Kishan Reddy: వందే భారత్ రైళ్లు ఇస్తే అభివృద్ధి అయిపోయినట్టేనా కిషన్ జీ!

అభివృద్ధి అనేది బ్రహ్మ పదార్థం కాదు. అది నిరంతర ప్రక్రియ. ఎప్పటికీ జరుగుతూనే ఉండాలి. అభివృద్ధి జరగడం వల్లే ప్రజల జీవన ప్రమాణాలు మారతాయి. కొత్త ఆదాయాలు పుట్టుకొస్తాయి. ఉద్యోగాలు సైతం అదే స్థాయిలో ఉంటాయి. ఫలితంగా దేశం పురోగమనంలో వెళ్తూ ఉంటుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 13, 2024 8:03 pm

Kishan Reddy

Follow us on

Kishan Reddy: చైనా, అమెరికా, జపాన్, యూరప్ దేశాలు పై సిద్ధాంతాన్ని అమలు చేస్తుంటాయి కాబట్టే.. అవి అభివృద్ధి చెందిన దేశాలుగా మారిపోయాయి. ప్రపంచం లో ఉన్న సంపదలో సగం కంటే ఎక్కువగా తమ వద్ద పోగు చేసుకున్నాయి.. అందువల్లే ప్రపంచం మొత్తం ఈ దేశాలు చెప్పినట్టు నడుస్తుంది. ఆ దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఉంటుంది. అంటే ఆదేశంలో అవినీతి లేదా? అక్రమాలు జరగడం లేదా? అనే ప్రశ్నలకు అవును అనే సమాధానం చెప్పొచ్చు. కాకపోతే వ్యవస్థను నిర్వీర్యం చేసే స్థాయిలో అక్కడ జరగడం లేదు. మన దేశం విషయానికొస్తే కొంతకాలంగా పురోగమనం వైపు అడుగులు వేస్తోంది. కాకపోతే కీలకమైన అంశాలను విస్మరిస్తోంది. ఇక తాజాగా ఈనెల 16న తెలుగు రాష్ట్రాలలో మరో రెండు కొత్త వందే భారత్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. నాగపూర్ నుంచి హైదరాబాద్, దుర్గ్ నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైళ్లు నడుస్తాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇది ఆమోదయోగ్యమే అయినప్పటికీ.. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సాయం దక్కడం లేదనేది ఎప్పటినుంచో ఉన్న ఆరోపణ. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్నారు కాబట్టి.. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్లు మంజూరయ్యాయి. ఒకవేళ టిడిపి కనుక కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉండకపోతే స్థాయిలో కేంద్రం నుంచి సాయం దక్కి ఉండేది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణ నుంచి బిజెపి 8 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. కానీ తెలంగాణకు చెప్పుకోదగ్గ ఒక ప్రాజెక్టు కూడా మంజూరు కాలేదు. ఇదే విషయాన్ని బిజెపి ఎంపీలు సైతం అంతరంగిక చర్చల్లో అంగీకరిస్తుంటారు.

కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారు. ప్రధానమంత్రిని స్వయంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. నిధులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం సహాయంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రకటించారు. అప్పట్లో తెలంగాణలో పర్యటించిన నరేంద్ర మోడీని బడేభాయ్ అని సంబోధించారు. కానీ కేటాయింపులకు వచ్చేసరికి కేంద్రం తన బడే భాయ్ పాత్రను పోషించలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఉన్నాయని.. అవి మంజూరు చేయడం లేదని.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎన్నో సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించడంలో కేంద్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు . కేటాయింపులు జరపాల్సిన ఎన్నో ఉన్నాయని.. ఇవ్వాల్సిన నిధులు కూడా పెండింగ్లో ఉన్నాయని.. ఇటీవల వర్షాల వల్ల చోటు చేసుకున్న నష్టానికి సంబంధించి పరిహారం కూడా రాలేదని.. ఇలాంటి సమయంలో చేయాల్సిన పనులు చేయకుండా.. వందే భారత్ రైళ్లు ఇస్తున్నమని చెప్పడం ఎంతవరకు సబబు అని కాంగ్రెస్ నాయకులు కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులను, బకాయిలను ఇప్పించాలని వారు కోరుతున్నారు.