Telangana Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. రోజురోజుకూ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. మూడు ప్రధాన పార్టీల్లోనూ వలసలపై సీరియస్ చర్చలు జరుగుతున్నాయి. మూడో కంటికి తెలియకుండా సంప్రదింపుల పర్వం ఊపందుకుంది. వీలైతే టికెట్ లేదంటే ప్యాకేజ్.. ఇవే చర్చల్లోని కీలక అంశాలు. ప్రధాన పార్టీల్లో ఇలాంటి పాలిటిక్స్ కొనసాగుతుండగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల్లో ఇవి కాస్త ఎక్కువే ఉన్నాయి. టికెట్ కన్ఫామ్ చేస్తే వెంటనే చేరిపోవడానికి కూడా నేతలు రెడీ అంటున్నారు. ఒకవేళ అప్పటికే వేరే వ్యక్తికి టికెట్ ఖరారైతే ప్యాకేజీ డీల్‌పై దృష్టి పెడుతున్నారు.
కాంగ్రెస్ లో ఇదీ పరిస్థితి..
కాంగ్రెస్‌లో టికెట్ విషయంలో తుది నిర్ణయం ఏఐసీసీదే. దీంతో రాష్ట్ర స్థాయిలోని నేతలు పార్టీలో చేరే నేతలకు నిర్దిష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నారు. పీసీసీ చీఫ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీలు చర్చించుకుని ఏఐసీసీకి ప్రతిపాదనలు పంపుతున్నా అంతిమ నిర్ణయంపై స్పష్టంగా భరోసా కల్పించలేక పోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుపై మాత్రం రాష్ట్ర నేతలు హామీ ఇస్తున్నారు. కానీ కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నవారు మాత్రం వీలైతే టికెట్ లేదా ప్యాకేజీ అని పట్టుబడుతున్నారు.
బీఆర్‌ఎస్ నేతలపై ఆశలు..
పార్టీలో భారీగా చేరికలు ఉంటా యంటూ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మాణిక్‌రావ్ థాక్రే సహా చాలామంది నేతలు ప్రకటనలు చేశారు. ఈనెలాఖరుకు మరికొంతమంది చేరడం ఖాయమనే సంకేతాలను పార్టీ నేతలు ఇచ్చారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌లో సిట్టింగులకే సీట్లు అని పార్టీ అధినేత పలు సందర్భాల్లో ప్రకటన చేయడంతో టికెట్‌పై ఆశలు పెట్టుకున్నవారు ఆలోచనలో పడ్డారు. ఇతర పార్టీల్లో గెలిచి బీఆర్‌ఎస్ గూటికి చేరిన ప్రాంతాల్లో పలువురు గులాబీ ఆశావహులు, గతంలో పోటీ చేసి ఓడిపోయిన వారు ఈసారి టికెట్ దక్కడంపై అనుమానంతో ఉన్నారు. ఇలాంటివారు కాంగ్రెస్‌లోకి వస్తారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. బీఆర్‌ఎస్ నుంచి తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనిత, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే చేరిక ఖాయమని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. షరా మామూలు తరహాలో తాము పార్టీని వీడడం లేదంటూ గులాబీ నేతలు స్టేట్‌మెంట్ ఇస్తున్నారు.
బీజేపీ ఆపరేషన్ లోటస్..
ఇక బీజేపీ కూడా వంద రోజుల యాక్షన్‌లో భాగంగా ఆపరేషన్ లోటస్‌కు శ్రీకారం చుట్టింది. బీఆర్‌ఎస్ అసంతృప్తులకే గాలం వేస్తోంది. కాంగ్రెస్‌లోని నేతలు కూడా బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే అధిక శ్రావణం(శూన్యమాసం) కారణంగా చేరికలు ఆగాయని, శ్రావణంలో ఊపందుకుంటాయని కమలనాథులు చెబుతున్నారు.
హామీపై స్పష్టత కోసం..
ఇక ఏ హామీ లేకపోతే ఎందుకు చేరుతారని కొందరు ఎదురవుతున్న ప్రశ్నలు. తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ వీలైనంతగా హైదరాబాద్ లోనే మకాం వేస్తారని, కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్ తదితరులతో సంప్రదింపుల తర్వాత టికెట్ ఇవ్వడానికి అభ్యంతరం లేదనే హామీని ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలిసింది. పార్టీలు మారుతున్న నేతలంతా టికెట్, ప్యాకేజ్, పోస్టు కోసమే పట్టుబడుతున్నారు. స్థాయికి తగినంతగా ప్యాకేజీ రేట్ ఫిక్స్ అవుతుంది. ఒక్కో పార్టీలో ఒక్కో తీరులో ఇది గుట్టుచప్పుడు కాకుండా సెటిల్ అవుతోంది.
వలసలపై బీఆర్‌ఎస్ స్పెషల్ ఫోకస్
ఇక అధికార బీఆర్‌ఎస్ సైతం వలసలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్, బీజేపీలోని అసంతృప్త నేతలపై దృష్టి సారించింది. గ్రామ స్థాయిలో ఆ పార్టీల గ్రాఫ్ పెరుగుతుందనే ఉద్దేశంతో వీలైనంతగా డీమోరల్ చేయాలని చూస్తోంది. అయితే ఆకర్షించే ప్రయత్నాలు, ప్యాకేజీలతో కాంగ్రెస్‌ను వీక్ చేయడం కూడా బీఆర్‌ఎస్ టాస్కుగా మారింది. టికెట్‌పై కాకుండా కార్పొరేషన్ పోస్టు లేదా ఇతర నామినేటెడ్ అవకాశాలపై హామీ ఇస్తుంది.