KCR Kanti Velugu: నరేంద్రమోదీ గుజరాత్‌ను మోడల్‌గా చూపి ప్రధానమంత్రి అయ్యాడు.. నేను తెలంగాణ మోడల్‌ను దేశానికి చూపించి ప్రధాని పీఠం ఎక్కలేనా అన్న ఆలోచన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును జాతీయ పార్టీవైపు నడిపించింది. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని పదేపదే కేసీఆర్ అండ్ కో కోడై కూస్తున్నాయి. ఈ పథకాలతో దేశం దృష్టిని ఆకర్షిస్తానని 2024లో ప్రధానమంత్రి అవుతానని గులాబీ బాస్ కలలు కంటున్నారు. జాతీయ పార్టీ బీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి మౌనంగా ఉన్న తెలంగాణ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కూడా రెండు రోజులుగా స్పందిస్తున్నారు. అయితే ఆ స్పందనలో అసహనం, అసంతృప్తి, ఆందోళన కనిపిస్తున్నాయి. కొడుకులో మాటల్లో టెన్షన్ కనిపిస్తున్నా.. తండ్రి మాత్రం తగ్గేదేలే అంటున్నారు.
సంక్షేమమే గట్టెక్కిస్తుందని..
తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా రాజకీయాలు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశ రాజకీయాల కోసం వాడుకోనున్నారు. తాజాగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈనెల 18వ తేదీ నుంచి కొనసాగించనున్న నేపథ్యంలో కంటి వెలుగు ద్వారా దేశం దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సీఎం కేసీఆర్.
కంటి వెలుగు కాపాడుతుందని..
సీఎం కేసీఆర్ ఏ పని చేసినా ఒక అర్థం, దాని వెనుక భవిష్యత్తు వ్యూహం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్‌గా చూపిస్తూ సంక్షేమంలో, అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా ఈనెల 18వ తేదీన ఖమ్మంలో జరగనున్న బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఆ రాష్ట్రాల సీఎంల సమక్షంలో..
ఇక రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాలకు చెందిన మాజీ ముఖ్య మంత్రులు సైతం హాజరుకానున్నారు. వీరందరి సమక్షంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంతమాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను ఆహ్వానించిన తెలంగాణ సీఎం కేసీఆర్, సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ని కూడా ఆహ్వానించారు. వారి సమక్షంలో కంటివెలుగును లాంచ్ చేయనున్నారు.
దేశం దృష్టిలో పడేలా సంక్షేమ మంత్రం
ఖమ్మ సభ వేదికగా ప్రజలందరి కంటి ఆరోగ్యం కోసం నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారన్న విషయాన్ని దేశ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుంచి తెలంగాణ సంక్షేమాన్ని దేశంలో అమలు చేస్తామని చెబుతూ, సంక్షేమ మంత్రంతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కూడా జాతీయస్థాయిలో మైలేజ్ కోసం, జాతీయంగా ప్రజలను ఆకట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం రూ.250 కోట్లు ఖర్చు చేస్తుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సామూహిక కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గొప్పదనం తెలంగాణ రాష్ట్రానిది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్‌కు పట్టం కడితే ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
మొత్తంగా కంటి వెలుగు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించే పనిలో ఉన్నారు కేసీఆర్. మరి కంటివెలుగు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏమేరకు బీఆర్‌ఎస్‌కు బలం చేకూరుస్తుందో చూడాలి.