
నేడు తెలుగు రాష్ట్రాలను పరిపాలిస్తున్న కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు ఎన్టీఆర్ కు నిజమైన వారసులని ఎన్టీఆర్ సతీమణి, ఏపీ తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి అన్నారు. గురువారం ఎన్టీఆర్ 98వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ సమాధి వద్ద పూలమాలలు వేసి ఆమె ఘనంగా నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పేదలకు సేవ చేయాలన్నదే ఎన్టీఆర్ ముఖ్య ఆశయమని అన్నారు. ఆయన ఆకాంక్షలను నెరవేరుస్తూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్న ప్రతీఒక్కరికి ఎన్టీఆర్ ఆశీర్వాదం ఉంటుందని లక్ష్మీపార్వతి అన్నారు.
ఎన్టీఆర్ నిజమైన అనుచరులే ఆంధ్రప్రదేశ్, తెలంగాణను పరిపాలించడం అదృష్టమని ఆమె అన్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ ఎన్టీఆర్ ఆదర్శాలను అనుగుణంగా పని చేస్తున్నారని ఆమె కొనియాడారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ నుంచి బయటికి వెళ్లి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి టీడీపీకి వ్యతిరేకంగా పార్టీని స్థాపించారు. ప్రస్తుతం వీరివురు తెలుగు రాష్ట్రాల సీఎంలుగా ఉంటూ పరిపాలన సాగిస్తున్నారు. టీఆర్ఎస్, వైసీపీలు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని భూస్థాపితం చేసేలా పావులా కదుపుతుండగా ఆయన సతీమణి వారిపై ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా ఎన్టీఆర్ ఆశ్వీర్వాదం ఏపీలో జగన్మోహన్ రెడ్డికి, తెలంగాణలో కేసీఆర్ కు ఉంటుందని ఆమె చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి.