
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం పెట్రోలు, డీజల్ మీద మూడు రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీని రెండు రూపాయలు పెంచింది. రోడ్‌సెస్‌ను లీటర్‌కు ఒక్క రూపాయి పెంచింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లీటర్ పెట్రోల్‌పై సుంకం రూ.9.48గా, డీజీల్‌పై రూ.3.56గా ఉన్నది.
2014నాటికి అప్పటి యూపీఏ సర్కారు హయాంతో పోల్చుకుంటే మోడీ సర్కారు హయాంలో పెట్రోల్‌పై సుంకం 429శాతం, డీజీల్‌పై 142శాతం పెరిగింది. 2014, 2016 ఏడాదుల్లో పెట్రోల్, డీజీల్‌లపై కేంద్రం తొమ్మిది సార్లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది.
ఈ 15 మాసాల వ్యవధిలో లీటరు పెట్రోల్‌పై రూ. 11.77, లీటరు డీజిల్‌పై రూ. 13.47 ఎక్సైజ్ సుంకం పెరిగింది. దీంతో 2016-17లో ప్రభుత్వ ఖజానాకు రూ. 2,42,000 కోట్ల ఆదాయం సమకూరింది.
అంతర్జాతీయంగా భారీగా తగ్గిన ముడిచమురు ధరలననుసరించి చమురు సంస్థలు ధరలను సవరించినందున ఎక్సైజ్ ట్యాక్స్ పెంపుతో పెట్రోల్, డీజల్ రిటైల్ ధరలలో ఎలాంటి ప్రభావమూ ఉండబోదని ప్రభుత్వ అధికారులు వెల్లడించడం గమనార్హం. భవిష్యత్‌లో ధరలు పెరిగితే ఏమిటన్న ప్రశ్నకు వారి నుండి సమాధానం లేదు.
నిజానికి 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 84.16 డాలర్లు. 2018-19 కి ఈ థర 63.98 డాలర్లకు చేరుకోగా, గత సోమవారం నాటికి 31 డాలర్లు మాత్రమే పలికింది. కానీ, దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఈ కాలంలో తగ్గకపోగా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి.
అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పతనమైనప్పటికీ కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని పెంచడం పట్ల ప్రతిపక్షాలు విషయం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్థిక మాంద్యంతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలపై తాజా పెంపును నేరపూరితమైన దాడిగా అభివర్ణిస్తున్నాయి.