Media Ban: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కొత్తలో కేసీఆర్ ను ఇక్కడి బలమైన మీడియా చెడుగుడు ఆడేసింది. ఎక్కువ శాతం టీడీపీకి అనుకూలంగా ఉండడంతో నాటి ఏపీ సీఎం చంద్రబాబును దేవుడిగా.. అపర వీరుడిగా చూపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను అక్కరకు రాని పాలకుడిగా ఫోకస్ చేశారు. కానీ ఏమైంది.. కేసీఆర్ కు మండి రెండు టాప్ న్యూస్ చానెళ్లను నిషేధించారు. ఒక టాప్ చానెల్ సీఈవోనే చానెల్ నుంచి తొలగించారన్న గుసగుసలు మీడియా సర్కిల్స్ లో వినిపించాయి.. దీంతో తెలంగాణలో మీడియా పూర్తిగా కేసీఆర్ దారికొచ్చింది. ఇప్పుడు జగన్ ను ఏపీలో టీడీపీ అనుకూల మీడియా వేటాడుతోంది. కేసీఆర్ బాటలోనే జగన్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తన్న నాలుగు మీడియా ఛానెళ్లను నిషేధిస్తున్నట్లు ఏపీ మంత్రి కొడాలి నాని ప్రకటించారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలకు ఈ పత్రికలు, టీవీ ఛానళ్లను ఆహ్వానించొద్దంటూ ఆదేశించారు. కొద్ది రోజులుగా సీఎం జగన్ తో పాటు వైసీపీ నాయకులపై అబద్ధాలు ప్రసారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని, అందువల్ల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఈనాడు, టీవీ5 చానెళ్లను ప్రసారం చేయకుండా చేయాలని నిషేధించారు. అంతేకాకుండా వైసీపీ నాయకులెవరు ఈ మీడియా సంస్థలోకి వెళ్లి మాట్లాడొద్దని.. ప్రెస్ మీట్లకు కూడా వారిని పిలవొద్దని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కొడాలి నాని పలు విషయాలను వెల్లడించారు.
రైతులకు, వ్యవస్థలకు దళారీలా వ్యవహరిస్తున్న చంద్రబాబు దుర్మార్గ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయనకు వంత పాడుతూ ఈ ఛానెల్లు అసత్య ప్రసారం చేస్తున్నాయన్నారు.రాష్ట్రంలో మార్కెట్లో ఉన్న ధరలకన్నా అధిక ధరలు చూపిస్తూ నిత్యావసరాల ధరలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు అబద్ధాలను ప్రసారం చేస్తూ మీడియా సంస్థలు దిగజారిపోయాయన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఈ ఛానెళ్లు చంద్రబాబు చెప్పిందే చూపిస్తూ ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తున్నాయన్నారు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ అధికార ప్రతినిధులు ఆ చానెళ్లను నిషేధించాలని ఆదేశించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం గానీ, మాట్లాడడం గానీ చెయేద్దని వైఎస్ఆర్ శ్రేణులను ఆదేశిస్తున్నామని మంత్రి కొడాలి నాని తెలిపారు.
రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఏదో విధంగా చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రి చేయాలని ఈ ఎల్లో మీడియా కుట్రపన్నుతుందని ఆరోపించారు. ధరలపై వ్యతాసాలు ప్రచురణ చేసిన ఓ పేపర్ యజమాని పచ్చళ్లను తక్కువ ధరకు అమ్ముతున్నారా..? మార్కెట్లో కూరగాయలు రేట్లు తక్కువగా ఉన్నా ఆయన పచ్చళ్ల రేట్లను పెంచుకుంటూ పోతున్నారు. వారు ఎలా అయినా చేయొచ్చుగానీ.. వైసీపీకి చెందిన విషయాలను మాత్రం తప్పుడు ప్రచారాలు చేస్తారా..? అని మంత్రి నాని అన్నారు.
హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కు శంకుస్థాపన చేసి నిర్మాణం పూర్తి చేసింది మహానేత వైఎస్సార్ అని, అలాగే ఔటర్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేసింది వైఎస్సారేనని అన్నారు. ఇందులో చంద్రబాబు చేసింది ఏమీ లేదని అన్నారు. వైఎస్సార్ కుమారుడు జగన్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, మరో 30 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని అన్నారు. రాష్ట్రం ముక్కలవడానికి ప్రధాన కారణం చంద్రబాబేనని ధ్వజమెత్తారు.
దీన్ని బట్టి టీడీపీ అనుకూల మీడియాపై వైసీపీ ఏపీలో ఉక్కుపాదం మోపడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎలాగైతే నిషేధించి దారికి తెచ్చారో అచ్చం అలాగే ఏపీలో కూడా కట్టడి చేసి నియంత్రించాలని జగన్ స్కెచ్ గీశారు.ఇక ఏపీలో అధికారంలో ఉండడంతో కేబుల్ టీవీ ద్వారా ఈ చానెళ్ల ప్రసారాలను కూడా వైసీపీ సర్కార్ నిషేధించడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఆ మేరకు కేబుల్ టీవీ నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అయితే అధికారిక నిషేధం సాధ్యం కాకపోవచ్చు. అందుకే అనధికారికంగా నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ పాచిక పారుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.