Telangana Elections 2023: ఎగ్జిట్ పోల్స్ లో ముందంజ : కాంగ్రెస్ ప్రచారంలో సక్సెస్ అయినట్టేనా?

ఎగ్జిట్ పోల్స్ వెల్లడికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కొన్ని నిబంధనలను సడలించింది. సాయంత్రం ఐదున్నర గంటల తర్వాత పోల్స్ వెల్లడించుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో నేషనల్ మీడియా సంస్థలు, ఏజెన్సీలు సర్వే ఫలితాలను వెల్లడించాయి.

Written By: Dharma, Updated On : November 30, 2023 6:56 pm

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల కమిషన్ ఊపిరి పీల్చుకుంది. డిసెంబర్ 3న జరిగే ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు చేసుకుంటుంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ కాక రేపుతున్నాయి. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఫైట్ నడిచిందని పోల్స్ తెలియజేస్తున్నాయి. అయితే విజయం ముంగిట కాంగ్రెస్ పార్టీ ఉండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ వెల్లడికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కొన్ని నిబంధనలను సడలించింది. సాయంత్రం ఐదున్నర గంటల తర్వాత పోల్స్ వెల్లడించుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో నేషనల్ మీడియా సంస్థలు, ఏజెన్సీలు సర్వే ఫలితాలను వెల్లడించాయి. అయితే కొన్ని సంస్థలు బీ ఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పగా.. మరికొన్ని మాత్రం కాంగ్రెస్ గెలుపు ఖాయమని తేల్చి చెబుతుండడం ఉత్కంఠ రేపుతోంది. ఓల్డ్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్. టుడేస్ చాణక్య, సీఎన్ఎన్ తెలంగాణ, చాణుక్య స్టేటస్ తదితర సంస్థలు కాంగ్రెస్ పార్టీదే విజయం అని తేల్చి చెబుతున్నాయి. అయితే పల్స్ టుడే సంస్థ మాత్రం బీ ఆర్ఎస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని చెబుతుండడం విశేషం.

కర్ణాటక ఎన్నికల ఫలితాలతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. అక్కడ ఫలితాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు టానిక్ లా పని చేశాయి. ఇప్పుడు కాకుంటే ఎప్పుడు అన్నంత రీతిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేశాయి. ఈసారి గెలవకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడ అసాధ్యమని నాయకత్వంతో పాటు పార్టీ శ్రేణులు భావించాయి. అటు ఏపీలో రాజకీయ పరిస్థితులు సైతం కాంగ్రెస్ కు కలిసి వచ్చినట్లు విశ్లేషణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ క్యాడర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు వార్తలు వచ్చాయి. అన్నింటికీ మించి బీఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత కాంగ్రెస్కు లాభించింది. బిజెపి, బిఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని ప్రజలు బలంగా నమ్మారు. నాయకులు సైతం తమ మధ్య ఉన్న విభేదాలను మరిచి ఏకతాటి పైకి వచ్చి.. ప్రచారం చేయడం కలిసి వచ్చింది.

అయితే మునుపెన్నడు లేని విధంగా కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దించింది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. అటు కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపైనర్లు రంగంలోకి దిగారు. ఒకవైపు ఎన్నికల ప్రక్రియ.. మరోవైపు ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులు రావడం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. అటు ఏపీలో సెటిలర్స్ తో పాటు టిడిపి శ్రేణులను ఆకర్షించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయినట్లు విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. మొత్తానికైతే సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే అసలు ఫలితం డిసెంబర్ 3న వెల్లడి కానుంది. అప్పటివరకు ఈ ఫలితాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి తీపి కబురే.