Kerala Election Halwa: తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, పాండిచ్చేరి ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది.. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాలలో నియోజకవర్గాల ఆధారంగా ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. సమస్యాత్మకమైన ప్రాంతాలలో బందోబస్తు ఏర్పాటు చేస్తోంది.. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అక్కడ ఎన్నికల సంఘం కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది.
ఈసారి ఎన్నికలలో ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఎన్నికల సంఘం బలంగా నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కొత్తగా నమోదైన ఓటర్లకు అవగాహన కల్పిస్తోంది. సుదూర ప్రాంతాలలో ఉన్న వారు కూడా తమ గ్రామాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తోంది. ఓటింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేస్తోంది. మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటుచేసి ఓటర్లను ఆకర్షిస్తోంది. వృద్ధులకు.. దివ్యాంగులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది. ఎక్కడ కూడా అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఉండడానికి బందోబస్తు నిర్వహిస్తూనే.. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తోంది.
ఎన్నికల సంఘం ఈసారి కేరళలో సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారికి హల్వా పంపిణీ చేయనుంది. దీనికి vote sweetend Kerala campaign పేరును నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని కేరళ ఎన్నికల సంఘం అధికారి రతన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని పోలింగ్ కేంద్రాలలో కొత్తగా ఓటు హక్కు పొందినవారు.. తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత హల్వా తినొచ్చు. అక్కడ ఏర్పాటు చేసిన కేంద్రాలలో సిబ్బంది కొత్తగా నమోదైన ఓటర్లకు హల్వా పంపిణీ చేస్తారు. ఆ హల్వాను అక్కడే తినాలి. దీనివల్ల ఓటర్లలో సామాజిక చైతన్యం పెరుగుతుందని.. ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిక కలుగుతుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.
“ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఆయుధం లాంటిది. ఓటు అనే హక్కు ద్వారా తనకు నచ్చిన ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవడానికి ప్రజలకు ఆస్కారం ఉంటుంది. భారత రాజ్యాంగం కల్పించిన ఈ హక్కు చాలా ఉన్నతమైనది. ఈ హక్కును అందరు వినియోగించుకోవాలి. తమ ప్రాంతానికి ఎవరు ప్రజా ప్రతినిధి అయితే బాగుంటుందో వారికి తెలియాలి. అటువంటివారిని ప్రోత్సహిస్తూ ఈ హల్వా కార్యక్రమాన్ని ప్రారంభించామని” ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.