Kodali Nani- KCR: కొడాలి నాని… ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే నియోజకవర్గం గుడివాడ.. నాటి అంటే గుడివాడ.. గుడివాడ అంటే నాని అన్నట్లుగా అక్కడ వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు నాని. ఇప్పుడు అలాంటి అడ్డాలో నానికి షాక్ తగిలిందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరావు ఆ షాక్ ఇవ్వడం ఇక్కడ ట్విస్ట్. అందేంటి తెలంగాణ నాయకుడు ఆంధ్రా మాజీ మంత్రికి ఎలా షాక్ ఇస్తాడా అని అనుకుంటున్నారా.. నిజమే ఆయన స్థాపించిన కొత్త పార్టీ బీఆర్‌ఎస్ ద్వారా నానికి ఝలక్ ఇవ్వాలని చూస్తున్నారట. ఇప్పుడు ఇదే నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయింది.

వైసీపీలో క్రేజ్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొడాలి నానికి ప్రత్యేక స్థానం ఉంది. నందమూరి కుటుంబానికి వీరాభిమాని అయిన నాని.. సీనియర్ ఎన్టీఆర్‌పై అభిమానంతో టీడీపీలో చేరారు. తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.
కానీ, వైసీపీ నేతగా.. మంత్రిగా ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది. మాజీ మంత్రి అయినా.. మంత్రులతో సమాన గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు.. నారా లోకేష్‌తోపాటు విపక్ష నేతలను బండబూతులు తిట్టడంలో ఆయన తర్వాతే ఎవరైనా అంటే అతిశయోక్తి కాదు.
గుడివాడ అడ్డాగా..
గుడివాడ అంటే కొడాలి నాని అడ్డా అని చెప్పాలి. అందుకే వరుస విజయాలు సాధిస్తున్నారు. అయితే ఓ వైపు ప్రభుత్వం వ్యతిరేకత.. దానికి తోడు వరుసగా ఎన్నిక అవుతున్నా.. అక్కడ పనులు ఏమీ జరగలేదని ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దానికితోడు ప్రతిపక్షాలు కాస్త పుంజుకుంటున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఇదే సమయంలో కొడాలి నానికి మరో షాక్ తగలనుందా అన్న చర్చ మొదలైంది.
ఈసారి ఎదురు గాలి..
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని.. ఈ సారి గట్టి పోటీ ఎదుర్కోక తప్పదా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తాజా పరిణామాలు చూస్తే గుడివాడ వాసుల నుంచి కూడా అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే కొడాలి నాని ఏ విషయాన్ని ఖండించారో.. ఆ వెంటనే అదే అంశాన్ని సపోర్ట్ చేస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. అంటే నానీ అడ్డాలో ఆయన్ను ధిక్కరించే గ్రూప్ సిద్ధమైందన్న చర్చ ఇప్పుడు గుడివాడలో జోరుగా చర్చ జరుగుతోంది.
రంగంలోకి గులాబీ బాస్..
అసలు విషయం ఏంటంటే..? తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ .. ఇటీవల జాతీయ పార్టీగా మారి బీఆర్‌ఎస్‌గా పేరు మార్చుకుంది. దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. ఏపీలో బీఆర్‌ఎస్ మార్క్ కనిపిస్తుందా..? కేసీఆర్ హవా ఇక్కడ కూడా చూపిస్తారా అనేది హాట్ టాపిక్ గానే ఉంది. అదే సమయంలో ఏపీకి చెందిన పలువురు నేతలు కూడా బీఆర్‌ఎస్‌పై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని కూడా స్పందించారు. ఆంధ్రాలో కేసీఆర్ పార్టీకి ఆదరణ ఉండదన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం బాగానే ఉందని.. కొత్త పార్టీల అవసరం ఇక్కడ లేదని వ్యాఖ్యానించారు. నాని మాట్లాడిన రెండు రోజులకే గుడివాడలో ఆయన షాక్‌కు గురయ్యే సీన్ కనిపించింది. బీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. కేటీఆర్ యూత్ పేరుతో కొందరు యువకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

నాని వ్యతిరేకుల పనేనా?
అయితే, ఈ ఫ్లెక్సీ ఏర్పాటులో కొడాలి నాని వ్యతిరేకుల హస్తం ఉన్నట్లు గుడివాడలో ప్రచారం జరగుతోంది. ఆయన వెంట తిరుగుతూనే ఆయనకు వ్యతిరేకంగా పోస్టర వేయించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జాతీయ పార్టీ ప్రారంభించినందుకు కేటీఆర్‌కు అభినందనలు తెలిపుతూ ఫ్లెక్సీలు పెట్లటడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొడాలి నాని తీరు నచ్చకనే ఆయన కామెంట్స్‌కు కౌంటర్‌గా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ప్రచారం జరుగుతోంది. ఏపీలోనూ కేసీఆర్‌కు ఆదరణ ఉందనడానికి అదే నిదర్శనమని కొందరు పేర్కొంటున్నారు. గుడివాడలో వెలమ సామాజికవర్గానికి చెందిన కొందరు యువకులు.. కేసీఆర్‌పై అభిమానాన్ని చాటుకున్నారే తప్ప బీఆర్‌ఎస్ ప్రభావం ఏపీలో ఉండదని ఇంకొందరు అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీలో బలమైన నాయకుడిగా ఉన్న కొడాలి నానిపై వ్యతిరేకత స్థానికంగా పెరుగుతుందని మాత్రం రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన నానిని టార్గెట్ చేశాయి. తాజాగా బీఆర్‌ఎస్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ప్రజల్లో పట్టు కోల్పోతే కంచుకోటలో నానికి పరాభవం తప్పదని పేర్కొంటున్నారు.