MLA Raja Singh: పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ మరో పది రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ గెలుపు కోసం కూటములు కడుతున్నాయి. ఇక దక్షిణాదిన ఈసారి పట్టు పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ ఈసారి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో మెజారిటీ స్థానాల్లో గెలవాలని భావిస్తోంది. ఇందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రధాని నరేంద్రమోదీ కూడా సౌత్ ఇండియాపై ఫోకస్ పెట్టారు.
రిలీజియన్ పాలిటిక్స్..
బీజేపీ అంటేనే మతపరమైన రాజకీయం. ఎన్నిల వేళ మతం ద్వారానే ఓట్లు అడుగుతుంది. ఆర్ఎస్ఎస్ అండతో అధికారంలోకి వస్తోంది. ఈసారి కూడా రిలీజియన్ పాలిటిక్స్ ద్వారానే సౌత్ ఇండియాలో పాగా వేయాలనుకుంటోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో మత రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉండే హైదరాబాద్ వేదికగా మరో ఎత్తుగడ వేయాలని భావిస్తోంది.
అసద్‌పై రాజాసింగ్ పోటీ..
తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 16 స్థానాల్లో విజేతలు మారుతున్నారు. హైదరాబాద్లోక్సభ స్థానం మాత్రం ఐదు పర్యాయాలుగా ఎంఐఎం మాత్రమే గెలుస్తుంది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎంఐఎంతో దోస్తీ చేసి అక్కడ అభ్యర్థిని కూడా నిలపలేదు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేసే అవకాశం ఉంది. కానీ, ఈసారి హైదరాబాద్ నుంచే కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను వచ్చే ఎన్నికల్లో అసదుద్దీన్‌పై పోటీకి దించాలని భావిస్తోంది.
బీజేపీకి బలం, బలహీనత..
హిందుత్వం బీజేపీకి బలం, బలహీనత. అలాగే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా బీజేపీకి కొన్ని సమయాల్లో బలం, కొన్ని సందర్భాల్లో బలహీనం. ఈ క్రమంలోనే ఆయన గతేడాది చేసిన వివాదాస్పద వ్యాఖ్యలో పార్టీకి నష్టం జరుగుతుందని భావించి సస్పెండ్ చేసింది. గతంలో నుపుర్ శర్మను కూడా ఇదే కారణంలో వేటు వేసింది. కరుడుగట్టిన హిందువుల కారణంగా బీజేపీకి అంతర్జాతీయగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాంటి సందర్భంలో మైనారిటీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినవారిపై వేటు వేస్తోంది.
జీహెచ్ఎంసీ వ్యూహంతో..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గణీయంగా పుంజుకుంది. ఇందుకు నాటి అధ్యక్షుడు బండి సంజయ్ ఒక కారణం. ఆయన కూడా కరుడుగట్టిన హిందుత్వ వాదే. బీఆర్ఎస్ ఎంఐఎం దోస్తీతో హైదబాద్‌ను ఉగ్రవాదులకు అడ్డాగామారుస్తున్నాయని, బీజేపీని గెలిపిస్తే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని ప్రకటించారు. పూర్తిగా హిందుత్వ ఎజెండాతోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 47 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఇదే వ్యూహాన్ని లోక్‌సభ ఎన్నికల్లో అమలు చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజాసింగ్‌ను హైదరాబాద్ లోక్‌సభ తెరపైకి తెస్తున్నారు కమలనాథులు. మరి బీజేపీ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.