Balashowry Vallabbhaneni: జగన్ కు అత్యంత సన్నిహితుడు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసిపికి రాజీనామా చేశారు. వైసీపీలో సీట్ల సర్దుబాటు నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బాలశౌరికి టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించారు. తీవ్ర అవమానంగా భావించిన ఆయన పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. జగన్ నుంచి స్పష్టమైన హామీ లేకపోవడంతో పార్టీకి రాజీనామా ప్రకటించారు. త్వరలో ఆయన జనసేనలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే జనసేన నాయకత్వంతో చర్చలు జరిపారని.. గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే బాలశౌరి ఎంపీగా ఎన్నికయ్యారు. వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంట నడిచారు. గత ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. జగన్ కు అత్యంత విశ్వాసపాత్రుడైన నాయకుడుగా ఉండేవారు. కానీ ఇటీవల జరిగిన పరిణామాలతో జగన్ కు దూరమయ్యారు. మొన్న ఆ మధ్యన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన విందుకు బాలశౌరి హాజరయ్యారు. అప్పట్లోనే జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. తన అనుమతి లేకుండా విందుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించడంతో బాలశౌరి నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాలశౌరిపై జగన్ చాలా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
అయితే ఇటీవల మచిలీపట్నం అభ్యర్థిత్వం విషయంలో ప్రత్యామ్నాయాల వైపు వైసిపి చూస్తోంది. సినీ డైరెక్టర్ వివి వినాయక్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. తన విషయంలో వైసిపి వేరే ఆలోచనలో ఉందని గమనించిన బాలశౌరి పార్టీని వీడడమే బెటర్ అని ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే పార్టీకి రాజీనామా ప్రకటించారు. పవన్ సమక్షంలో జనసేనలో చేరేందుకు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఆయన పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపారని తెలుస్తోంది. పవన్ నుంచి సానుకూలత రావడంతో వైసీపీని వీడాలని నిర్ణయించారు. మచిలీపట్నం పార్లమెంట్ స్థానం పరిధిలోని మిగతా నాయకులు సైతం ఆయనను అనుసరించే అవకాశం ఉంది.
జనసేనలోకి వైసీపీ నుంచి భారీగా వలసలు పెరుగుతున్నాయి. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో పవన్ ఒకటికి రెండుసార్లు ఆలోచన చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చాక.. చాలామంది నాయకులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. దాదాపు మూడున్నర గంటల పాటు చర్చించారు. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనపై దృష్టి పెట్టారు. పొత్తులో భాగంగా వచ్చే సీట్లు అనుసరించి నాయకులను పార్టీలో చేర్చుకోవాలని పవన్ భావిస్తున్నారు. అయితే సంక్రాంతి అనంతరం జనసేనలోకి భారీగా చేరికలు ఉంటాయని సమాచారం.