Lakshmi Parvathi: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా 36 గంటల దీక్ష కొనసాగిస్తోంది. అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో నేతలు అన్ని జిల్లాల్లో తమ నిరసన గళం విప్పుతున్నారు. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నేతలు జరిపిన దాడిని ఖండిస్తూ దీక్షకు పూనుకున్నారు. అయితే వైసీపీ మహిళా నాయకురాలు, తెలుగు అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లుడి నిరాహార దీక్షను దొంగ దీక్షగా అభివర్ణించారు. నిరాహార దీక్ష పేరుతో నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.

చంద్రబాబు అబద్దాల కోరు అని పేర్కొన్నారు. బాబు ఆయన కొడుకు లోకేష్ కు కూడా అబద్దాలు నేర్పాడని చెప్పారు. రాష్ర్టంలో జరుగుతున్న పరిణామాలపై రెండు పార్టీలు కత్తులు దూస్తున్నాయి. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తప్పు మీదంటే మీదని ఆరోపణలు చేసుకుంటున్నారు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధమే కాకుండా భౌతిక దాడులు జరగడం దారుణంగా చెబుతున్నారు.
డ్రగ్స్ వాడకం, గంజాయి సాగు విషయంలో ప్రశ్నిస్తే టీడీపీని టార్గెట్ చేసుకుని వైసీపీ దాడి చేయడంతో గొడవ ముదిరింది. చివరికి కేసుల వరకు వెళ్లారు. దీంతో రెండు పార్టీల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీని లక్ష్యం చేసుకుని వైసీపీ తానేమిటో నిరూపించుకోవాలని భౌతిక దాడులకు తెగబడటం చూస్తుంటే ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతుందని తెలుస్తోంది.
దీంతో రాష్ర్టంలో ప్రస్తుతం పాలన పట్టు తప్పుతోంది. విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. గొడవలు కూడా ముదురుతున్నాయి. రాజకీయాలంటే ప్రజలకు అసహ్యం కలిగేలా పరిస్థితులు మారుతున్నాయి. అయినా పార్టీల్లో మాత్రం సహనం కనిపించడం లేదు. ఫలితంగా తమ పలుకుబడి పోతున్నా పట్టించుకోవడం లేదు. అధికారమే లక్ష్యంగా ముందుకు పోతున్నాయే కానీ నైతికత పాటించడం లేదు.