k.chandrashekar rao
మరో మూడు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో పార్టీ ఎలా వ్యవహరించాలో ఇప్పటికే మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎక్కడా వాదోపవాదాలకు పోకుండా సమావేశాలు సామరస్యంగా సాగేలా చూడాలని సూచించారు. సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రధానంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రస్తావించండం ప్రత్యేకతను చాటుకుంది. కొత్త రెవెన్యూ చట్టానికి ఈ సమావేశాల్లోనే ఆమోద ముద్ర వేయాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
రెవెన్యూ వ్యవస్థలో జరుగుతున్న అవినీతిని కట్టడి చేసేందుకు కేసీఆర్ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేశారు. రోజురోజుకూ రెవెన్యూలో పెద్ద సంఖ్యలో అవినీతి కేసులు పెరుగుతుండడంతో ప్రక్షాళన చేయాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఎప్పటి నుంచో చెబుతున్నా ఇంకా దానిని అమల్లోకి తీసుకురాలేదు. ప్రధానంగా రెవెన్యూలో భూ రికార్డుల నిర్వహణ, మ్యుటేషన్, అవినీతిని అరికట్టడమే లక్ష్యంగా ఈ కొత్త చట్టాన్ని రూపొందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి.. కొత్త రెవెన్యూ చట్టంలో ఏయే అంశాలు ఉన్నాయి? ఇది అమల్లోకి వస్తే రెవెన్యూ వ్యవస్థలో వచ్చే మార్పులు ఏమిటి? అంతిమంగా ప్రయోజనాలు ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారింది. భూములు కొన్నవారికి రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ (వివరాల నమోదు) చేయించుకోవడం ప్రహసనంగా మారింది.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రైతులు మ్యుటేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ చేతులు తడిపితే తప్ప మ్యుటేషన్ చేసే పరిస్థితి ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
పోనీ మ్యుటేషన్ అయ్యాక వెంటనే రైతులకు పాస్‌బుక్‌లు అందుతున్నాయా అంటే అదీ లేదు. వాటిని జారీ చేసే క్రమంలోనే అవినీతే జరుగుతోంది. ఇది స్వయంగా సీఎం కార్యాలయే నిర్ధారించింది. ఏసీబీ అధికారులు కూడా తమ నివేదికల్లో దీనినే ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో కొత్త రెవెన్యూ చట్టంతో ఈ ఇబ్బందులన్నీ తొలగించాలని చూస్తున్నారు. మ్యుటేషన్ అయ్యాక వీఆర్వోలు, తహసీల్దార్‌ల చుట్టూ తిరగకుండా ఇంటికే ‘ఎలక్ర్టానిక్ టైటిల్ డీడ్ కమ్ పట్టాదారు పాస్‌పుస్తకం’ పంపిస్తారని తెలుస్తోంది.
భూముల రిజిస్ట్రేషన్ అయిపోగానే జాప్యం లేకుండా రికార్డుల్లో రికార్డ్ ఆఫ్ రైట్ చట్టం ప్రకారం మ్యుటేషన్ జరగాలని, దీనికోసం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని వినియోగించుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. బ్యాంకు ఖాతాల్లో నగదు లావాదేవీల సమాచారం లాగే క్రయ విక్రయదారులకు సంబంధించి ఆధార్ అనుసంధానం చేసిన ఫోన్ నంబర్లకు భూముల లావాదేవీల సమాచారం చేరనుంది. రిజిస్ట్రేషన్ల కోసం సమీకృత భూరికార్డుల యాజమాన్య పథకం(ధరణి) వెబ్‌సైట్‌ను వినియోగించుకోనున్నారు. కొత్త చట్టంలో రిజిస్ట్రేషన్ అధికారాలను తహసీల్దార్లకు ఇవ్వడమే కాకుండా ఏ మాత్రం జాప్యం లేకుండా భూముల లావాదేవీలు నమోదు చేయకుంటే… తగిన చర్యలు తీసుకునేలా చట్టంలో క్లాజులను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభ సమావేశాలు పూర్తయిన వెంటనే ధరణి వెబ్‌సైట్‌ను లాంఛనంగా సీఎం కేసీఆర్ ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న సమగ్ర రెవెన్యూ చట్టంలో రెండు అంశాలపై ప్రధానంగా అధికారులు దృష్టి పెట్టినట్లు సమాచారం. ఒకటి రికార్డ్ ఆఫ్ రైట్ (ఆర్‌వోఆర్) సవరణ చట్టం కాగా మరొకటి అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం(పీవోటీ). ఈ రెండు చట్టాలకు ముడిపడి డజన్ల కొద్దీ చట్టాలున్నాయి. ఈ రెండు చట్టాలను అమలు చేయాలంటే పలు చట్టాల అమలు కీలకం కానుంది. వాటినన్నింటినీ కలుపుకొని సమగ్ర రెవెన్యూచట్టం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 145 చట్టాల్లో కాలానుగుణంగా లేని, కాలంచెల్లిన చట్టాలుగా భావిస్తున్నవాటిని రద్దు చేయాలనే యోచనతో ప్రభుత్వం ఉంది. కాగా.. నెల రోజులుగా సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో కొత్త రెవెన్యూ చట్టానికి తుదిరూపు ఇచ్చే ప్రక్రియ జరుగుతున్నట్లు సమాచారం. సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు పర్యవేక్షణలో మూడు అంచెల్లో కమిటీలు వేగంగా పనిచేస్తున్నాయి. ఈ కమిటీలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందర్‌రావు, మాజీ ఐఏఎస్‌లు షఫీకుజ్జమాన్, మహ్మద్‌అలీ రఫత్, బి.రామయ్యతోపాటు పూర్వ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సుందర్ అబ్నార్ తదితరులతోపాటు సీనియర్ ఐఏఎస్‌లను చేర్చారు. సీసీఎల్‌ఏ స్థాయిలో కీలక అధికారులను కూడా భాగస్వాములను చేశారు. సీఎంవో స్థాయిలోని అధికారులు ఒక అంచెలో, రెండో అంచెలో రిటైర్డ్ ఐఏఎస్/రెవెన్యూ అధికారులు, మూడో అంచెల్లో సచివాలయ స్థాయి అధికారులు, చివరి అంచెలో సీసీఎల్‌ఏ స్థాయి అధికారులు ఈ కమిటీల్లో ఉన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూచట్టంపై కూడా చర్చిస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో కొత్త చట్టానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Kcr prepare everything for assembly meetings
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com