ఏపీలో కరోనా తీవ్రస్థాయికి చేరింది. ఒక్క రోజులో నమోదవుతున్న కేసుల సంఖ్య దాదాపు పాతిక వేలకు చేరుకోవడంతో కఠిన చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా రాత్రి వరకే ఉన్న కర్ఫ్యూను పగటి పూట కూడా అమలు చేయడానికి నిర్ణయించింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజలు ఎవ్వరూ రోడ్ల మీద కనబడకుండా చూడాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఈ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సులను కూడా 12 గంటల్లోపే డిపోల్లోకి తోలేయాలని ఆదేశాలు జారీచేసింది. నిర్ణీత సమయం తర్వాత మెడికల్ షాపులు మాత్రమే తెరిచి ఉంటాయి. ఆసుపత్రులు యథావిధిగా పనిచేస్తాయి. ఇతర సరుకుల దుకాణాలు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే తెరిచి ఉంటాయి. ఇక్కడి వరకూ పెద్దగా ఇబ్బంది లేదు.
కానీ.. మద్యం షాపుల సంగతి ఏంటన్న ప్రశ్న తలెత్తింది. సాధారణ రోజుల్లోనైతే ఉదయం 11 గంటలకు ఈ షాపులు తెరుస్తారు. అలాంటి వాటిని ఒక్క గంట గ్యాపుతో మూసేయడం సాధ్యం కాదనే అంచనాకు వచ్చింది ప్రభుత్వం. జనాలు ముందుగానే వచ్చి, క్యూలో నిల్చున్నా.. గంటలోనే వారిని పంపేయడం కుదరదని భావించింది.
అందుకే.. ఉదయం 6 గంటలకే ఈ షాపులు కూడా తెరవాలని ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. అసలే రాష్ట్ర ఖజానా కష్టాల్లో ఉన్న నేపథ్యంలో.. మద్యం ఆదాయం ప్రభుత్వానికి ఎంతో కీలకంగా మారింది. అందుకే.. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదనుకొని పొద్దు పొడవగానే షాపులు తెరవాలని ఆదేశాలు జారీచేసింది.