Minister Botsa Satyanarayana: ఏపీలో మరో రాజకీయ చాలెంజ్ వెలుగు చూసింది. ఇప్పటివరకు సెల్ఫీ చాలెంజ్ లు కనిపించగా.. మంత్రి బొత్స ఏకంగా గుండు చాలెంజ్ కి వచ్చారు. వచ్చే ఉగాది నాటికి టిడిపి, జనసేన పార్టీలు ఉంటే తాను గుండు గీసుకుంటానని చాలెంజ్ చేశారు.ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతుంది. అయితే బొత్స మాట మీద నిలబడతారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గతంలో చాలామంది నాయకులు ఇదే మాదిరిగా చాలెంజ్లు విసిరారు. కానీ తర్వాత వాటిని లైట్ తీసుకున్నారు
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో బొత్స చాలెంజ్ వ్యాఖ్యలు చేశారు. టిడిపి,జనసేన లకు ప్రజలకు మంచి చేయాలన్న భావన లేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఆ పార్టీలకు ప్రజలు గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. కొంతమంది నేతలు మాట్లాడితే చెప్పులు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేశారు. 15 సంవత్సరాలుగా పార్టీని నడుపుతున్నాగెలుపు మాత్రం సాధ్యం కాలేదని ఎద్దేవా చేశారు.నీ స్టాండ్ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు వచ్చే ఉగాది తర్వాత తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏపీలో ఉండవని తేల్చి చెప్పారు. ఒకవేళ తన మాట నిజం కాకపోతే గుండు గీసుకుంటానని చాలెంజ్ చేశారు.
అయితే బొత్స ఆఫ్ ది రికార్డు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే ఎవరూ పట్టించుకోరు. ఏకంగా ప్రజల మధ్యనే సవాల్ చేశారు.ఈ వీడియో వచ్చే ఉగాది తర్వాత తప్పకుండా ట్రోల్ అవుతుంది. అయితే రాజకీయాల్లో ఇలాంటి చాలెంజ్ లు సహజమైపోయాయి. గతంలోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే మాదిరిగా చాలెంజ్ చేశారు. ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. ఓటమి ఎదురైనా చాలెంజ్ స్వీకరించలేదు.
తెలుగు నాట చాలామంది నాయకులు చాలెంజ్ లు విసిరారు. కానీ అమలు చేయలేకపోయారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ 100 సీట్లు గెలుచుకుంటే చెవి కోసుకుంటానని సిపిఐ నారాయణ ప్రకటించారు. కానీ ఆయన కోసుకోలేదు. బొత్సకు ఒకప్పుడు బినామీగా పేరొందిన బండ్ల గణేష్ బ్లేడ్ చాలెంజ్ చేసి పరువు పోగొట్టుకున్నారు. ఇప్పుడు అన్ని తెలిసి కూడా బొత్స గుండు చాలెంజ్ కి దిగారు. ఈయన పాటిస్తారో పాటించరో చూడాలి మరి.