Pawan Kalyan- Mahasena Rajesh: చేసిన తప్పులకు చాలా మంది పశ్చాత్తాప పడుతుంటారు. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం. కానీ వాటిని సకాలంలో గుర్తించి సరిదిద్దుకుంటేనే జీవన గమనం సాఫీగా సాగుతుంది. లేకుంటే అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతాయి. అయితే కొందరు దిద్దుకోలేని తప్పులు చేస్తుంటారు. మూల్యం చెల్లించుకుంటారు. ఇప్పుడు ఏపీ ప్రజలు కూడా అటువంటి తప్పిదం చేసి మూల్యం చెల్లించుకున్నారని మహాసేన రాజేష్ అభిప్రాయపడుతున్నారు. జగన్ నిజస్వరూపం తెలియక ప్రజలు మోసపోయారని చెబుతున్నారు. అందులో తనలాంటి వారూ ఉన్నారని.. సమాజానికి ఏదో మంచి చేస్తారని నమ్మి జగన్ తో కలిసి నడిచినందుకు తన లాంటి వారు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారాయన. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సామర్థ్యం ఒక్క పవన్ కే ఉందని చెబుతున్నారు. మహాసేనతో రాష్ట్రంలో బలమైన నెట్ వర్క్ కలిగిన రాజేష్ తన మనోగతాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు విలువైన సూచనలు చేశారు.

గత కొద్దిరోజులుగా చాలా మంది నాయకులతో కలిసి ట్రావెల్ చేశానని చెబుతున్న మహాసేన రాజేష్ ఇప్పుడు పవన్ పై పూర్తిగా నమ్మకం ప్రకటించారు. పవన్ కు ఉన్న విశ్వసనీయత, మాటకు ఇచ్చే విలువ, బడుగు బలహీనవర్గాల గురించి ఆలోచించే మనస్తత్వం మరే నాయకుడిలోనూ కనిపించలేదని చెబుతున్నారు. అటువంటి నాయకుడు రాజ్యాధికారం అందుకుంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పవన్ కు ఉన్న చరిష్మ రాష్ట్రంలో మరే నాయకుడికి లేదన్నారు. జగన్ నాయకత్వం తన తండ్రి సానుభూతితో వచ్చినదేనని తేల్చేశారు. కానీ పవన్ పార్టీ స్థాపన నుంచి నేటి వరకూ జరిగిన పరిణామాల్లో ఎక్కడా స్వార్థం కనిపించలేదన్నారు. కుటిల రాజకీయాలు, హత్యా రాజకీయాలు తెలియవన్నారు. కులం, మతం, ప్రాంతం చూడని ఒకే వ్యక్తి పవన్ అని అభివర్ణించారు. ఆయనకు కుల రాజకీయాలు తెలియదు, రాజకీయ వ్యూహాలు తెలియవన్నారు. తెలిసిందే బడుగు, బలహీనవర్గాలను అక్కున చేర్చుకోవడమేనన్నారు. ఆయన నాయకుడుగానే కొనసాగాలని.. రాజకీయ నాయకుడిగా మారవొద్దని కూడా విన్నవించారు.

గత ఎన్నికల్లో జగన్ విజయం ప్రశాంత్ కిశోర్ వ్యూహంతోనే సాధ్యమైందన్నారు. పాదయాత్ర ఒక రియాలిటీ షోగా అభివర్ణించారు. అందులో పాత్రలు కూడా పీకే క్రియేట్ చేసినవేనన్నారు. అదో పద్దతి ప్రకారం జరగిన ఎపిసోడ్ అన్నారు. అది తెలియక ప్రజలు ట్రాప్ లో పడి మోసపోయారన్నారు. ఆ జాబితాలో తనలాంటి వారు కూడా ఉన్నారని చెప్పారు. మరోసారి ప్రజలు అటువంటి ట్రాప్ లో పడకుండా నీతి నిజాయితీతో పనిచేసే పవన్ లాంటి వ్యక్తులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అయితే మహాసేన రాజేష్ తాజా కామెంట్స్ చూస్తే మాత్రం ఆయన జనసేనకు బాహటంగా మద్దతు పలికే అవకాశమున్నట్టు కనిపిస్తోంది. దీనిని జన సైనికులు సైతం ఆహ్వానిస్తున్నారు. మొత్తానికైతే పవన్ కు అండగా మహాసేన రాజేష్ రంగంలోకి దిగారన్న మాట.