CM KCR: ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను రూ.3 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్లిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో మళ్లీ కొత్త అప్పుల కోసం వేట షురూ చేసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా మార్చిలో భారీగా పన్నులు వసూలయ్యాయి. రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా భారీగా పెరిగింది. వాహనాలకు ఈ-చలాన్ రూపంలో విధించిన జరిమానా వసూలుకు రాయితీ ప్రకటించి వసూళ్లు మొదలు పెట్టింది. అయినా ఏప్రిల్ నెలలో ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. గత నెలలోనే ఇన్‌కం ట్యాక్స్ కోత పేరుతో వేతనాలను ఆలస్యంగా చెల్లించిన ప్రభుత్వం, ఆసరా పింఛన్లు కూడా మార్చి నెలాఖరులో మంజూరు చేసింది. తాజాగా ఏప్రిల్ నెల మొదటి వారం దాటినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందలేదు. దీంతో ప్రభుత్వం అప్పులు కావాలని రిజర్వు బ్యాంకు తలుపు తట్టింది.
-రూ. 15 వేల కోట్లకు ఇండెంట్..
రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018 నుంచి అప్పుల ఆధారంగానే పాలన సాగిస్తోంది. మూడేళ్లలో ఒక్క నెలలో కూడా 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం లేదు. విడతల వారీగా.. శాఖల వారీగా వేతనాలు చెల్లిస్తోంది. పింఛన్లు కూడా రెండో వారం మూడో వారం మంజూరు చేస్తోంది. విచ్చల విడిగా ఖర్చులు పెరగడం.. ప్రణాళిక లోపంతో నిధులు వెచ్చించడంతో ప్రభుత్వం పాలనకు అప్పులపైనే ఆధార పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో 2022–23 ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభం అయ్యిందో లేదో.. కొత్తగా రూ.15 వేల కోట్లు అప్పు కావాలని రిజర్వు బ్యాంకుకు ఇండెంట్ పెట్టుకుంది. ఆర్జీఐ ఇటీవల ప్రకటించిన వివిధ రాష్ట్రాల క్వార్టర్లీ అప్పుల జాబితాలో ఈ విషయం బహిర్గతమైంది. ఏప్రిల్‌లో రూ.3 వేల కోట్లు, మేలో రూ.8 వేల కోట్లు, జూన్‌లో రూ.4 వేల కోట్ల అప్పులు కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరినట్లు ప్రకటించింది. ఆర్జీఐ ప్రతినెలా నిర్వహించే బాండ్ల ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనుంది. మొత్తంగా ఈ ఏడాది కొత్తగా రూ.59,672 అప్పు చేయాలని రాష్ట్రం నిర్ణయించినట్లు ఆర్బీఐ క్యాలెండర్ స్పష్టం చేసింది.
-అప్పు పుడితేనే జీతాలు..
ప్రతీనెల 1వ తారీఖున ఉద్యోగుల ఖాతాల్లో జమ కావాల్సిన వేతనాలు కొన్ని నెలలుగా ఆలస్యమవుతున్నాయి. ఈ నెల మొదటి వారం గడిచినా… ఉద్యోగులకు జీతాలు అందలేదు. పెన్షనర్లకు మాత్రం గురువారం పింఛన్లు వారి ఖాతాల్లో జమ చేసింది. ఆసరా పింఛన్లు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పు పుడితే గానీ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఈనెల 11వ తేదీ వరకు రిజర్వు బ్యాంకు నుంచి రూ.3 వేల కోట్లు అప్పు తీసుకుని వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది.
-ఇప్పటికే నెలకు రూ.1,500 కోట్ల వడ్డీ..
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన రూ.3 లక్షల కోట్ల అప్పులకు ప్రతినెలా ఇన్‌స్టాల్‌మెంట్, వడ్డీ కోసం రూ.1,500 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఏడాది చేసే అప్పులతో మరో రూ.100 కోట్ల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు వచ్చే ఏడాదికి రూ.5 లక్షల కోట్లకు చేరుకుంటాయని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. ఇప్పటికే రూ.3.44 కోట్ల అప్పు తీసుకున్నట్లు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. కొత్తగా ఈ ఏడాది వివిధ కార్పొరేషన్ల పేరుతో రూ.1.5 లక్షల కోట్లు అప్పు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి అప్పులు రూ.5 లక్షలకు చేరుకోనున్నాయి.