KCR National Party: దసరా వేళ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు హైదరాబాద్ వాతావరణం చూస్తే అర్థమవుతోంది. రేపు కేసీఆర్ జాతీయ పార్టీకి వెల్ కం చెబుతూ రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ లో టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కు భారీ ఎత్తున స్వాగతం పలుకుతూ హోర్డింగులు ఏర్పాటు చేశారు.
తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు బేగంపేట వద్ద ‘నేటి తెలంగాణ విజయాలే.. రేపటి కేసీఆర్ జాతీయాలకు పునాది’ అంటూ భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు.
ఇక రేపు ఉదయం తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. అనంతరం జాతీయ పార్టీని మధ్యాహ్నం 1 గంట తర్వాత ముహూర్తం అనుసరించి ప్రకటిస్తారు. జెండా, అజెండా ప్రకటిస్తారు. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ కీలక నేతలు హైదరాబాద్ తరలివస్తున్నారు. అందుకే ఆ హైప్ ను కంటిన్యూ చేసేందుకు టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ లో ఫ్లెక్సీలతో హోరెత్తిస్తున్నారు.
మరోవైపు హైదరాబాద్ లో ఇలా ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్ ల ఏర్పాటు చేయడంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.