భూ కబ్జా ఆరోపణలపై రైతుల ఫిర్యాదు మేరకు తెలంగాణ కేబినెట్ లోని సీనియర్ మంత్రి ఈటల రాజేందర్ పై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించడం కలకలం రేపింది. దీనిపై మీడియాలో కథనాలు రావడం.. కేసీఆర్ విచారణకు ఆదేశించడంతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
దీనిపై మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొన్ని మీడియా చానెల్స్ ముందస్తు ప్లాన్ తో కథనాలు ప్రసారం చేసి తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అత్యంత దుర్మార్గమైనదని.. నీతి బాహ్యమైనదని మండిపడ్డారు.
ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఒడిదుడుకులకు లోనైనా అంతిమ విజయం మాత్రం న్యాయానిదేనని ఈటల స్పష్టం చేశారు. చిల్లర ప్రచారం మానుకోవాలన్నారు. తనది స్వయంకృషితో ఎదిగిన చరిత్ర అని.. కావాలంటే తన మొత్తం చరిత్రమీద విచారణ జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ చేశారు.
ఏమీ లేనినాడే ఏ ప్రలోభాలకు లొంగకుండా కొట్లాడినవాడినని.. ఆత్మ గౌరవం ముందు ఏ పదవి తనకు గొప్ప కాదని.. ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ఈటల సవాల్ చేశారు.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట మారుమూల గ్రామాల్లో 2016లో ఎకరానికి 6 లక్షల చొప్పున 40 ఎకరాలు కొని పౌల్ట్రీ ఫాంలు పెట్టానని.. దాన్ని మరింత విస్తరిస్తూ 7 ఎకరాలు కొన్నానని ఈటల తెలిపారు. అక్కడి అసైన్డ్ భూమిని తనకు రైతులే వచ్చి స్వయంగా అమ్మారని.. తమ బిడ్డల పెళ్లిళ్లు అవుతాయని కొనమని రైతులు తనను ప్రాధేయపడ్డారని ఈటల తెలిపారు. అందుకే కెనరా బ్యాంకు నుంచి రూ.100 కోట్ల రుణం తీసుకొని కొని పౌల్ట్రీని విస్తరించినట్లు ఈటల తెలిపారు. పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేసుకొని మరీ కొన్నట్లు ఈటెల తనపై వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చారు.