Etela Rajender- KTR: తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబంలో ముసలం పుట్టిందా? కేసీఆర్‌కు.. కేటీఆర్‌కు మధ్య దూరం పెరుగుతోందా? కేటీఆర్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణకు ముఖ్యమైన మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరిస్తుతన్నారు కేసీఆర్ తనయుడు కేటీఆర్. శాఖతో సంబంధం లేకుండా అన్నింటిలో ఆయనకు జోక్యం చేసుకునే స్వేచ్ఛ ఉంది. ముఖ్యమంత్రి పీఠానికి అడుగు దూరంలో ఉన్నారని బీఆర్‌ఎస్ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. ఈ తరుణంలో కేసీఆర్ కుటుంబంలో ముసలం పుట్టినట్లు తెలుస్తోంది. అందుకు కేటీఆర్‌ను కాబోయే ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయడమే కారణమన్న ప్రచారం జరుగుతోంది.

కొత్త సచివాలయం ప్రారంభంతో..
తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయింది. ఒక్క రోజు కూడా సెక్రటేరియేట్ నుంచి సీఎం కేసీఆర్ పాలన సాగించలేదు. తనకు అచ్చిరాని పాత సెక్రటేరియేట్‌ను కూల్చివేసి సుమారు రూ.900 కోట్ల ప్రజాధనంతో మయ సభను తలపించేలా కొత్త సచివాలయం నిర్మించారు. ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దీనిని ప్రారంభించాలని ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ సచివాలయం ప్రారంభంతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి మారతారని ప్రచారం జరిగింది. కేసీఆర్ స్థానంలో కేటీఆర్ సీఎం పీఠం అధిష్టిస్తారని తెలిసింది. కానీ, ఈ ప్రచారమే ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో ముసలానికి కారణమైంది. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమాలకు కేటీఆర్ పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని కప్పిపుచ్చేందుకు అప్పుడప్పుడూ కేసీఆరే తమ నాయకుడు అని, ప్యాన్ ఇండియా లీడర్ అని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ఖమ్మం సభలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు హాజరు కాకపోవడంతో కేసీఆర్ కుటుంబంలో ముసలం వ్యవహారం బయటపడింది.
కేటీఆర్ సొంతంగా అభ్యర్థుల ప్రకటన
ఇదిలా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులందరికీ సీట్లు ఇస్తామని కేసీఆర్ మూడు నెలల క్రితమే ప్రకటించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని కూడా తెలిపారు. దీంతో టికెట్ ఆశిస్తున్నవారు కొంత పునరాలోచనలో పడ్డారు. కానీ ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఎన్నికల సమయం నాటికి పరిస్థితి మారుతుందని ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ తనయుడు, తెలంగాణ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంతంగా అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్ జమ్మికుంటలో నిర్వహించిన బహిరంగ సభలో హుజూరాబాద్ అభ్యర్థిగా పాడి కౌషిక్‌రెడ్డిని ప్రకటించారు. రాబోయే ఎనిమిది, తొమ్మిది నెలలు జనంలోనే ఉండాలని సూచించారు. కౌషిక్ సారథ్యంలోనే హుజూరాబాద్ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. కేసీఆర్ ఆలోచనకు, ప్రకటనలకు విరుద్ధంగా కేటీఆర్ హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో కేసీఆర్, కేటీఆర్ మధ్య దూరం మరింత పెరిగిందన్న అభిప్రాయం గులాబీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది.
‘గెల్లు’కు షాక్ ఇచ్చిన మంత్రి..
గత ఉప ఎన్నికల్లో బీసీ కార్డు బాగా పనిచేస్తుందని గెల్లు శ్రీనివాస్‌ను టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ అది ఏమాత్రం వర్కౌట్ కాలేదు. దీంతో ప్రస్తుతం పాడి కౌషిక్‌రెడ్డికి మాత్రమే ఈటల రాజేందర్ ను ఓడించే అవకాశం ఇస్తున్నట్టు మంత్రి కేటీఆర్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. హుజురాబాద్ నియోజకవర్గం లో అధికార బీఆర్‌ఎస్ పార్టీ నేతల మధ్య ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం హోరాహోరి పోరాటం జరుగుతుంది. ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్‌కు, నియోజకవర్గ ఇన్‌చార్జిగా అవకాశం దక్కింది. తనకే టికెట్ వస్తుంది అనుకుంటున్న వేళ కేటీఆర్ ఊహించని షాక్ ఇచ్చారు.

ఈటలను టార్గెట్ చేశారా..
హుజురాబాద్ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈటల రాజేందర్‌ను ఓడించాలని కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఈటల రాజేందర్‌ను ఓడించడం టార్గెట్‌గా పెట్టుకొని రంగంలోకి దిగారు మంత్రి కేటీఆర్. అందులో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్ అభ్యర్థిగా పాడి కౌషిక్‌రెడ్డి పేరును ప్రకటించేశారు. వచ్చే ఎనిమిది నెలలు ప్రజాక్షేత్రంలో ఉండాలని సూచించారు. ఈటలను ఓడించటమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకు ముందే తనే సొంతంగా కౌషిక్‌రెడ్డిని ప్రకటించేశారు.
వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మీద పోటీ చేసి గెలుస్తానని ఈటల ప్రకటించారు. ఈమేరకు గజ్వేల్‌లో కార్యక్రమాలు ప్రారంభించారు. ఈటల గజ్వేల్‌వైపు చూస్తుంటే కేటీఆర్ మాత్రం ఈటల రాజేందర్‌ను ఓడించడమే లక్ష్యంగా హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటించడం చర్చనీయాంశమైంది.