TDP BJP Alliance: తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉంది. అధినేత చంద్రబాబు జైల్లో ఉన్నారు. ఆయన కుమారుడు లోకేష్ చుట్టూ కేసులు అల్లుకుపోతున్నాయి. వాటి నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ఏపీ సీఎం జగన్ తో పాటు కేంద్ర పెద్దలు పన్నాగం పన్ని చంద్రబాబును జైల్లో పెట్టారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటువంటి తరుణంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో లోకేష్ బేటి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ కు కాస్త ఉపశమనం దక్కిందన్న వార్తలు వస్తున్నాయి.
ఎన్నికల ముంగిట కేసులతో జగన్ సర్కార్ చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కోర్టుల్లో సైతం ఊరట దక్కడం లేదు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ నెల రోజుల నుంచి ఢిల్లీలోనే పడిగాపులు కాస్తున్నారు. కానీ చంద్రబాబు బయటపడే మార్గాలేవి కనుచూపుమేరలో కనిపించడం లేదు. ఇటువంటి తరుణంలో తెలుగు రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి, పురందేశ్వరి చొరవ తీసుకుని లోకేష్ ను అమిత్ షా వద్ద కూర్చోబెట్టారు. అయితే కీలక ప్రతిపాదనలతోనే ఈ భేటీ జరిగిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా బిజెపిలో తెలుగుదేశం పార్టీ విలీనం జరుగుతుందన్న వార్త ఒకటి బయటకు వచ్చింది. తాజాగా మంత్రి అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. అమిత్ షా ను లోకేష్ కలిసింది బిజెపిలో టిడిపి విలీనం కావడానికేగా? అంటూ అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు.
కొద్ది రోజుల కిందటే చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. కీలక చర్చలు జరిపారు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు చిగురించిందని వార్తలు వచ్చాయి. కానీ చంద్రబాబు తాజా అరెస్టు తర్వాత పరిస్థితి మారిపోయింది. అప్పట్లో చంద్రబాబు అమిత్ షాను కలిసింది కేసులో విషయము మీదనేనని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల బిజెపి అధ్యక్షులతో వెళ్లి లోకేష్ అమిత్ షా ను కలవడం కొత్త అనుమానాలకు దారితీస్తోంది. సాధారణంగా ఢిల్లీలో ఎంపీల బృందంతో కలవడం ఆనవాయితీ. కానీ రెండు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో కలవడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అటు మంత్రి అంబటి తాజా అనుమానం సైతం వైరల్ అవుతోంది.
అయితే బిజెపిలో తెలుగుదేశం పార్టీ విలీన ప్రక్రియ సాధ్యమేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏపీలో బిజెపి బలం అంతంత మాత్రం. అటువంటి పార్టీలో తెలుగుదేశం పార్టీ విలీనం జరిగే పనేనా? దానికి టిడిపి శ్రేణులు ఒప్పుకుంటాయా? ఒక వేళ విలీనం జరిగినా పూర్తిస్థాయిలో ఓట్ల బదలాయింపు జరుగుతోందా? అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. ఇది కేవలం రాజకీయ ప్రత్యర్థుల ఎత్తుగడగా తెలుస్తోంది. ఒకవేళ టిడిపి విలీనమై.. చంద్రబాబు కేసుల నుంచి బయట పడితే.. బిజెపిపై ఒక రకమైన అపవాదు ఏర్పడుతుంది. అది బిజెపి ప్రత్యర్థులకే లాభిస్తుంది. అందుకే భారతీయ జనతా పార్టీ పెద్దలు అంత సాహసానికి దిగరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.