Minister Mallareddy: తెలంగాణ రాజకీయాల్లో ఎవర్ గ్రీన్ కామెడీ మంత్రి ఎవరయ్యా అంటే అది మంత్రి మల్లారెడ్డినే. ఆయన కేసీఆర్ పై ప్రేమతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవంతో చేసే కామెంట్స్ భక్తిని చాటుకున్నా కానీ.. జనాలకు మాత్రం కామెడీలా కనిపిస్తాయి.. ప్రతీసారి కేసీఆర్, కేటీఆర్ ను నెత్తిన ఎత్తుకొని మల్లారెడ్డి తెలంగాణ అభివృద్ధి విషయంలో చేసే కామెంట్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్ చేసి మంత్రి మల్లారెడ్డి వైరల్ అయ్యారు.
సహజంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభివృద్ధి గురించి చెప్పాల్సి వస్తే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులైన కాళేశ్వరం పథకం, పించన్లు, రేషన్, కరెంట్ గురించి గొప్పగా చెబుతారు. అలా చెబితే నిజంగానే అప్పటికి ఇప్పటికీ అభివృద్ధి చెందిందని జనాలకు అర్థమవుతుంది.
కానీ మంత్రి మల్లారెడ్డి మాత్రం చాలా డిఫెరెంట్.. ఆయన దృష్టిలో అసలు అభివృద్ధి అంటే ‘వాకిలీ ఊడ్చే స్టైల్ మారిపోవడమే’. తాజాగా అసెంబ్లీలో మాట్లాడిన మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు తోటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే నవ్వు ఆపుకోలేకపోయారు. మల్లారెడ్డి అన్నా నువ్వు సూపరే అంటూ నవ్వేసుకున్నారు.
ఇంతకీ మల్లారెడ్డి చెప్పిన తెలంగాణ అభివృద్ధి కథ ఏంటంటే.. ‘తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందని.. ఒక పనిమనిషి మా పాత ఇంటికి కెనటిక్ బైక్ పై వచ్చి వాకిలి ఊడ్చి ముగ్గు వేసి మళ్లీ అదే బైక్ పై వెళ్లిపోయిందని.. కేసీఆర్ పాలనలో ప్రజలు ఎంతగా అభివృద్ధి చెందారో దీనికంటే గొప్ప నిదర్శనం’ మరొకటి లేదని కామెంట్ చేశారు. కేసీఆర్ వచ్చాక అభివృద్ధి జరిగిందనడం వరకూ ఓకే.. కానీ కేటీఆర్ ను కలుపుకొని.. ఆయన వచ్చాక కూడా అభివృద్ధి జరిగిందనడంలో నవ్వులు విరబూసాయి. దీనిపై నెటిజన్లు తగులుకున్నారు. వాకిలి ఊడిస్తే అభివృద్ధా అంటూ సెటైర్లు వేశారు. ‘బంగారు తెలంగాణ కోసం ఇలాంటి ఆణిముత్యాల్ని కేసీయార్ ఎలా పట్టుకోగలిగాడబ్బా’ అంటూ మరికొందరు ఎద్దేవా చేశారు. మొత్తంగా ఇప్పుడు మల్లారెడ్డి చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.