Lagadapati Rajagopal: లగడపాటి రీ ఎంట్రీ.. చేరేది ఆ పార్టీలోనేనా?

రాజగోపాల్ రాజకీయ నేతగా కంటే ఆక్టోపస్ గా పేరు తెచ్చుకున్నారు. ఒపీనియన్ పోల్స్, సర్వేలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. 2018 తెలంగాణ ఎన్నికల వరకు ఆయన చేసిన సర్వేలన్నీ ఫలించాయి.

Written By: Dharma, Updated On : September 7, 2023 10:25 am
Follow us on

Lagadapati Rajagopal: లగడపాటి రాజగోపాల్.. తెలుగు ప్రజలకు సుపరిచితులు. ఆంధ్రా ఆక్టోపస్ గా పేరు ఉంది. రెండుసార్లు విజయవాడ ఎంపీగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. అన్నిటికంటే ముందు ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2014 రాష్ట్ర విభజనతో రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో లగడపాటి రాజగోపాల్ ఆయనతో పాటు రాష్ట్రమంతా తిరిగారు. 2004, 2009 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు. 2004లో సినీ నిర్మాత అశ్వినీ దత్, 2009లో వల్లభనేని వంశీ పై విజయం సాధించారు. 2014లో రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. పార్లమెంట్లో సైతం గట్టిగానే నిలదీశారు. అప్పట్లో లోక్సభలో పెప్పర్ స్ప్రే చల్లి సంచలనం సృష్టించారు. కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిన తీరుని నిరసిస్తూ రాజకీయాల నుంచి వైదొలిగారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. రాజగోపాల్ మాత్రం ముందుకు రాలేదు.

రాజగోపాల్ రాజకీయ నేతగా కంటే ఆక్టోపస్ గా పేరు తెచ్చుకున్నారు. ఒపీనియన్ పోల్స్, సర్వేలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. 2018 తెలంగాణ ఎన్నికల వరకు ఆయన చేసిన సర్వేలన్నీ ఫలించాయి. దగ్గర ఫలితాలు వచ్చాయి. అప్పట్లో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పలు రాష్ట్రాల ఎన్నికల్లో రాజగోపాల్ సేవలను వినియోగించుకునేవి. కానీ 2018 తెలంగాణ ఎన్నికల్లో మహా కూటమి అధికారంలోకి వస్తుందని రాజగోపాల్ అంచనా వేశారు. కానీ ఆ అంచనా తప్పింది. అప్పటి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2019 ఏపీ ఎన్నికల్లో సైతం రాజగోపాల్ సర్వే నిజం కాలేదు. టిడిపి రెండోసారి అధికారంలోకి వస్తుందని చెప్పారు. కానీ వైసీపీ భారీ విజయం సొంతం చేసుకుంది. దీంతో ఇక తాను సర్వేలు చేయనని రాజగోపాల్ బాహటంగానే చెప్పారు. రాజకీయాలతో పాటు సర్వేలకు స్వస్తి పలుకుతున్నట్టు ప్రకటించారు.

ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వాలని లగడపాటి రాజగోపాల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడ పార్లమెంటరీ పరిధిలోని తన అభిమానులు, అనుచరుల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు సమాచారం. గత రెండు రోజులుగా వరుసగా భేటీ అవుతూ వస్తున్నారు. లగడపాటికి టిడిపి,వైసిపి లతో పాటు బిజెపి నుంచి సైతం ఆహ్వానం ఉన్నట్లు తెలుస్తోంది. అటు వైసిపికి గత రెండు ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం పట్టు చిక్కలేదు. టిడిపి సైతం సిట్టింగ్ ఎంపీ కేశినేని నానితో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. మరోవైపు బిజెపి సైతం పొత్తుల్లో భాగంగా విజయవాడ వంటి బలమైన నియోజకవర్గాన్ని దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. దీంతో అన్ని పార్టీల నుంచి లగడపాటికి ఆహ్వానాలు ఉన్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో లగడపాటి తన రాజకీయ భవిష్యత్తు వెల్లడించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.