Homeజాతీయ వార్తలుKTR: తారక ‘రాముడి’కి పట్టాభిషేకం జరిగేనా?

KTR: తారక ‘రాముడి’కి పట్టాభిషేకం జరిగేనా?

KTR: కేటీఆరే కాబోయే సీఎం.. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో వినిపించిన మాట ఇది. తన వారసుడిగా కేటీఆర్‌ను సీఎం చేయడానికే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని నాడు ప్రచారం జరిగింది. కానీ, ఫలితాలు వచ్చాక కేసీఆరే మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కొన్ని రోజుల వరకు కేటీఆర్‌కు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారని, అప్పుడు కేటీఆర్‌ను సీఎం కుర్చీపై కూర్చోబెడతారని లీకులు వచ్చాయి. కానీ, 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చాయి. బీజేపీ సొంతంగానే 300లకుపైగా స్థానాలు గెలుచుకుంది. దీంతో కేటీఆర్‌ను సీఎంను చేయాలన్న కల నెరవేరలేదు.

2022లో మరోసారి ప్రచారం..
ఇక 2022లో మరోసారి కేటీఆర్‌ సీఎం అవుతారని ప్రచారం జరిగింది. కేసీఆర్‌ క్యాబినెట్‌లోని మంత్రులు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఈ ప్రచారం మొదలు పెట్టారు. సభల్లో నేరుగా కాబోయే సీఎం కేటీఆర్‌ అని ప్రకటించారు. దీంతో 2023 ఎన్నికలకు ముందే కేసీఆర్‌ కొడుకును సీఎం కుర్చీలో కూర్చోబెడతారని ప్రచారం జరిగింది. కానీ ఆ చాన్స్‌ కూడా కేటీఆర్‌కు దక్కలేదు.

అధికారం లేకుండా ఉండలేక..
కేసీఆర్‌కు అధికారం అంటే పిచ్చి.. అధికారం లేకుండా ఉండలేరు అని ఆయన సన్నిహితులు చెబుతారు. అందుకే కేటీఆర్‌ను సీఎంగా చేసే విషయంలో వెనుకడుగు వేస్తున్నారని అంటున్నారు. తన అధికారం కోసం పార్టీలో ఎంతో మందిని బలిచేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. తన అవసరం కోసం అనే కమందిని పార్టీలో చేర్చుకున్న కేసీఆర్‌ తర్వాత వారిని కూరలో కరివేపాకులా తీసివేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా కేటీఆర్‌కు అధికారం అప్పగిస్తే.. తాన ఖాళీగా కూర్చోవాల్సి వస్తుందన్న ఆలోచనతోనే సొంత కొడుకును సైతం అధికారంపై ఆశపెడుతూనే వస్తున్నారు.

ఈసారైనా పట్టాభిషేకం జరిగేనా..
తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది. నవంబర్‌ 3న నోటిఫికేషన్‌ రానుంది. 30 ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్‌ 3న ఫలితాలు ప్రకటిస్తారు. అయితే ఈసారి తమ సీఎం అభ్యర్థి కేసీఆర్‌ అని కేటీఆర్‌ పదే పదే చెబుతున్నారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌ సీఎంగా ప్రమాణం చేస్తారని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే ఈ మాటల వెనుక ఆంతర్యం వేరే ఉందన్న అభిప్రాయం పొలిటికల్‌ సర్కికల్స్‌లో వ్యక్తమవుతోంది. గతంలో యూపీలో సమాజ్‌వాదీ పార్టీ మాజీ అధినేత ములాయన్‌సింగ్‌తో విస్తృతంగా ప్రచారం చేయించిన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన అఖిలేష్‌యాదవ్‌.. తర్వాత తండ్రిని తప్పించి తాను గద్దెనెక్కి కూర్చున్నారు. ఈసారి కేటీఆర్‌ కూడా ఆదే చేస్తారని ప్రచారం జరగుతోంది.

కేసీఆర్‌పై నమ్మకం లేకనే..
సీఎం కేసీఆర్‌ అధికారం కోసం ఎవరినైనా బలిచేస్తారు అనేది జగమెరిగిన సత్యం. చివరకు కుటుంబ సభ్యులను ఇందుకు అతీతులు కారు. ఐదేళ్లుగా కేటీఆర్‌ను సీఎం పీటం ఊరిస్తోంది. కానీ కేసీఆర్‌ ఛాన్స్‌ ఇవ్వడం లేదు. ఈసారి ఛాన్స్‌ ఇస్తారని చూడకుండా ఛాన్స్‌ తీసుకోవాలని చూస్తున్నారు కేటీఆర్‌. ఎన్నిల ఫలితాలు వెలువడిన వెంటనే మెజారిటీ ఆధారంగా గద్దెను ఎక్కాలనుకుంటున్నారు.

రాముడినే సీఎం చేయాలనుకుంటున్న కేసీఆర్‌..
ఇదిలా ఉంటే కేసీఆర్‌ కూడా 2023 ఎన్నికల తర్వాత కేటీఆర్‌ను సీఎం చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల వరకు తాను సీఎంగా ఉండి తర్వాత కేంద్రంలో ఏర్పడే ఎన్డీఏ సర్కార్‌లో చే రాలని నిర్ణయించారని సమాచారం. కేంద్రంలో చేరిన తర్వాత మంత్రి పదవి తీసుకుని, తెలంగాణ సీఎం కుర్చీలో కేటీఆర్‌ను కూర్చోబెడతారని తెలుస్తోంది. ఈమేరకు పార్టీ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి. కేంద్రంలో తనతోపాటు కవితకు పదవి తీసుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నారని సమాచారం.

ఏది ఏమైనా తారక రాముడు ఈసారి సీఎం కావడం కాయం అని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రగతి భవన్‌ నుంచి కూడా లీకులు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి!

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular