Ramoji Rao Vs Jagan: మార్గదర్శి కేసు విషయంలో జరుగుతున్న రాద్దాంతం అంతా ఇంతా కాదు. గత కొద్దిరోజులుగా సిఐడి విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ కేసు విషయంలో ప్రజల్లో అనేక రకాలుగా సందేహాలు ఉన్నాయి. ఒకపక్క న్యాయస్థానాల్లో ఫైట్ సాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఆదేశం మార్గదర్శికి అనుకూలంగానే ఉంది. అయితే ఇది రామోజీరావు సక్సెస్ గా భావించాలా? జగన్ సర్కార్ ఫెయిల్యూర్ గా చూడాలా అన్నది తెలియడం లేదు.
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో రామోజీరావు ది అంది వేసిన చేయి. తిమ్మిని బమ్మిని చేయగల నేర్పరి. పచ్చళ్ళ వ్యాపారంతో ప్రారంభమై.. మీడియా మొగల్ గా అవతరించిన తీరు అభినందనీయం, ఆదర్శనీయం. అటు తరువాత రాజ గురువుగా మారి రాజకీయాలనే శాసించిన వైనం తెలుగు ప్రజలకు సుపరిచితం. ఈ పరిణామాల క్రమంలో ఆయన నడక, నడవడిక అందరికీ తెలిసిందే. అటువంటి వ్యక్తిని ఒక రోజైనా జైలులో పెట్టాలన్నది జగన్ కసి. కానీ అందుకు చిక్కకుండా రామోజీ గట్టిగానే పోరాడుతున్నారు. జగన్ మొండివాడు కన్నా బలవంతుడు. అందుకే రామోజీలో ఆ భయం.అందుకే తన మీడియా, మేధాశక్తిని ప్రయోగించి మరి రామోజీరావు అడ్డుకుంటున్నారు.
మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు వద్దు.. మా ఆదేశాలు ఇచ్చే వరకు జరపవద్దంటూ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ విషయంలో మార్గదర్శి తరపున న్యాయవాదుల వాదనలు బలంగా పనిచేశాయి. రాత్రిపూట కార్యాలయాల్లో సోదాలు ఏంటి? అన్న వాదాలను విన్న న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. అదే సమయంలో ఈనాడు పత్రికలో పగటిపూట సోదాలు ఏంటి? ఖాతాదారులు, సిబ్బంది అసౌకర్యానికి గురవుతున్నారు అంటూ ప్రత్యేక కథనాలు వచ్చాయి. అంతటితో ఆగకుండా మార్గదర్శికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై పోలీసుల యాక్షన్ తీరును ప్రశ్నిస్తూ.. సైతం ప్రత్యేక కథనాలు ఈనాడులో ప్రచురితమయ్యాయి.క్షేత్రస్థాయిలో ప్రజల సానుభూతి.. అటు కోర్టు నుంచి సానుకూల తీర్పులు వస్తుండడం రామోజీకి కలిసి వస్తోంది. జగన్ కు ప్రతిబంధకంగా మారుతోంది.
మార్గదర్శి వేరు.. ఈనాడు వేరు.. రామోజీరావు వేరు… అని లీగల్ గా చూపిస్తున్నారు. కానీ అవసరం అయినప్పుడు అంతా ఒకటేనని చూపుతున్నారు. మార్గదర్శి ద్వారా కోట్లాది రూపాయల లాభాలు అర్జిస్తున్నారు.. ఈనాడు, మార్గదర్శి ఒకటే కదా అని ఎవరైనా అంటే అది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఈనాడు, మార్గదర్శి వేర్వేరు కదా అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మార్గదర్శిలో సోదాలు జరిపితే.. ఈనాడు పై దాడి అన్న రేంజ్ లో పతాక శీర్షికన కథనాలు వండి వార్చుతున్నారు. అయితే ఈ క్రమంలో ఈనాడు ఎందుకు రాస్తుంది అన్నది జనాలకు చెప్పాలన్నది జగన్ ఆరాటం.. జగన్ ఎందుకు అలా చేస్తున్నారు అన్నది జనాలకు తెలియాలన్నది ఈనాడు ఆలోచన. అయితే ఈ యుద్ధంలో న్యాయస్థానాల ద్వారా రామోజీ పై చేయి సాధిస్తూ వస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బలమైన జగన్ సర్కార్ కు ఎప్పటికప్పుడు జలక్ ఇస్తున్నారు.