Government Land Encroachment: ఇది సర్కారు వారి భూ పందేరం. తమ పార్టీలో ముఖ్య నాయకులకు అడ్డగోలుగా భూములను కట్టబెడుతూ తీసుకున్న నిర్ణయం. నిబంధనలకు విరుద్ధంగా.. నియమాలకు వ్యతిరేకంగా సాగించిన భూ తంత్రం. దళితులకు మూడు ఎకరాలు ఇచ్చేందుకు మనసు రాని సర్కార్ కు, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చేందుకు మనసు ఒప్పని ప్రభుత్వానికి.. పెద్దలకు ఇచ్చేందుకు మాత్రం చేతులు వస్తున్నాయి. అడ్డగోలుగా భూములు కట్టబట్టేందుకు రాత్రికి రాత్రే జీవోలు మారిపోతున్నాయి. పైకి విలువల సారం చెబుతూ.. దేశాన్ని బంగారమయం చేస్తామని అంటూ.. చివరికి భూములు బీ ఆర్ ఎస్ పార్టీ నేతల పాదాక్రాంతమవుతున్నాయి.
కేశవరావు భూ మంతర్
భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ చైర్మన్ కేశవరావు కుటుంబ సభ్యులు బంజరాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో 30 కోట్లు ఉంటుంది. అయితే దీనిని కేవలం 5.5 లక్షలకు క్రమబద్ధీకరించుకున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. ప్రభుత్వ భూములకు జీవో 59 ప్రకారం నిర్ణీత ధర చెల్లించాలని నోటీసులు ఇస్తున్న ప్రభుత్వం.. పేదల ఇళ్లకు బుల్డోజర్లను పంపిస్తున్న ప్రభుత్వం.. తమ పార్టీ పెద్దల విషయంలో మాత్రం విపరీతమైన “భూ”దారత చూపిస్తోంది. తాను జారీ చేసిన జీవో 59 ని తుంగలో తొక్కి కే కేశవరావు కుటుంబ సేవలో బ్రహ్మాండంగా తరిస్తోంది. ఏకంగా 1,586 గజాలను నాను మాత్రం ధరకు క్రమ బద్దీకరించింది. కేకే కుమార్తె, హైదరాబాద్ ప్రధమ పౌరురాలు గద్వాల విజయలక్ష్మి పేరుతో 425 గజాలను రిజిస్ట్రేషన్ చేయించింది. మరో 1161 గజాలను కేకే తనయుడు పేరిట రిజిస్ట్రేషన్ చేసింది. ప్రభుత్వ రికార్డుల్లో భూమి ధర ప్రకారం చెల్లిస్తే వీళ్లు 10 కోట్ల దాకా చెల్లించాల్సి వచ్చేది. అయితే వీరు చెల్లించింది కేవలం 5.5 లక్షలు మాత్రమే. అంటే వంద రూపాయలు చెల్లించాల్సిన చోట అర్ధ రూపాయి చెల్లించారు. ఇక ఈ వివాదాస్పద భూమి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో 403 సర్వే నెంబర్ లో ఉంది. ఇదే సర్వే నెంబర్ లో మురికివాడలో ఉన్న ఇద్దరు నిరుపేదలకు 71 గజాలు, 53 గజాల ఫ్లాట్లను రెగ్యులైజ్ చేసేందుకు స్థానిక తహసిల్దార్ ప్రభుత్వం తరఫున 11.5 లక్షలు, ఐదు లక్షలు ముక్కుపిండి వసూలు చేశారు. ఇవి కూడా చెల్లించలేని పేదల గృహాల మీదికి బుల్డోజర్ ను నడిపారు. ఎంపీ సంతానం మీద చూపిన దయ ఈ పేదల మీద ఎందుకు చూపించడం లేదో ప్రభుత్వమే చెప్పాలి.
ఇదీ జరిగింది
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 కు వెనుక ఉండే ఎన్బిటి నగర్ లో సుమారు 2,500 గజాల ప్రభుత్వ స్థలం ఉంది. అది కేశవరావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన స్వాధీనంలోకి వెళ్ళింది. అందులో కొంత స్థలంలో ఆయన ఇల్లు కట్టుకున్నారు. మిగతా 1586 గజాలలో కూతురు విజయలక్ష్మికి 425 గజాలు, కుమారుడికి 1161 గజాలు పంచి ఇచ్చారు. వాళ్లు కూడా ఆ స్థలాల్లో కొంతవరకు ఇళ్ళు కట్టుకున్నారు. మరికొంత ఖాళీగా ఉంచుకున్నారు. ఆక్రమించిన ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించుకొని, రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించడంతో కేకే కుమార్తె, కుమారుడు కొన్నాళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న జీవో 59 నిబంధన ప్రకారం 425 గజాల స్థలానికి ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పేర్కొన్న విలువలో 50% రుసుముగా వసూలు చేయాలి. ఇక ప్రస్తుతం ఎన్బిటి నగర్ లో గజం విలువ 73,200గా ఉంది. ఈ లెక్కన 50 శాతం అంటే గజానికి 36,600 చొప్పున 1.55 కోట్ల రుసుము విజయలక్ష్మి చెల్లించాలి. అలాగే, కేకే తనయుడు 1161 గజాల స్థలానికి 100% బుక్ వ్యాల్యూ ప్రకారం 8.49 కోట్లు చెల్లించాలి. అంటే రెండు స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వానికి ఇవ్వాలి ఇద్దరు 10.4 కోట్లు చెల్లించాలి. కాని వారి చెల్లించింది కేవలం 5.5 లక్షలు. అంటే గజానికి 350 చొప్పున రుసుముగా నిర్ణయించారు.
అంతా వారి ఇష్టం
కేకే కుమార్తె విజయలక్ష్మి కి చెందిన 425 గజాలకు 1,48,750 ఫీజు తీసుకొని గత జూన్ 12న బంజరా హిల్స్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేశారు. షేక్ పేట తహసిల్దార్ కార్యాలయంలోని ఒక అధికారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీవో 59, 56 కింద ఈ రెండు స్థలాల రిజిస్ట్రేషన్ అధికారాలు కట్టబెట్టారు. ఆయన 56 జీవోలో పేర్కొన్న మేరకు గజానికి 350 చొప్పున 425 గజాలకు 1,48,750 ఫీజుకు చలానా తీసుకున్నారు. అనంతరం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి స్థలాన్ని విజయలక్ష్మికి రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో వివాదాస్పద భూమి ఆమె సొంతమైంది. ఇదే తరహాలో కేకే కుమారుడికి 1161 గజాలకు కూడా గజానికి 350 చొప్పున కేవలం 4,06, 350 తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించారు. వీరిద్దరి స్థలాల బహిరంగ మార్కెట్ విలువ 30 కోట్లకు పైగానే ఉంటుంది. జీవో నెంబర్ 59 ప్రకారం ప్రభుత్వ పుస్తకాల్లో ఉన్న ధర వసూలు చేసినా 10.4 కోట్లు ప్రభుత్వానికి రావాలి. వచ్చింది కేవలం 5.5 లక్షలు మాత్రమే.