Kodali Nani: సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం 24 మంది మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎం జగన్ కు అందజేశారు. అయితే ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న కొందరు మంత్రులు మళ్లీ కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఎవరెవరు ఉంటారన్నది మాత్రం బయటపడలేదు.
జగన్ కేబినెట్ భేటిలో కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. సీనియర్ మంత్రుల అనుభవం కేబినెట్ కు అవసరమని సీఎం అన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘కేబినెట్ లో కొందరు సమర్థులు కావాలి. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే వ్యక్తులు కావాలి. అవగాహన కలిగిన వారు కావాలి. పార్టీలో ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో సీఎం జగన్ కు బాగా తెలుసు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తా’ అని కొడాలి నాని కొంత అసంతృప్తితో కూడిన వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్లంతా అసమర్థులేనా? అన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది. సమర్థుల కోసమే జగన్ కొత్త కేబినెట్ విస్తరిస్తున్నట్టుగా తెలుస్తోంది.
దీన్ని బట్టి కొడాలి నాని లాంటి నేతకు మరోసారి మంత్రి పదవి మరోసారి రాదని అర్థమవుతోంది. ఇక సీనియర్లకు చాన్స్ ఉండొచ్చని కొడాలి నాని అనడంతో బొత్స, పెద్దిరెడ్డికి .. మరికొందరు సీనియర్లకు చాన్స్ ఉండొచ్చని తెలుస్తోంది.
ఇక సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మాజీ మంత్రి వెల్లంపల్లి చెప్పుకొచ్చాడు. ఐదారుగురు మంత్రులే కేబినెట్ లో మరోసారి అవకాశం దక్కించుకుంటారని జోస్యం చెప్పారు. అయితే తాను కొనసాగేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. రాజీనామాల విషయంలో సీఎం జగనే ఎక్కువగా బాధపడ్డారని వెల్లంపల్లి చెప్పుకొచ్చాడు.