
తెలంగాణలో లాక్ డౌన్ 3.0ని ఈ నెల చివరి వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.మే 29 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ యధావిధిగా కొనసాగుతుందని సీఎం తెలిపారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కావాల్సిందల్లా ప్రజల సహకారమేనని, కొద్ది రోజులు ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయని పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేబినెట్ చర్చించిన అంశాలు!
లాక్ డౌన్ పొడిగింపు, గ్రీన్, ఆరెంజ్ జోన్లకు సడలింపులు, రాష్ట్ర సరిహద్దులకు దగ్గరగా ఉన్న తెలంగాణ వాసులు.. పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మద్యం కొనుక్కుంటున్న పరిస్థితిపై కూడా కేబినెట్ లో చర్చ నడిచింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నూతన సమగ్ర వ్యవసాయ విధానం, నీటిపారుదల, గ్రీన్ జోన్ల పరిధిలో పరిశ్రమలు అనుమతులతో సహా ఇతర అంశాలపై చర్చ కొనసాగింది. వ్యవసాయ రంగంపై ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికపై కూడా చర్చ కొనసాగింది. ప్రజల ఆహార అవసరాలకు తగినట్లు, మార్కెట్ లో డిమాండ్ కలిగిన పంటలను సాగు చేసేందుకు రైతులను అవసరమైన సూచనలు, సలహాలపైనా చర్చ నడిచింది మరియు టెన్త్, ఎంసెట్, సెట్ పరీక్షల నిర్వహణపైనా ప్రభుత్వ విధివిధానాలపై చర్చ కొనసాగింది.
ఈ సందర్బంగా రాష్ట్రంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను అధికారికంగా ప్రకటించారు.
రెడ్ జోన్
1. హైదరాబాద్, 2. రంగారెడ్డి, 3. వికారాబాద్, 4. మేడ్చల్, 5. సూర్యాపేట, 6. వరంగల్ అర్బన్
ఆరెంజ్ జోన్
7. ఆదిలాబాద్, 8. నిర్మల్, 9. ఆసిఫాబాద్, 10. నిజామాబాద్, 11, జగిత్యాల, 12. మంచిర్యాల, 13. కామారెడ్డి, 14. సిరిసిల్ల, 15. మెదక్, 16. సంగారెడ్డి, 17. జయశంకర్ భూపాలపల్లి, 18. జనగాం, 19. మహబూబ్‌నగర్, 20. నల్లగొండ,21. ఖమ్మం, 22. జోగులాంబ గద్వాల, 23. కరీంనగర్, 24. నారాయణ్‌పేట్
గ్రీన్ జోన్
25. సిద్దిపేట, 26. యాదాద్రి భువనగిరి, 27. వరంగల్ రూరల్, 28. మహబూబాబాద్, 29. భద్రాద్రి కొత్తగూడెం, 30. వనపర్తి, 31.నాగర్‌కర్నూల్, 32. పెద్దపల్లి, 33. ములుగు