MLA Muthireddy Yadagiri Reddy: ఉదయం నమస్తే తెలంగాణ ఎడిషన్ చూడగానే.. భారీ ఎత్తున కటౌట్లతో అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు, మధ్యలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోటోలు కనిపించాయి. అది గులాబీ పేపర్ కాబట్టి.. గులాబీ నేతల ఫోటోలు ఉండడం సహజమే. కాకపోతే అది ఒక ప్రకటన. దానిని యాడ్ పరిభాషలో జాకెట్ యాడ్ అంటారు. ఆ యాడ్ ఇచ్చింది జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి. నమస్తే తెలంగాణకు ఏబిసి రేటింగ్ లేకపోయినప్పటికీ అధికార పత్రిక కాబట్టి జాకెట్ యాడ్స్ వద్దన్నా వస్తాయి. ఎంత లేదనుకున్నా ఒక జాకెట్ యాడ్ విలువ 30 లక్షలకు పై చిలుకు ఉంటుంది. ఈ యాడ్ ఇచ్చింది ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కాబట్టి.. “నమస్తే” ఎంత ఉందో తెలియకపోయినప్పటికీ.. లక్షల్లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఆయనంటే అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి అది పెద్ద లెక్కలోది కాదు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇలా జాకెట్ యాడ్ ఇవ్వడమే ఒకింత ఆశ్చర్యంగా ఉంది.
పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. ముత్తిరెడ్డికి ఇటీవల ప్రకటించిన జాబితాలో స్థానం లభించలేదు. అయితే అనూహ్యంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు చర్చలోకి వచ్చింది. ఆయన జనగామ రావడం, దానిని ముత్తిరెడ్డి వర్గీయులు అడ్డుకోవడం.. వంటి పరిణామాలు జరిగాయి. ఇటీవలయితే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను ముత్తిరెడ్డి వర్గీయులు దహనం కూడా చేశారు. జనగామ పట్టణంలో నిరసనలు కూడా చేశారు. అయినప్పటికీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. అటు కేసీఆర్ కూడా జనగామ సీటు విషయంలో సస్పెన్స్ కు తెర దించలేదు.
ఈ లోగానే ముఖ్యమైన మంత్రి కేటీఆర్ అమెరికా నుంచి రాజధాని కి వచ్చారు. అదేరోజు నమస్తే తెలంగాణలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పెద్ద జాకెట్ ప్రకటన ఇచ్చారు. కేటీఆర్ అంతటి గొప్ప నాయకుడు లేడని అందులో పేర్కొన్నారు. ఆ మరుసటిరోజే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ బయలుదేరారు. వెంటనే కేటీఆర్ నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే పల్లా కూడా తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు. జనగామ విషయంలో సైలెంట్ గా ఉండాలని అన్నట్టు తెలిసింది. ఫలితంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్గీయుల్లో ఆనందం వెల్లివిరిసింది. దీంతో జనగామ తనకే అని ముత్తిరెడ్డి చెప్పుకోవడం ప్రారంభించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా జనగామ వైపు చూడటం మానేశారు.
ఇక తాజాగా ఈరోజు మరో జాకెట్ యాడ్ నమస్తే తెలంగాణలో ప్రచురితమైంది. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఈ ప్రకటన ఇచ్చినట్టు అందులో ఉన్న ఫోటోల ద్వారా స్పష్టమవుతోంది. ఆ మధ్య తన కూతురు భూకబ్జా కేసు పెట్టిన నేపథ్యంలో ముత్తిరెడ్డికి ముఖం చెల్లుబాటు కాకుండా అయింది. ఆయన కూతురు గట్టిగా నిలదీయడంతో ముత్తిరెడ్డి మీద కబ్జాదారుడు అనే ముద్ర పడింది. పైగా చేర్యాల ప్రాంతంలో ముత్తిరెడ్డి నిర్మించిన గోడను ఆయన కూతురు కూల్చివేసింది. ఇవన్నీ పరిణామాలు కెసిఆర్ కు చికాకు కలిగించాయని భారత రాష్ట్ర సమితి నాయకులు అంటున్నారు. అందుకే జనగామ స్థానాన్ని హోల్డ్ లో పెట్టినట్టు చెబుతున్నారు. అయితే ప్రగతి భవన్ కు దగ్గర మనిషైన పల్లా రాజేశ్వర్ రెడ్డికి జనగామ ఆఫర్ రావడంతో.. ఆయన ఈ నియోజకవర్గానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో తనకే సీటు దక్కేలా చూడాలని కేటీఆర్ ను ముత్తిరెడ్డి కోరడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అయితే ప్రస్తుత పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ముత్తిరెడ్డి జాకెట్స్ విసరడం ప్రారంభించారు. 15 రోజుల వ్యవధిలో నమస్తే తెలంగాణకు రెండు జాకెట్ యాడ్స్ ఇచ్చారు. మరి ఈ యాడ్స్ వల్ల కేసీఆర్ మనసు మారుతుందా? కేటీఆర్ మాట చెల్లుబాటు అవుతుందా? జనగామ స్థానం ముత్తిరెడ్డికి తిరిగి దక్కుతుందా? కాలం గడిస్తే తప్ప ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించవు.