Minister KTR: కేటీఆర్.. ఉన్నత విద్యావంతుడు.. రెండు మూడు శాఖలను నిర్వహిస్తున్న మంత్రి. తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడు. వీటి అన్నింటికీ మించి యాక్టింగ్ సీఎం. సాధారణంగా ఒక ప్రెస్ మీట్ లో కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు జర్నలిస్టులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ప్రెస్ మీట్ కు ముందే హోంవర్క్ చేస్తాడు, ఇష్యూ బేస్డ్ గా మాట్లాడుతాడనే ఇందుకు కారణాలు. కానీ ఈ మధ్య ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇబ్బందికరంగా వినిపిస్తున్నాయి. తన మాటతీరులో ఫ్రస్ట్రేషన్ పాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తన వ్యాఖ్యల్లో రాజకీయ అపరిపక్వత ప్రతి బింబిస్తోంది. ఒక పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, రెండు మూడు శాఖలు నిర్వహించే మంత్రిగా, మరీ ముఖ్యంగా యాక్టింగ్ సీఎంగా ఆయన మాట్లాడే ప్రతి మాట మీద రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ ఒక ప్రత్యేక వాచ్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి ఏర్పాటు, అన్నింటికంటే ముఖ్యంగా భావి భారత ప్రధాని కావాలనే ఆర్భాటం, మిగతా పార్టీలన్నీ వృధా, మేమే ఈ దేశానికి సదా అని ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్ మీద ఒక లుక్కు, విశ్లేషణ సర్వసాధారణం. భారతీయ జనతా పార్టీని బట్టలు ఇప్పి బజారున నిలబెడతాం. దేశంలో ఇంతటి అసమర్థ ప్రధానమంత్రిని ఎప్పుడూ చూడలేదు అనే మాటలు కేడర్ ను సంతృప్తి పరచేందుకు అనవచ్చు. బిజెపి నుంచి కూడా ఇంతకంటే మర్యాద భాష వస్తున్నది కాబట్టి అది చల్తా అనుకోవచ్చు. మునుగోడు ఉప పోరు నేపథ్యంలో ఇది మరింత రంజుగా మారవచ్చు. అలాగే కిషన్ రెడ్డి ఫోన్లో పెగాసస్ ఉంది అనే మాటలు నవ్వు పుట్టించినా.. సరే ఇలాంటివి రాజకీయాల్లో మైండ్ గేమ్స్ లాంటివని సమర్ధించుకోవచ్చు.

అవి తెలియదా?
కిషన్ రెడ్డి ఇలాంటివి చూసే చూసే కేంద్రమంత్రి స్థాయి దాకా వచ్చాడు. వాస్తవానికి కిషన్ రెడ్డి మోడీ సమకాలికుడు. అప్పట్లో తన గురువు వెంకయ్య నాయుడుతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగి కెరీర్ ను నాశనం చేసుకున్నాడు గాని.. లేకుంటే ఆయన మరో అమిత్ షా అయ్యేవాడు. మొన్నటిదాకా కిషన్ రెడ్డి హోం శాఖలో పనిచేశాడు. అంటే తన ఫోన్లో స్పై వే ర్ ని కూడా తొలగించుకోనంత స్థాయిలో ఉన్నాడా? కేటీఆర్ చెప్పినట్టు తన సంగతి పక్కన పెడదాం. అప్పట్లో ఒక పెద్ద మనిషి తెలంగాణలోని ప్రతి వ్యక్తి జాతకం తన చేతిలో ఉందన్నాడు. అంటే ఏ స్థాయిలో పౌరుల వ్యక్తిగత సమాచారంలోకి జొరబడినట్టు? దీనిని కేటీఆర్ జస్టి ఫై చేయగలడా? అసలు పెగాసస్ స్పై వేర్ ప్రవేశపెట్టారో లేదోనని ఇప్పటికీ సుప్రీంకోర్టు తేల్చలేక పోతుంది. ఇక దీనిపై అప్పట్లో ది వైర్ అనే వెబ్ సైట్ వివాదాస్పద కథనం ప్రచురించి లెంపలేసుకుంది. అమ్నేస్టీ అనే వివాదాస్పద ఎన్జీవో కూడా పెగాసస్ పై వ్యాఖ్యలు చేసింది. తర్వాత మన్నించమని కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంది. ఈ పరిణామాలు కేటీఆర్ కు తెలియనివా? అసలు పెగాసస్ అనేది ఉందో లేదో ఇప్పటికీ సుప్రీంకోర్టు తేల్చలేక పోతున్నది. మరి 10 వేల ఫోన్లోకి చొప్పించారని కేటీఆర్ ఏ ఆధారంతో చెబుతున్నారు? హైదరాబాద్ సైబర్ పోలీస్ విభాగంలో నిష్ణాతులైన నిపుణులు ఉన్నారు. వారి సహాయంతో తన ఫోన్లో ఉన్న పెగాసస్ ను తొలగించుకోలేని స్థితిలో కేటీఆర్ ఉన్నాడా? పెగాసస్ అనేది అంత తోపులాంటి స్పై వేర్ ఏమి కాదు. ఆ లెక్కన చూస్తే భద్రత కారణాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కూడా ఫోన్లను టాప్ చేస్తోంది. వాయిస్లను రికార్డు చేస్తున్నది. దీనిని కేటీఆర్ ఖండించగలరా? శాంతిభద్రల కోణంలో అటు కేంద్రానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది తప్పదు. ఇక అప్పట్లో హై ఎండ్ స్పై వేర్ పరికరాల కొనుగోలు విషయంలోనే కదా ఏపీ ఇంటిలిజెన్స్ అధికారి వెంకటేశ్వర్రావు అడ్డంగా బుక్ అయింది. ఈ కేసులో తనకు లింకు లేకపోయినప్పటికీ.. డాటా చౌర్యం కేసులో మాత్రం ఆయన పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రముఖుల ఫోన్లు ట్యాప్ కాకపోతే ఆశ్చర్యపడాలి. సిబిఐ, ఈ డీ వంటివి వేట కుక్కల్లా మా మీద దాడులు చేస్తాయని కేటీఆర్ అనడం.. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వినిపించేవే. కానీ వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఖతం అవుతుందని చెప్పటం కేటీఆర్ వెక్కిరింపు కన్నా, రాజకీయ అపరిపక్వతే కనిపిస్తోంది. ఆయన అన్నట్టుగా ఏదో ఒక సందర్భంలో కాంగ్రెస్ ఖతం కావచ్చు. కానీ ఇప్పటికిప్పుడు ఆ పార్టీ అంతర్దానం అవడం అంత సులభం కాదు. చేయడం కూడా అంత ఈజీ కాదు.

“కాంగ్రెస్ ముక్త భారత్” అన్న నరేంద్ర మోడీ ఇప్పటికీ ఆపసోపాలు పడుతున్నాడు. కాంగ్రెస్ వ్యతిరేక కూటమి కట్టాలంటే బిజెపి, బిజెపి వ్యతిరేక కూటమి కట్టాలంటే కాంగ్రెస్.. కచ్చితంగా ఉండాల్సిందే. ఇక మోహన్ భగవత్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా చిల్లరగా ఉన్నాయి. అంటే ఒక వ్యక్తిని విమర్శించాలంటే ఆయన కచ్చితంగా కౌన్సిలర్ అయి ఉండాలా? కౌన్సిలర్ కాకపోతే విమర్శించే అర్హత ఉండదా? అసలు మోహన్ భగవత్ అంటే ఎవరో తెలియకుండానే కేటీఆర్ యాక్టింగ్ సీఎం అయ్యాడా? ఆర్ ఎస్ ఎస్ అనేది పొలిటికల్ పార్టీ కాదన్న విషయం కేటీఆర్ కు తెలియదా? ఆర్ఎస్ఎస్ భావజాలం మీద విమర్శలు చేయవచ్చు. కానీ ఇదేం విమర్శ? ఒక యాక్టింగ్ సీఎం ఇలానేనా మాట్లాడేది? ఈ మాట తీరుతోనేనా వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలి అనుకునేది? దీనిని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారనే సోయి కూడా ఉండదా? “రాజకీయం అనేది ఒక సెక్షన్ వరకే పరిమితం. తర్వాత అది అక్కడితోనే ఆగిపోతుంది. కానీ మనమంతా మనుషులం. హుందాగా ఉండాలి. హుందాగా వ్యవహరించాలి.” ఇది ఒకప్పుడు కేటీఆర్ నోటి నుంచి వెలువడిన ప్రసంగం. దురదృష్టం కొద్దీ ఇప్పుడు ఆయనే తనకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ₹450 కోట్లతో భవనం నిర్మించుకుంటున్నారని చేసిన విమర్శ చవక బారు కంటే నాసిరకం. అదే లెక్కన కెసిఆర్ కూడా ప్రగతిభవన్ నిర్మించుకున్నారు. మరి దీనిని కేటీఆర్ ఏ విధంగా సమర్ధించుకుంటారు? “అప్పట్లో కెసిఆర్ కూడా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను బ్రమిత్ షా అని గేలి చేసి మాట్లాడేవారు. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని కేటీఆర్ స్వీకరించినట్టు ఉన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చులకన అవుతున్నారు. ఏతావాతా కేటీఆర్ లో ఇప్పుడు ఫ్రస్టేషన్ పాళ్ళు ఎక్కువైపోయాయి. ఇప్పుడు అదే ఆయన మాట తీరులో కనిపిస్తోందని” బిజెపి నాయకులు అంటున్నారు. కానీ ఇంతవరకు టిఆర్ఎస్ క్యాంపు నుంచి దీనికి కౌంటర్ రాలేదు. మునుగోడు ఎన్నికలకు ముందే ఇలాంటి వాతావరణం ఉంటే.. మునుముందు పరిస్థితులు ఇంకా ఎలా ఉంటాయో?