YCP: వైసీపీ నేతల తీరుతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రజలకు నరకయాతన చూపిస్తున్నారు. మీకోసం అన్నీ చేసే ప్రభుత్వం కోసం.. కొన్ని గంటలపాటు ఇబ్బంది పడలేరా? అంటూ తిరిగి ప్రశ్నిస్తుండడం పెను దుమారానికి కారణమవుతోంది.ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి దోహదం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సామాజిక సాధికార యాత్ర పేరిట.. బస్సు యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర కోసం ప్రధాన రహదారులు, కూడళ్లను వేదికలుగా ఏర్పాటు చేస్తుండడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
విజయవాడ నగర ప్రజలు వైసీపీ నేతల తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. విజయవాడ భవానిపురం క్రాంబ్వే రహదారిపై శివాలయం సెంటర్ వద్ద అనుమతి లేకుండా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. అయితే ఉదయం నుంచి ఈ మార్గంలో వాహనాలను అనుమతించకుండా బారికెట్లు ఏర్పాటు చేశారు. రహదారి మధ్యలో వేదికను ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. అటు రోడ్డు పొడవునా గోతులు తవ్వి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో అటువైపు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. దాదాపు రోజంతా ఇదే పరిస్థితి నెలకొంది.
సామాజిక సాధికార యాత్రలో భాగంగా.. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ప్రజలకు వైసీపీ నేతలు చుక్కలు చూపించారు. ఆదివారం సాయంత్రం అక్కడ బస్సు యాత్ర చేపట్టారు. ఇందుకుగాను శనివారం అర్ధరాత్రి నుంచే రహదారిని బ్లాక్ చేశారు. దాదాపు కిలోమీటర్ మేర భారీ ఫ్లెక్సీలతో నింపేశారు. రోడ్డుకు అడ్డంగా బారికేట్లు ఏర్పాటు చేసి ప్రజలను అడ్డగించారు. దీంతో అత్యవసర అనారోగ్య సమయాల్లో పట్టణానికి రావాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణ శివారుల నుంచి నడుచుకొని రావాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.
అయితే ఈ తరహా చర్యలను వైసీపీ శ్రేణులు సమర్ధించుకోవడం విశేషం. ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో రకాల మంచి పనులు చేస్తోంది. కొద్దిసేపు మీరు అసౌకర్యాన్ని తట్టుకోలేరా? అంటూ వైసీపీ శ్రేణులు ప్రజలను ప్రశ్నిస్తుండడంతో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా రహదారుల మధ్యన సమావేశాలు ఏర్పాటు చేసి.. చిందులు వేస్తుండడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. సభలు, సమావేశాలకు వేదికగా ఎన్నో కేంద్రాలు ఉంటాయని.. అటువంటి వాటిలో పెట్టుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదని.. కానీ వైసీపీ నేతలు మాత్రం జనాదరణను చూపించేందుకు.. రహదారులపై సభలు ఏర్పాటు చేస్తుండటంపై మాత్రం విమర్శలు రేగుతున్నాయి. ఎన్నికల ముంగిట ఇటువంటివి చేపెడితే తప్పకుండా మైనస్ అవుతుందని విశ్లేషణలు సైతం ప్రారంభమయ్యాయి.