https://oktelugu.com/

Kishan Reddy : తెలంగాణపై కేంద్రం వరాల వాన.. రైల్వే, మౌళిక వసతులకు భారీగా పెద్దపీట

 ఇటీవలే తెలంగాణలో 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు సంబంధించి రైల్వే శాఖ ఆమోదముద్ర వేసింది. ఇందులో 21 స్టేషన్లకు ఆధునీకరణకు ప్రధానమంత్రి గారు వర్చువల్ మోడ్ లో శంకుస్థాపన చేశారని కిషన్ రెడ్డి తెలిపారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 4, 2023 / 07:58 PM IST

    kishan reddy

    Follow us on

    Kishan Reddy : రైల్వేల అభివృద్ధి విషయంలో ఇవాళ తెలంగాణ ప్రజలకు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి శుభవార్త చెప్పారు.  2014కు ముందు ఏడాదికి 17.4 కిలోమీటర్ల రైల్వేలైన్ల నిర్మాణం జరిగాయి. నరేంద్రమోదీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏడాదికి 55 కిలోమీటర్ల రైల్ లైన్ల నిర్మాణం జరుగుతోంది. ఇటీవలే తెలంగాణలో 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు సంబంధించి రైల్వే శాఖ ఆమోదముద్ర వేసింది. ఇందులో 21 స్టేషన్లకు ఆధునీకరణకు ప్రధానమంత్రి గారు వర్చువల్ మోడ్ లో శంకుస్థాపన చేశారని కిషన్ రెడ్డి తెలిపారు.

    -కిషన్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవీ..

    దేశవ్యాప్తంగా ఈశాన్యరాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలు మినహా.. మైదాన ప్రాంతాల్లో అతితక్కువ రైల్వే నెట్‌వర్క్ ఉన్న రాష్ట్రం తెలంగాణ. స్వాతంత్ర్యం వచ్చిన ఈ 75 ఏళ్లలో తెలంగాణలో రైల్వేవ్యవస్థను అభివృద్ధి చేసే ప్రయత్నం చిత్తశుద్ధితో, పూర్తిస్థాయిలో జరగలేదు. 66 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతంలోని జిల్లాల్లో రైల్వే వ్యవస్థను మెరుగుపరిచేందుకు సీరియస్ గా ప్రయత్నాలేమీ జరగలేదు.

    ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ (RTC) ప్రజారవాణాలో కీలకపాత్ర పోషించాయి. కానీ రైల్వేలు ప్రజారవాణాకు, సరుకుల రవాణాకు జీవనాడులు..  ఈ రైల్వే వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. నమ్మకమైన కనెక్టివిటీ పెరుగుతుంది. తద్వారా సహజంగానే అభివృద్ధి జరుగుతుంది. సామాన్యులు తక్కువ ధరకే ప్రయాణించేందుకు దోహదపడుతుంది.

    నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణలో రహదారులకు సంబంధించి మౌలికవసతులకు పెద్దపీట వేస్తూనే.. రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించడంతోపాటుగా.. వెంటవెంటనే ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు సంపూర్ణంగా కృషిచేస్తోంది.

    కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా అందించాల్సిన తమవంతు సహకారాన్ని అందించడం లేదు.
    2022లో తెలంగాణ ప్రభుత్వం, నిర్లక్ష్యం సహాయ నిరాకరణ కారణంగా.. దాదాపు 700 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల పనులు నిలిచిపోయాయి.

    ముఖ్యంగా.. రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన సహకారం ముఖ్యంగా తమవంతు వాటా నిధులు, భూసేకరణలో పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. కానీ.. మోదీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనుకడుగు వేయడం లేదు.

     -తెలంగాణకు కేంద్రం  ఇచ్చిన నిధుల వివరాలు తెలిపిన కిషన్ రెడ్డి

    ఈ 40 స్టేషన్ల ఆధునీకరణ, అభివృద్ధికి కేంద్రం రూ.2,300 కోట్లు విడుదల చేసింది.
    సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి రూ.715 కోట్లు
    కాచిగూడ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ. 421 కోట్లు
    చర్లపల్లి టర్మినల్ అభివృద్ధికి రూ.221 కోట్లను విడుదల చేసింది.
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు MMTS-ఫేజ్ 2లో భాగంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.
    వరంగల్ లో రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.

    ఇవి కాకుండా.. తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అనేక ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపుతూ.. ఇన్నాళ్లుగా తెలంగాణలో రైలు కూతకోసం ఎదురుచూస్తున్న ప్రాంతాలకు.. రైలు పట్టాలు వేసి అక్కడి ప్రజలకు మరింత సౌలభ్యాన్ని అందించేందుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.

    ఇప్పటికే.. రూ. 4,686 కోట్లతో
    ముద్-ఖేడ్ – మేడ్చల్ మధ్య..
    & మహబూబ్‌నగర్ – డోన్ మధ్య
    రూ. 2,854 కోట్లతో గుంటూరు – బీబీనగర్ మధ్య
    ఈ 3 ప్రాజెక్టులు ఇప్పటికే మంజూరయ్యాయి.

    దాదాపు 15 కొత్త ప్రాజెక్టులకు (న్యూ లైన్స్ కోసం) ఫైనల్ లొకేషన్ సర్వే (FLS) కు కేంద్రప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతోపాటుగా 8 డబ్లింగ్ లైన్లకు, 3 ట్రిప్లింగ్ లైన్లు, 4 క్వాడ్రప్లింగ్ లైన్లకు పచ్చజెండా ఊపింది. ఈ మొత్తం ప్రాజెక్టులకు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు మంజూరయ్యాయి. సర్వే పూర్తవగానే DPR ల పనులు ప్రారంభిస్తారు.

    ఈ ఫైనల్ లొకేషన్ సర్వేలో 15 కొత్త ప్రాజెక్టులు, 15 అదనపు లైన్ల ప్రాజెక్టులు మొత్తం 30 ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఈ మొత్తం ప్యాకేజీ విలువ రూ.83,543 కోట్లు.
    తెలంగాణ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఏకకాలంలో ప్రాజెక్టులు చేపట్టడానికి నిర్ణయం తీసుకోవడం మొదటిసారి.

    రాష్ట్రం సహకరించకపోయినా.. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం, వారి సౌలభ్యం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.

    2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో.. తెలంగాణకు (ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి మంజూరైనవి) 5 ప్రాజెక్టులు మాత్రమే. ఆనాడు 714 కిలోమీటర్ల ఈ 5 ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు నాటి యూపీఏ ప్రభుత్వం కేటాయించిన మొత్తం రూ.10,192 కోట్లు.

    ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా.. 30 ప్రాజెక్టులు మంజూరు చేయడమైనవి. అందులో మొత్తం 5,239 కిలోమీటర్ల కొత్త లైన్లు, అదనపు లైన్ల కోసం ఈ 30 ప్రాజెక్టుల మొత్తం విలువ రూ. 83,543.
    ఇటీవల కేటాయించిన ప్రాజెక్టులు 6 రెట్లు పెరిగాయి కిలోమీటర్లు 7 రెట్లు పెరిగాయి అంచనా వ్యయం 8 రెట్లు పెరిగింది. ఇదే తెలంగాణ పట్ల మోదీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి ఉన్న కమిట్‌మెంట్ అని కిషన్ రెడడ్ి తెలిపారు.

    తెలంగాణకు సంబంధించిన FLS మంజూరైన ప్రాజెక్టుల్లో..
    మొదటిది దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజల ఆకాంక్షలను పూర్తిచేయనుంది.
    ఆదిలాబాద్, ఇచ్చోడ, నేరడిగొండ, నిర్మల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, నిజాంపేట్, సంగారెడ్డి మీదుగా పటాన్‌చెరు వరకు ఈ రైలు మార్గం ఉంటుంది.
    ఉత్తర తెలంగాణను ఇటు హైదరాబాద్‌తోనూ, ముంబై తోనూ, అటు నాగ్‌పూర్ మీదుగా దేశరాజధాని ఢిల్లీతో ఈ మార్గం అనుసంధానం చేస్తుంది.
    ఇది ఈ రెండు పాత జిల్లాల చిరకాల కోరిక.
    ఉత్తర తెలంగాణలో లైఫ్ లైన్ గా ఈ ప్రాజెక్ట్ మారుతుందని చెప్పొచ్చు.
    ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధితోపాటుగా వ్యవసాయ ఉత్పత్తులను రైతులు మార్కెట్‌కు తరలించేందుకు వీలవుతుంది.
    ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు: 317 కి.మీ
    అంచనా వ్యయం సుమారు: రూ. 5,706 కోట్లు

    రెండో మెగా ప్రాజెక్టు దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని అనుసంధానం చేస్తుంది. పాత వరంగల్ జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నుంచి.. కూసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల్‌కు ఈ ప్రాజెక్టు అనుసంధానం అవుతుంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ముఖ్యమైన ప్రాంతాలన్నీ ఈ కొత్త రైల్వే లైను ప్రాజెక్టు ద్వారా అనుసంధానం అవుతాయి. రైతుల మేలు కోసం కాటన్ ఎగుమతికి, బియ్యం రవాణాకు, గ్రానైట్ తరలింపునకు.. ఈ లైన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.సింగరేణి కాలరీస్ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలను కలపడం ద్వారా వాణిజ్య అవసరాలకు కూడా ఈ రైల్వే లైన్ చాలా బాగా ఉపయోగ పడుతుంది.

    ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు: 296 కి.మీ
    అంచనా వ్యయం సుమారు: రూ.5,330 కోట్లు.
    మూడో కీలకమైన ప్రాజెక్టు కాచిగూడ (ఉందానగర్) నుంచి జగ్గయ్యపేట
    రంగారెడ్డి జిల్లా మీదుగా.. చిట్యాల, నకిరేకల్, మునుగోడు, సూర్యాపేట, జగ్గయ్యపేట నియోజకర్గాలను ఈ ప్రాజెక్టు అనుసంధానం చేస్తుంది.
    65వ నెంబరు జాతీయ రహదారికి (విజయవాడకు వెళ్లే) సమాంతరంగా ఈ ప్రాజెక్టు ఉంటుంది.
    అంతేకాదు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతిలను కలిపే అతి తక్కువ దూరం కలిగిన రైల్వే మార్గం ఇది కాబోతున్నది.
    ఈ ప్రాంతంలో ప్రజారవాణాకు, వాణిజ్య అవసరాలకు ముఖ్యంగా.. సిమెంట్ ప్లాంట్లకు కొత్త లైన్ ద్వారా చాలా లబ్ధి జరుగుతుంది.
    ఈ ప్రాజెక్టు పొడవు: 228 కి.మీ
    అంచనా వ్యయం సుమారు: రూ.4,104 కోట్లు.

    నాలుగో ముఖ్యమైన ప్రాజెక్టు కరీంనగర్ – హసన్‌పర్తి లైన్
    మానకొండూరు, హుజూరాబాద్ లను నేరుగా హైదరాబాద్ తో కలుపుతుంది.
    గ్రానైట్ ఉత్పత్తులను నేరుగా కాకినాడ ఓడరేవుకు పంపేందకు ఈ రూట్ చాలాకీలకం కానుంది.
    ఈ ప్రాజెక్టు పొడవు: 62 కి.మీ
    అంచనా వ్యయం సుమారు: రూ.1,116 కోట్లు.

    ఐదో ముఖ్యమైన ప్రాజెక్టు భూపాలపల్లి – కాజీపేట కొత్త లైన్
    గిరిజన జిల్లాగా పేరొందిన ఆస్పిరేషనల్ జిల్లా అయిన.. భూపాలపల్లి, జగదల్ పేట, మర్రిపల్లి ని మెయిన్ ట్రంక్ తో అనుసంధానం చేస్తుంది.
    ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సమ్మక్క, సారలమ్మ కు వేళ్లే భక్తులకు ఈ మార్గం ఎంతో ఉపయోగ పడుతుంది.
    భూపాలపల్లి జిల్లాలో సింగరేణి బొగ్గును పవర్ ప్లాంట్లకు తరలించేందుకు, లేటరైట్, డోలమైట్, నల్లగ్రానైట్, సున్నపురాయి తదితర సహజ వనరులను బహిరంగ మార్కెట్ కు తీసుకెళ్లేందుకు కూడా ఈ మార్గంలో ఇది చాలా కీలకమైన ప్రాజెక్టు.
    ప్రాజెక్టు పొడవు: 64 కి.మీ
    అంచనా వ్యయం సుమారు: రూ.1152 కోట్లు.

    వికారాబాద్ – కృష్ణ మధ్య కొత్త లైన్..
    ఇది తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలైన పరిగి, కొడంగల్, హుస్నాబాద్, దౌల్తాబాద్, మక్తల్, నారాయణ్‌ పేట వంటి ప్రాంతాలను కలుపుతుంది.
    వికారాబాద్, తాండూరు ప్రాంతం నుంచి ప్రజారవాణాకు మరియు సిమెంట్ క్లస్టర్ కోసం సరుకు రవాణాకు ఎంతో ఉపయోగపడుతుంది.
    హుబ్లీ, కొల్హాపూర్ (మహాలక్ష్మి ఆలయం), గోవా వెళ్లేందుకు సులభమైన మార్గం.
    ఈ ప్రాజెక్టు పొడవు: 122 కి.మీ
    అంచనా వ్యయం సుమారు: రూ.2196 కోట్లు

    మరో అతిముఖ్యమైన ప్రాజెక్టు.. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు (ORR)
    తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఇదొక గేమ్ చేంజర్
    ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు (RRR) చుట్టూ ఏర్పాటుచేయనున్న రైల్ ప్రాజెక్టు ఇది.
    వికారాబాద్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల మీదుగా 40% తెలంగాణ ప్రాంతంలో విస్తరించే ఈ ప్రాజెక్టు.. ద్వారా వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, అక్కన్నపేట, సిద్దిపేట, గజ్వేల్, యాదాద్రి, భువనగిరి, రామన్నపేట, చిట్యాల, నారాయణపూర్, షాద్‌నగర్, షాబాద్ వంటి ముఖ్యమైన పట్టణాలు అనుసంధానం చేస్తూ.. ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రతిష్టాత్మకంగా చేపట్టబడుతోంది.
    రీజనల్ రింగ్ రోడ్డులో అభివృద్ధి చెందే అవకాశం ఉన్న కొత్త శాటిలైట్ టౌన్‌షిప్‌లు, వాణిజ్య ప్రాంతాలు, ఐటీ జోన్లు, పారిశ్రామిక జోన్‌లకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది.
    ఈ ప్రాజెక్టు పొడవు: 564 కి.మీ,
    అంచనా వ్యయం సుమారు: రూ.12,408 కోట్లు.

    ఎంఎంటీఎస్ – ఫేజ్ 2.. ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి వరకు కొనసాగింపు
    యాదాద్రిని ఎంఎంటీఎస్ తో అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ఆలోచిస్తోంది. కానీ దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస సహకారం అందడం లేదు.
    దీంతో ఈసారి.. వీటన్నింటినీ పక్కనపెట్టి వందశాతం కేంద్ర ప్రభుత్వమే అన్నీ ఖర్చులు భరిస్తూ ఈ మార్గాన్ని పూర్తిచేయాలని నిశ్చయించింది.
    దీంతోపాటుగా ఘట్ కేసర్ నుంచి వంగపల్లి వరకు ఫోర్ లైన్ పనులు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా జరగనున్నాయి.
    ఈ మార్గంలో పెరుగుతున్న రాజధానికి ప్రయాణీకుల రద్దీని తట్టుకోవడంతోపాటు యాదాద్రికి వెళ్లే భక్తులకు ఈ మార్గం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
    ఈ మార్గం పొడవు: 40 కి.మీ
    అంచనా వ్యయం సుమారుగా.. రూ.980 కోట్లు

    కీలకమైన ప్రాజెక్టు మణుగూరు-రామగుండం లైన్
    భూపాలపల్లి ప్రాంతంలోని సింగరేణి గనులను.. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని గనులతో అనుసంధానం చేసే రైల్వే లైన్ ఇది.
    దీంతోపాటుగా ఇటీవలే యునెస్కో వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి అనుసంధానమయ్యే ఈ లైన్.. సందర్శకులు/పర్యాటకుల కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
    గిరిజన ప్రాంతాలను ఢిల్లీకి అనుసంధానం చేస్తుంది.
    లైన్ పొడవు: 200 కి.మీ
    సుమారు ఖర్చు: రూ.3,600 కోట్లు.

    డోర్నకల్ – మిర్యాలగూడ మధ్య కొత్త లైన్
    ఈ కొత్త లైన్ నేలకొండపల్లి, కోదాడ, హుజూర్‌నగర్ వంటి ముఖ్యమైన పట్టణాలను కలుపుతుంది.
    దీంతోపాటుగా ఆయా ప్రాంతాల ప్రజలకు హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ఢిల్లీలకు కనెక్టివిటీ పెరుగుతుంది.
    ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పరిసర ప్రాంతాల పారాబాయిల్డ్ రైస్ మిల్లుల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఈ రైల్వే లైన్ కీలకం కానుంది.
    పొడవు: 120 కి.మీ
    సుమారు ఖర్చు: రూ.2,160 కోట్లు.

    భద్రాచలం (పాండురంగాపురం) – మల్కన్‌గిరి (జునాగడ్) న్యూ లైన్
    శ్రీరామచంద్రుడు కొలువైన ఆధ్యాత్మిక కేంద్రం, దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాచలం పట్టణానికి ఇంతవరకు నేరుగా రైల్ కనెక్టివిటీ లేదు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆ చిరకాల ఆకాంక్ష కూడా నెరవేరనుంది.
    హైదరాబాద్, ఢిల్లీ – చెన్నై ప్రధాన రైల్వే లైన్ కు ఈ ప్రాజెక్టు కనెక్ట్ అవుతుంది.
    దీంతోపాటుగా ఒడిశా, తెలంగాణలోని గనులకు.. కాకినాడ పోర్ట్ తో అనుసంధానం చేస్తుంది.
    పొడవు: 186 కి.మీ
    అంచనా వ్యయం సుమారు: రూ.3,592 కోట్లు.

    తాండూరు సిమెంట్ క్లస్టర్ – జహీరాబాద్ న్యూ లైన్
    ఈ లైను కారణంగా తాండూరు, వికారాబాద్, జహీరాబాద్ మధ్య 65 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.
    ఈ ప్రాజెక్టు వల్ల.. సికింద్రాబాద్, వాడి మద్యలో.. సిమెంట్ క్లస్టర్ నుంచి సరుకును పుణే, ముంబై లకు తరలించేందుకు మార్గం సుగమం అవుతుంది.
    దీని ద్వారా.. వికారాబాద్, తాండూరు సెక్టార్‌లో ప్రస్తుతమున్న 12 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి సమీప భవిష్యత్తులో 25 మిలియన్ టన్నులకు చేరుకునేందుకు వీలుపడుతుంది.
    లైన్ పొడవు: 75 కి.మీ
    అంచనా వ్యయం సుమారు: రూ. 1,350 కోట్లు

    దీంతోపాటుగా ఆదిలాబాద్, మహారాష్ట్రలోని గడ్-చందూర్ ప్రాంత్రం అనుసంధానత కారణంగా.. ఆదిలాబాద్ పరిసర ప్రాంతమైన గడ్-చందూర్ ప్రాంతంలోని బొగ్గును పర్లి, హోటగీ, కూడగి పవర్ ప్లాంట్ లను తరలించేందుకు వీలవుతుంది.
    71 కి.మీల ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు: రూ.1,278 కోట్లు.
    తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని గనులను, పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానించే 180 కిలోమీటర్ల కొత్తగూడెం – హుట్గి – కిరండోల్ కొత్త లైన్ కోసం.. రూ. 3,240 కోట్లను కేంద్రం వెచ్చించనుంది.
    ఉత్తర తెలంగాణను, మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన పంఢరిపూర్, పర్లిలకు అనుసంధానించే బోధన్ – లాతూర్ మధ్య కొత్త లైన్ కోసం (135 కిలోమీటర్లు) రూ. 2,430 కోట్లతో అంచనాలను సిద్ధం చేస్తోంది రైల్వే శాఖ.
    ఈ మెగా ప్రాజెక్టులన్నింటికీ.. ఫైనల్ లొకేషన్ సర్వే (FLS) చేయడానికి భారత ప్రధాని అంగీకరించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ FLSకు రైల్వే శాఖ నిధులు కూడా మంజూరు చేసింది.
    ఇవి కాకుండా డబ్లింగ్ లైన్ ప్రాజెక్టులు..
    715 కోట్లతో డోర్నకల్ – భద్రాచలం రోడ్
    1,157 కోట్లతో మోటుమారి – విష్ణుపురం
    2,314 కోట్లతో నిజామాబాద్ – పెద్దపల్లి
    3,484 కోట్లతో వికారాబాద్ – పర్లి వైద్యనాథ్
    273 కోట్లతో మౌలాలీ – సనత్ నగర్ మధ్య
    2,379 కోట్లతో.. ముద్-ఖేడ్ – ఆదిలాబాద్ – పిపంల్ కుట్ట మధ్య డబ్లింగ్ లైన్ల నిర్మాణం కానుంది
    ట్రిప్లింగ్ లైన్లు..
    1,352 కోట్లతో డోర్నకల్ – మణుగూరు వయా కొత్తగూడెం
    1,118 కోట్లతో సికింద్రాబాద్ – కాజీపేట
    2,379 కోట్లతో సికింద్రాబాద్ – వాడి ట్రిప్లింగ్ లైన్లు రానున్నాయి.
    క్వాడ్రప్లింగ్ లైన్లు..
    1,560 కోట్లతో కాజీపేట – సికింద్రాబాద్
    3,042 కోట్లతో కాజీపేట – బల్లార్షా
    2,860 కోట్లతో కాజీపేట – విజయవాడ
    2,522 కోట్లతో సికింద్రాబాద్ – వాడి మధ్య క్వాడ్రప్లింగ్ లైన్ల నిర్మాణం జరగనుంది.
    డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ (4 లైన్లు) ప్రాజెక్టులను మినహాయిస్తే.. కొత్తగా వచ్చిన రైల్వే లైన్ల కారణంగా.. తెలంగాణలో ఇంతవరకు రైల్వే కనెక్టివిటీ లేని నియోజకవర్గాలు, ప్రధాన పట్టణాలు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. దాదాపు లక్ష జనాభా దాటిన పట్టణాలు, నగరాలతో ఈ కొత్త ప్రాజెక్టుల ద్వారా అనుసంధానం కానున్నాయి.
    ఇది కచ్చితంగా తెలంగాణలో అభివృద్ధికి కొత్త బాటలు వేయనుంది.
    కనెక్టివిటీ పెరగనున్న నియోజకవర్గాలు
    ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, సంగారెడ్డి, పటాన్‌చెరు, కొరుట్ల, జగిత్యాల్, కరీంనగర్, రామగుండంతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలకు రైలు అనుసంధాన పెరగనుంది.
    వనపర్తి, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, షాద్‌నగర్, భువనగిరి, సూర్యాపేట, కోదాడ, నకిరేకల్, చిట్యాల, మునుగోడు, నల్గొండ, మహబూబాబాద్, పాలేరు, మానకొండూరు, హూజూరాబాద్, సిద్దిపేట, గజ్వేల్, రాజన్న సిరిసిల్ల, వేములవాడ, హుస్నాబాద్ ఇటు.. కొడంగల్, మక్తల్, నారాయణపేట, వికారాబాద్ నియోజకవర్గాలకు కనెక్టివిటీ పెరుగుతుంది.
    తెలంగాణలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రైలును చూడని ముఖ్య పట్టణాలు, ప్రాంతాలకు, భద్రాచలం, రామప్ప, సమ్మక్క-సారలమ్మ వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు రైలు మార్గాన్ని వేయడం, పారిశ్రామిక ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ వ్యాల్యూ ఇచ్చేలా రైల్ లైన్లకు డిజైనింగ్ చేయడం ద్వారా ప్రజల జీవితాలను సౌలభ్యం చేయడమే నరేంద్రమోదీ గారి సంకల్పం.
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం సహకరించని కారణంగా తెలంగాణలో ఇప్పటికే దాదాపు 700 కిలోమీటర్ల మేర పనులు నిలిచిపోయాయి.
    అయినా తెలంగాణలో అభివృద్ధి ఆగకూడదన్న సంకల్పంతో కేంద్రప్రభుత్వమే భూసేకరణ మొదలుకుని ప్రాజెక్టు పూర్తయ్యేంతవరకు కావాల్సిన ఖర్చులు భరించేందుకు సిద్ధమైంది.
    అందుకే రూ.83వేల కోట్లతో మెగా డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది.
    పైన పేర్కొన్న ప్రాజెక్టుల FLSకు మంజూరు లభించింది.
    రైల్వే అధికారులు RoR (రిటర్న్ ఆఫ్ రెవెన్యూ)కు సంబంధించిన వివరాలను కూడా సిద్ధం చేస్తున్నారు.