Jagan- KCR: దేశంలో మరో జాతీయ పార్టీ పురుడుపోసుకోనుంది. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించనుంది. చాన్నాళ్లుగా నాన్చుతూ వస్తున్న కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు క్లైమాక్స్ కు చేరుకుంది. ఫుల్ క్లారిటీ వచ్చింది. ఈ నెల 5 విజయదశమి నాడు కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. వెంటనే దేశవ్యాప్త పర్యటనలకు బయలుదేరనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు సులువే అయినా.. దానిని నిలబెట్టుకోవడం కష్టమైన పని. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మూడు రాష్ట్రాల్లో రెండు శాతం లోక్ సభ సీట్లు సాధించాలి. లేకుంటే నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీ గా ఉండాలి. అయితే వీటిని కేసీఆర్ ఎలా అధిగమిస్తారన్నదే ఇప్పుడు ప్రశ్న. అయితే ఇప్పటికే కేసీఆర్ స్పష్టమైన ప్రణాళికతో ఉన్నారని.. దానిని అమలుచేయడమే తరువాయి అని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో మూడోసారి అధికారం ఖాయమని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక్కడున్న రాజకీయ పరిస్థితులు, బహుముఖ పోరును దృష్టిలో పెట్టుకొని అంచనాకు వస్తున్నారు. ఇదే కరెక్టు సమయమని.. జాతీయ పార్టీ ప్రకటనలకు సిద్ధమవుతున్నారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై తన భవిష్యత్ ప్రణాళికను వివరించారు. వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా పక్క రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణతో పాటు ఏపీ,కర్నాటక, మహారాష్ట్రలపై ఫోకస్ పెట్టనున్నట్టు తెలిపారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో 50,60 లోక్ సభ స్థానాలను గెలుపొందవచ్చని కేసీఆర్ అంచనాకు వచ్చారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో జత కలిసి టార్గెట్ స్థానాలను దక్కించుకోనున్నట్టు చెప్పారు. మహారాష్ట్రలో రైతుల ఓటింగ్ లాభిస్తుందని చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలోని మరఠ్వాడ, కర్నాటకలోని తెలుగు ప్రాంతాలు, బెంగళూరు నగరంలో పార్టీకి మంచి ఆదరణ ఉంటుందని కేసీఆర్ అభిప్రాయానికి వచ్చారు.
అయితే ఏపీ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ బలమైన ప్రాంతీయ పార్టీలు వైసీపీ, టీడీపీలున్నాయి. ఈ సమయంలో కేసీఆర్ చొచ్చుకురావడం అంత సాధ్యమయ్యేునా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొన్నటి వరకూ జగన్, కేసీఆర్ ల మధ్య మంచి సాన్నిహిత్యమే ఉండేది. కానీ ఇద్దరూ వేర్వేరు మార్గాల్లో పయనిస్తున్నారు. జగన్ బీజేపీతో సన్నిహితంగా ఉండగా.. కేసీఆర్ అదే బీజేపీని వ్యతిరేకిస్తూ జాతీయ పార్టీ ప్రకటించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా జగన్ ముందడుగు వేసే అవకాశమే లేదు. అందుకే వైసీపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక్రిష్టారెడ్డి తాము ఏ కూటమిలో చేరబోమని స్పష్టం చేశారు. అటు చంద్రబాబుది కూడా అదే పరిస్థితి. రాజకీయంగా బద్ధ శత్రువుల్లా కేసీఆర్, చంద్రబాబు ఉన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు అధికారానికి దూరం కావడానికి కేసీఆర్ ఒక కారణం. పైగా బీజేపీతో కలిసి నడవాలని భావిస్తున్న చంద్రబాబు కేసీఆర్ తో కలవడం జరగని పని.

అయితే ఏపీ విషయంలో కేసీఆర్ కు వేరే లెక్కలు ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రా సెటిలర్స్ ఎక్కువగా టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారు. దానికి కారణం ఏపీలో కంటే సంక్షేమ పథకాలు, శాశ్వత ప్రయోజన పథకాలకు కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుండడమే. అందుకే సెటిలర్స్ మూలాలను ఆధారంగా చేసుకొని ఏపీలో తన పార్టీని విస్తరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అటు తెలంగాణ సరిహద్దులోని ఏపీ జిల్లాల్లో కూడా టీఆర్ఎస్ పై సానుకూలత ఉంది. అటు ఖమ్మం నుంచి డివైడ్ అయిన మండలాల ప్రజలు కూడా టీఆర్ఎస్ ను అభిమానిస్తున్నారు. వారంతా తిరిగి తెలంగాణలో తమ గ్రామాలను కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పార్టీ విస్తరణ సక్సెస్ అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు.