మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. అగ్రనేతలు సైతం లొంగిపోయేందుకు రెడీ ఉన్నారంటూ వార్తలు వస్తున్నా ఇంతవరకు ‘హక్కుల సంఘం’ నేతలు గానీ, ఇతరత్రా విప్లవ సానుభూతిపరులు గానీ ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
అయితే తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. లొంగుబాటుపై వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించింది. అగ్రనేత గణపతి లొంగిపోవడం లేదని ఒక ప్రకటన విడుదల చేసింది. గణపతి లొంగుబాటు పోలీసుల కట్టుకథ అంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ప్రభుత్వాలు కలిసి తయారు చేసిన కట్టుకథ అని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేర్కొన్నారు. అనారోగ్యంతో గణపతి స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకున్నారని తెలిపాడు.
మావోయిస్టు ప్రతిష్టను దెబ్బతీసేందుకు పోలీసులు ఇలా కట్టుకథలు అల్లుతున్నారని.. మా నాయకత్వం ధృడంగా ఉందని తెలిపారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు తీసుకెళ్తాం అని తెలిపారు.