Homeజాతీయ వార్తలుMinister KTR : ఐఏఎస్ కావాలనుకున్న కేటీఆర్.. మంత్రి ఎలా అయ్యారు?

Minister KTR : ఐఏఎస్ కావాలనుకున్న కేటీఆర్.. మంత్రి ఎలా అయ్యారు?

KTR

కల్వకుంట్ల తారకరామారావు రాష్ట్ర మంత్రిగా త‌న‌ని తాను నిరూపించుకున్నారు. భ‌విష్య‌త్ సీఎం అంటూ ప్ర‌చారం కూడా సాగుతోంది. ఇలాంటి కేటీఆర్.. త‌న‌ రాజ‌కీయ జీవితం గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ఐఏఎస్ కావాల్సిన తాను.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్టు చెప్పారు. అంతేకాదు.. త‌న తండ్రికి తెలియకుండా పాలిటిక్స్ లోకి ప్ర‌వేశించిన‌ట్టు తెలిపారు. సంగారెడ్డి ఇజ‌ల్లా రుద్రారంలోని గీతం డీమ్డ్ యూనివ‌ర్సిటీలో ప‌బ్లిక్ పాల‌సీ విద్యార్థుల‌తో మంగ‌ళ‌వారం ఆయ‌న స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వ్య‌క్తిగ‌త విష‌యాల నుంచి రాష్ట్ర ప‌రిస్థితుల వ‌ర‌కు ప‌లు అంశాల‌ను పంచుకున్నారు.

ప్ర‌త్యేక రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. సాధించుకున్నామ‌ని మంత్రి చెప్పారు. అంతేకాదు.. చేసిన హేళ‌న‌ల‌ను తిప్పికొట్టామ‌న్నారు. తెలంగాణ ఏర్ప‌డితే రాష్ట్రం అంధ‌కారంలో మునిగిపోతుంద‌ని నాటి ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి చెప్పార‌ని గుర్తు చేసిన కేటీఆర్‌.. ఇప్పుడు ఇంటి అవ‌స‌రాల నుంచి వ్య‌వ‌సాయం, ప‌రిశ్ర‌మ‌ల‌కు 24 గంట‌లూ క‌రెంట‌ట్ స‌ర‌ఫ‌రా చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్ర‌మేన‌ని అన్నారు.

అంతేకాదు.. ఇంటింటికీ తాగునీళ్లు అందిస్తున్నామ‌న్నారు. వంద శాతం ఇళ్ల‌కు తాగునీరు అందించ‌డం సాధ్యం కాద‌ని, గుజ‌రాత్ లో మోడీనే చేయ‌లేక‌పోయాడు.. తెలంగాణలో సాధ్య‌మ‌వుతుందా? అని చాలా మంది ఎగ‌తాళి చేశార‌ని అన్నారు. ఇప్పుడు 45 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి.. సుసాధ్యం చేశామ‌ని అన్నారు కేటీఆర్‌. రైతుబంధు ప‌థ‌కం మీద చాలా మంది అనుమానాలు వ్య‌క్తం చేశార‌న్న మంత్రి.. త‌మ ప‌థ‌కాన్ని చూసి.. 11 రాష్ట్రాల్లో ఇలాంటి ప‌థ‌కాన్ని అమలు చేస్తున్నార‌ని చెప్పారు.

ఇక‌, రాష్ట్రంలో నిరుద్యోగిత గురించి మాట్లాడుతూ.. ప్ర‌పంచంలో ఏ ప్ర‌భుత్వం కూడా అంద‌రికీ స‌ర్కారు కొలువులు ఇవ్వ‌లేదు అని అన్నారు మంత్రి కేటీఆర్‌. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ రంగంలో 1.39 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు ఇచ్చామ‌ని చెప్పారు. టీఎస్ ఐపాస్‌, టాస్క్ వ‌ల్ల రాష్ట్రానికి రూ.2.23 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని, వాటి ద్వారా దాదాపు 15 ల‌క్ష‌ల మందికి ఉపాధి ల‌భించింద‌ని చెప్పారు. ఈ విధంగా.. అతి త‌క్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంద‌ని అన్నారు మంత్రి.

త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా విద్యార్థులో పంచుకున్నారు మంత్రి. త‌న తండ్రి కేసీఆర్ త‌న‌ను ఐఏఎస్ అధికారిగా చూడాల‌ని కోరుకున్నార‌ట‌. కానీ.. ఢిల్లీ జేఎన్‌యూ గోడ‌ల‌పై రాసిన నినాదాలే త‌న‌ను రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చాయని చెప్పారు. ‘‘రాజకీయాలే అన్నింటినీ నిర్ణయిస్తున్నప్పుడు.. భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండాలో నిర్ణయిచేది మీరే కావాలి’’ అన్న నినాదాలు తనను మార్చేశాయని చెప్పారు. ఆ విధంగా.. రాజ‌కీయాల్లోకి రావాల‌ని నిర్ణ‌యించుకున్నట్టు చెప్పిన కేటీఆర్‌.. చివ‌ర‌కు తండ్రికి తెలియ‌కుండానే పాలిటిక్స్ లోకి ప్ర‌వేశించిన‌ట్టు చెప్పారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular