‌ఎస్ నాయకులు ఓడిపోతామని ఫిక్స్ అయినట్లు అర్థమవుతోందని బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తెలిపారు. ఈమేరకు ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేశారు. సమాధి ముమ్మాటికీ టీఆర్‌ఎస్ నాయకుల పనే అని. దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రాంతీయ ఫ్లోరైడ్ సెంటర్ ఎక్కడ?
ప్రాంతీయ ఫ్లోరైడ్ సెంటర్ ఇస్తానంటూ హామీ ఇచ్చిన జేపీ నడ్డా ఇప్పటి వరకు ఆ మాట నిలబెట్టుకోలేదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశరావు విమర్శించారు. ఈమేరకు ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. బీజేపీ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఆరేళ్లయినా కేంద్రం ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్‌కు నయా పైసా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని హమీ ఇచ్చి మర్చిపోయారన్నారు. ‘అబద్ధపు çహామీలిస్తూ, ప్రజాగోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏం మోహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారు’ అని నిలదీశారు.