Komatireddy Raj Gopal Reddy: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మరి కొన్ని గంటల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. దీంతో శుక్రవారం కూడా భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు రోజుల్లో మొత్తం 2,747 నామినేషన్లు దాఖలయ్యాయి. మంచి ముహూర్తం ఉండడంతో గురువారం ఒక్కరోజే 1,129 దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానిధికారి తెలిపారు. గురువారం సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు పలువురు సీనియర్ నాయకులు నామినేషన్ వేశారు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నామినేషన్ వేశారు.
కోట్లలో కోమటిరెడ్డి ఆస్తులు..
ఎన్నికల అఫిడవిట్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా అందరిలాగే తన పేరిట ఎలాంటి వాహనాలు లేవని పేర్కొన్నారు. ఆస్తుల విలువ రూ.405 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో చరాస్తుల విలువ రూ.297,36,37,347.. స్థిరాస్తి విలువ రూ.108,23,40,000గా వెల్లడించారు. కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తుల విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో రూ.4.27 కోట్లను ఆస్తులుగా పేర్కొన్న మంత్రి జగదీశ్‌రెడ్డి నిలిచారు.
మొదటి నుంచి వ్యాపారంలో..
కోమటిరెడ్డి బ్రదర్స్ మొదటి నుంచి వ్యాపారంలో ఉన్నారు. వారికి ఏ1 కాంట్రాక్టర్లుగా గుర్తింపు ఉంది. పెద్దపెద్ద ప్రాజెక్టులు, జాతీయస్థాయిలో నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో ఆదాయం కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. మునుగోడు ఎన్నికల సమయంలో ఆయన బీజేపీలోకి చేరడానికి భారీ ప్రాజెక్టు కేటాయించడమే అని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు. రూ.18 వేల కోట్ల ప్రాజెక్టు కోసమే రాజగోపల్రెడ్డి ఉప ఎన్నికలు తెచ్చారని విస్తృతంగా ప్రచారం చేశారు. ఫలితంగా ఆయన ఓడిపోయారు.