Minister Amrnath And MLA Kannababu Raju: మింగ మెతుకు లేదు..మీసానికి సంపంగి నూనె అన్నట్టుంది ఏపీలో కొందరి ప్రజాప్రతినిధుల దుస్థితి. ప్రజలు నేరుగా వచ్చి సమస్యలు పరిష్కరించండి మహా ప్రభో అంటూ విన్నవిస్తున్నా ఏమిచేయలేని నిస్సహాయ స్థితి ప్రజాప్రతినిధులది. నిధులు, విధులు లేని అలంకారప్రాయమైన పదవుల్లో వారు కొనసాగుతున్నారు. అటువంటిది మారువేషాల్లో వెళ్లి ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకోవాలని ప్రయత్నం కొంచెం అతిగా ఉంది కదూ. పైగా ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేయించడం వారు ఏం ఆశించారో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి వ్యవహారం అటుతిరిగి ఇటు తిరిగి బూమరాంగ్ అయ్యింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇద్దరు ప్రజాప్రతినిధులు మారు వేషాల్లో ప్రజల మధ్యకు వెళ్లడం, అవి సోషల్ మీడియాలో వెలుగుచూడడం చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధుల ఓవరాక్షన్ పై అటు నెటిజెన్లు, సామాన్యులు సైతం ఏకిపారేస్తున్నారు. ఇటీవల నాయకులు తమ ప్రచారానికి యూట్యూబ్ చానళ్లను వాడుకోవడం విచ్చలవిడిగా మారింది. ఉదయం మార్నింగ్ వాక్ నుంచి సాయంత్రం వరకూ జరిగే కార్యక్రమాలను వీడియోలుగా చిత్రీకరించి ఎడిట్ చేయడం, వాటిని యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడం పరిపాటిగా మారిపోయింది. సోషల్ మీడియా వేదిక ద్వారా నాయకులుగా ఎదిగిన వారు, నాయకత్వాన్ని మరింత పెంచుకున్న వారున్నారు. కానీ ఇటువంటివి చూసీ యూట్యూబర్ల ముఖాలు వాచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకులు చేసిన అతి వారికి చేటు తెచ్చి పెట్టింది. అప్రతిష్టపాలు చేసింది.
అనకాపల్లి ఎమ్మెల్యే, ఈ మధ్యనే మంత్రి పదవి దక్కించుకున్న గుడివాడ అమర్నాథ్ మారువేషంలో ప్రజలు మధ్యకు వెళ్లారు. జీన్ ఫాంట్ టీషర్ట్,టోపీతో పాటు మాస్కు వేసి ఎవరూ గుర్తుపట్టలేని విధంగా ఆయన మారారు. అంతలా మేకప్ వేశారు. కనీసం ఇంట్లో కూడా ఆయనను గుర్తు పట్టలేని విధంగా తయారుచేశారు. అయితే తనను ఎవరూ గుర్తుపట్టలేదనుకున్నారో ఏమో..నియోజకవర్గ ప్రజలను పలకరించడానికి రోడ్లపై కి వచ్చారు. పాలన ఎలా ఉంది. రోడ్లు, కాలువలు, ఇతరత్రా మౌలిక వసతుల కోసం ఆరా తీశారు. అయితే ఒకటి, రెండు చోట్ల తప్పించి మిగతా చోట్ల మాత్రం ప్రజలు వీరలెవల్ లో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ తీరుపై, పథకాలపై తూలనాడుతూ మాట్లాడారు. అయితే ఈ పరిస్థితులను చూసి మంత్రి బెంబేలెత్తిపోయారు.
Also Read: Petrol Price In AP: దేశ ప్రజలపై కనికరం చూపిన మోడీసార్.. పెట్రో ధరల తగ్గింపు
కానీ ఎడిటింగ్లో ప్రతికూల సీన్లు కట్ చేసి..ప్రజల నుంచి వచ్చిన అనుకూల వ్యాఖ్యలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. దీంతో నెటిజెన్లు భలే కవర్ చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ నోటా..ఈ నోటా నియోజకవర్గం మొత్తం మంత్రిగారి సోషల్ మీడియా ప్రయత్నాలు వైరల్ అయ్యాయి. ఇదేంది అమాత్యా.. సమస్యలు పరిష్కరించాలనుకుంటే ఇదా మార్గం అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకంతా హంగామా అంటూ అనకాపల్లి వాసులు తెగ ఆడేసుకుంటున్నారు. అయితే మొత్తం వీడియోలో ఎమ్మెల్యే ఉరఫ్ మంత్రిని హీరోను చేయబోయి.. చులకన చేశారు. దీని వల్ల యూట్యూబ్ ఛానల్ వరకూ సక్సెస్. కానీ.. మంత్రికి ఊరంత అప్రతిష్ట రూపంలో మైనస్ ఎదురైందట. ప్రస్తుతం మంత్రి దావోస్ పర్యటనలో ఉన్నారు. ఇలాంటి ఎన్నో పర్యటనలు.. ఇతరత్రా ప్రజా సంబంధిత విషయాల్లో ఆయన ఉండితీరాలి. ప్రజా జీవితంలో ఉంటే వ్యక్తులు హుందాగా ఉండాలి. కానీ.. ఇలాంటి వీడియోల వల్ల ఆయన ఇజ్జత్ కు సవాల్ విసిరినట్టేకదా.
మంత్రి అవతారంతో మరో ఎమ్మెల్యే తీరు ప్రస్తావనకు వచ్చింది. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు చాలా హుందా అయిన నాయకుడు. నిండైన ఆహార్యం ఆయన సొంతం. ముక్కుసూటిగానే ఉండే ఆయన నాయకుడ్ని సైతం కొందరు యూట్యూబర్లు బొల్తా కొట్టించారు. ఆయన్ని ఫక్తు రాజకీయన నేతగా చూడాల్సిన జనాలకు ఇంకోలా చూపించారు. మారు వేషంలోనే వెళ్లాలని.. అప్పుడు నియోజకవర్గంలో బాగోగులు తెలుస్తాయని చెప్పారో ఏమో.. కన్నబాబు రాజు ఒక స్వామీజీ వేషాన వెళ్లారు. తీరా ఆయన పర్యటించిన నాలుగైదు ప్రాంతాల్లో ఆయన్ని గుర్తు పట్టేసిన వాళ్లు చాలా మందే. అయితే గుర్తుపట్టని వారికి అధికారులకి మాత్రం ఇది షాక్ ఇచ్చే పరిణామం. అందులోనూ వెనకాతల కెమెరాలు ఉన్నాయని పసిగట్టిన వారికి మాత్రం ఇది డ్రామా అని తేలిపోయి నవ్వేసుకున్నారు. ఇది జరిగి చాలాకాలం అయినా.. ఏ వేషంలో ఎవరోస్తారో.. అని కేవలం అధికారులే మాట్లాకుని నవ్వుకునే సందర్భాలు అనేకం.