Homeఆంధ్రప్రదేశ్‌YCP: వైసీపీ నేతల నోట "రోగం" మాట...

YCP: వైసీపీ నేతల నోట “రోగం” మాట…

YCP: ఏపీలో నేతల మాటలు హద్దులు దాటుతున్నాయి. ప్రత్యర్థి అన్నమాట కంటే శత్రువు అన్న రీతిలో వ్యవహారాలు నడుస్తున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబుకు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. అవినీతి కేసుల్లో అరెస్టయి చంద్రబాబు దాదాపు 52 రోజులు పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఎట్టకేలకు ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది. అనారోగ్య కారణాలు చూపుతూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో.. స్పందించిన న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. దీనిపై సిఐడి అభ్యంతరం వ్యక్తం చేసినా.. నిందితుడి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ మంజూరు తప్పనిసరి అని చెబుతూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

కానీ చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. చంద్రబాబు ఆరోగ్యం పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనకు రోగం వచ్చింది కొనుకే బెయిల్ వచ్చిందని.. అందులో గొప్పతనం ఏమిటని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అటు మంత్రి అంబటి రాంబాబు సైతం అదే తరహా వ్యాఖ్యానాలు చేశారు. చంద్రబాబు వృద్ధుడు కాడా? ఆయనకు రోగాలు రావా? అంటూ కామెంట్స్ చేశారు. ఈ వయసులో రోగాలు కామన్ అన్న వారు కూడా ఉన్నారు. ఇక సాక్షి మీడియాలో ” ఇదేం రోగం ” అన్న అంశం చుట్టూనే వార్తలు, కథనాలు నడవడం విశేషం.

మొన్నటి వరకు చంద్రబాబు అవినీతి నుంచి తప్పించుకోలేరని చెబుతూ వచ్చిన వైసీపీ నేతలు మళ్లీ పాత పాట ప్రారంభించారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ దక్కడంతో ఆయన వ్యవస్థలను మేనేజ్ చేస్తారు అని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. హత్య చేసిన వ్యక్తి రక్తపు మరకలతో రెడ్ హ్యాండెడ్గా దొరికినట్లుగా.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయారని.. చంద్రబాబును నిర్దోషిగా గుర్తించి జైలు నుంచి బయటకు పంపలేదని.. ఆరోగ్య కారణంతోనే మధ్యంతర బెయిల్ ఇచ్చారని సాక్షి కథనం రాసింది. ఆయనకు ఆరోగ్య సేవలు అత్యవసరం కాకున్నా.. అలా చూపించి బయటకు వచ్చారని అభిప్రాయపడింది. అయితే చంద్రబాబు బెయిల్ పై వైసీపీ నేతల్లో అసహనం కనిపిస్తోంది. వారు స్పందించిన తీరు చూస్తుంటే పరిస్థితి ఇట్టే తెలిసిపోతుంది.

చంద్రబాబుకు బెయిల్ రావడానికి ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. వరుస కేసుల్లో ఇరికిస్తున్నందున ఆయన జీవితకాలం జైలు నుంచి బయటకు రారంటూ సీఎం బహిరంగ వేదికల్లో సైతం బాహటంగానే ప్రకటించారు. కనీసం 9 ఏళ్లయినా జైలులో మగ్గాల్సిందేనని కసిగా చెప్పారు. కానీ అనారోగ్య కారణాలు చూపుతూ చంద్రబాబు మధ్యంతర బెయిల్ దక్కించుకోవడంతో వైసీపీ నేతలు తమ నోటికి పని చెప్పారు. పైగా భారీ జన సందోహం నడుమ చంద్రబాబు కాన్వాయ్ సాగడం.. జైలు నుంచి ఇంటికి చేరే సరికి 14 గంటల పాటు సమయం పట్టడం, జనాలు బ్రహ్మరథం పట్టడం వైసిపిలో ఒక రకమైన కలవరపాటు కనిపిస్తోంది. అన్నింటికీ మించి చంద్రబాబు విషయంలో వైసీపీ సర్కార్ వ్యవహరించిన తీరును ప్రజలు తప్పు పడుతున్నారా అన్న అనుమానం వెంటాడుతోంది. ఈ తరుణంలోనే వారు చంద్రబాబు బెయిల్ పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. రోగం అంటూ విపరీత వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular