రెవిన్యూ చట్టంలో మార్పులపై అసెంబ్లీ లో కెసిఆర్ మాట్లాడిన తీరు , సబ్జెక్ పై అవగాహన చూసిన తర్వాత కెసిఆర్ కి ఆ సబ్జెక్ పై ఎంత పట్టు వుందో అర్ధమవుతుంది. ప్రతివాళ్ళు రెవిన్యూ లో అవినీతి గురించి మాట్లాడేవాళ్ళే గానీ అది ఎలా నిర్మూలించాలో చెప్పటం లో తడబడుతూనే వున్నారు. ఇది ఒక్క రోజులోనో , కొంతమందిమీద దాడి చేస్తేనో పోయే సమస్య కాదు. తర తరాలుగా పేరుకుపోయిన వట వృక్షాన్ని కూల్చటం అంత తేలిక కాదు. ఎన్ టి ఆర్ పటేల్, పట్వారి పదవులను రద్దు చేసినప్పుడు కూడా అందరూ ఎంతో హర్షించారు. ఇంతటితో ఈ శని విరగడై పోయిందని సంబరాలు చేసుకున్నారు. కానీ ఏమయింది? అది ఇంకో రూపంలో ప్రజల్ని పట్టి పీడించింది. దాని స్థానం లో తీసుకొచ్చిన వి ఆర్ ఓ వ్యవస్థ దానికేమీ తీసిపోలేదు. ప్రజలు దాన్ని కూడా అసహ్యించుకున్నారు. చంద్రబాబు నాయుడు అసలు రెవిన్యూ వ్యవస్థనే రద్దు చేసి మండల ప్రజా పరిషత్తు ఆధ్వర్యం లోకి తీసుకొచ్చాడు. అదీ సరిగ్గా పనిచేయలేదు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం అంత సులువు కాదు. ఎందుకంటే భూమి అనేది ప్రతి ఒక్కరికి ప్రీతి పాత్రమైన సంపద. దాన్ని నమ్ముకునే ఎంతోమంది జీవితాలు ముడిపడి వున్నాయని అందరికీ తెలిసిందే. ఇది తెలంగాణా లోనే కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ జటిల సమస్యగానే వుంది. అవినీతి లో సింహభాగం ఇక్కడే మొదలవుతుంది.
Also Read : మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా సోకిందా?
రెవిన్యూ చట్టం లో మార్పుల్ని ఎలా చూడాలి?
అంతకుముందు పాలకులు లాగానే కెసిఆర్ కూడా ఈ వ్యవస్థని మార్చటానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. అయితే తన హయాం వచ్చేసరికి సాంకేతికత పూర్తి స్థాయి లో అందుబాటు లోకి వచ్చింది. దాన్ని కనుక పూర్తిగా ఉపయోగించుకొని మార్పులు తీసుకొస్తే చాలావరకు వ్యవస్థలో మార్పు వచ్చే అవకాశముంది. ఇదే కెసిఆర్ ప్రయత్నం. కాకపోతే ఈ ప్రక్రియ లో ఎంతవరకు విజయవంతమవుతారనేది వేచి చూడాలి. ముఖ్యంగా ఈ ఆన్ లైన్ ప్రక్రియలో జరిగే తప్పుల్ని నివారించ గలగాలి. ఇంతకుముందు జరిగిన ఆన్ లైన్ ప్రక్రియ లో అనేక తప్పులు దొర్లాయి. పేర్లు సరిగ్గా ఎక్కించక పోవటం తో అన్నీ తప్పుల తడకలే. వాటిని కంప్యూటర్ లో ఎక్కించే వాడు, వాటిని సరిచూసేవాడు సరిగ్గా పనిచేయకపోతే వచ్చే సమస్యలే ఇవి. కాబట్టి ఆలోచనలు బాగానే వున్నా అమలు లో ఎలా వుంటుందనేదే సమస్యల్లా. ఇప్పటికే ఆన్ లైన్ లో వున్న సమాచారాన్ని యధాతధంగా ధరణి పోర్టల్ కి దిగుమతి చేసుకునే బదులు వాటిలోని తప్పులను సరిదిద్ది బదిలీ చేస్తే బాగుంటుంది.
ఇక మార్పుల విషయానికొస్తే ఇవి స్థూలంగా ప్రజలకు మేలుచేసే దిశలోనే వున్నాయని చెప్పొచ్చు. వ్యవస్థీకృత రక్షణలు వుండటం వలన అధికారుల ప్రమేయం, జోక్యం తక్కువగా వుంటుంది. ఇది ఈ మార్పుల్లో ప్రధానాంశం. ఇది మంచి చర్యే. ఒకసారి రికార్డు ల్లోకి ఎక్కించిన తర్వాత మార్చటం కష్టమైనప్పుడు ఆ మేరకు ప్రజలకు ఉపశమనం జరిగినట్లే కదా. రిజిస్ట్రేషన్ , మ్యుటేషన్ ఒకేసారి జరగటం అవన్నీ పారదర్శకంగా ప్రజలకు అందుబాటులోకి రావటం ఆహ్వానించదగ్గ పరిణామం. అలాగే వారసత్వ హక్కులు కుటుంబానికే ఇవ్వటం కూడా విప్లవాత్మక చర్యనే. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇది నిర్ణయించుకోవటం, దాన్ని ఆమోదించటం ప్రజలకు ఎంతో ఉపశమనం కల్గించే అంశం. పబ్లిక్ స్థలాలన్నీ ఆటో లాక్ స్థితి లో వుండటం కూడా మంచి నిర్ణయమే. వీటితో పాటు తిరిగి సమగ్ర భూ సర్వే కి నిర్ణయించటం ముదావహం. ప్రస్తుతం సాంకేతికత అభివృద్ధి చెందిన దశ లో ఈ సర్వే నిజంగానే సమగ్రంగా వుండే అవకాశముంది. ఒకసారి ఇది పూర్తయితే తెలంగాణా లో భూ సమస్య కి సంబంధించి సమస్యలు ఒక కొలిక్కి వచ్చినట్లే. ముందుగా కెసిఆర్ మొదలు పెట్టిన ఈ భగీరధ ప్రయత్నాన్ని ఆహ్వానిద్దాం.
అలాగే విఆర్వో వ్యవస్థని రద్దుచేయటం పై కూడా రక రకాల వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. పటేల్, పట్వారి వ్యవస్థలు వారసత్వం తో వస్తే విఆర్ వో , వి ఆర్ ఏ లు మనం నియమించుకున్నవే. వీటిపై ప్రజలకు సదభిప్రాయం లేనప్పుడు వాటిని తొలగించటం మంచిదే. ఒకసారి అనుకున్నట్లు మొత్తం రికార్డు అయితే నిజంగానే వీళ్ళ అవసరం లేదు. రెండోది ఇది వ్యవస్థలో మూలం కాదు. పై పార్శ్వం మాత్రమే. దీన్ని రద్దుచేయటం ప్రజల మనోభావాల్ని గౌరవించినట్లే.
Also Read : మళ్లీ రవి ప్రకాష్ చేతికి టీవీ 9..?
‘దొరగారి’ ఆలోచనలు ఎప్పుడూ విన్నూత్నమే
కెసిఆర్ గురించి ఇదివరకు ఎన్నోసార్లు విశ్లేషించటం జరిగింది. తను సమస్యను అర్ధం చేసుకోవటం లో లోతుగా, విన్నూత్నంగా ఉంటాయనేది ఇంతకుముందే చెప్పుకున్నాం. అయితే సమస్యల్లా దొర గారి ఆలోచనల్లో ఒక్కోసారి తను అనుకున్నదే జరగాలి అనే ఫ్యూడల్ సంప్రదాయం ఉండటంతో సమస్యల్ని కొని తెచ్చు కుంటాడు. అలాగే పాత దొరల్లాగా తనని వ్యతిరేకించిన వాళ్ళను చీల్చి చెండాడి , కక్ష పెట్టుకోవటం తెలిసిందే. ఇవి లేకపోయినట్లయితే తను ఇంకా రాజనీతిజ్ఞుడు అయి వుండే వాడు. రాజకీయ ఎత్తుగడల్లో తనని మించిన వాళ్ళు లేరు. అందువలనే తెలంగాణా ఉద్యమంలో ఎక్కడ తగ్గాలో తెలిసి సోనియా గాంధీ ని బుట్టలో వేసుకోగలిగాడు. తిరిగి అదే నోటితో అంత తీవ్రంగా విమర్శించనూ గలిగాడు. ఇదే తన ప్రత్యేకత.
ప్రస్తుత రెవిన్యూ చట్టం విషయాన్నే తీసుకుందాం. సమస్య పై సమగ్ర అవగాహన కలిగి అసెంబ్లీ లో జరిగిన చర్చకు జవాబు ఇచ్చినప్పుడు తన పరిణతి బయట పడింది. చర్చలో మాట్లాడిన వాళ్ళలో మల్లు భట్టి విక్రమార్క మాత్రమే సబ్జెక్ ని స్టడీ చేసి మాట్లాడాడు. చాలా అవగాహనతో గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితుల్ని పూసగుచ్చినట్లు వివరించగలిగాడు. అందుకు భట్టి అభినందనీయుడు. అంతే సబ్జెక్ పై అథారిటీ తో కెసిఆర్ సమాధానం కూడా ఇవ్వ గలిగాడు. చాలామంది ముఖ్యమంత్రులు అధికారుల ఫీడ్ బాక్ పై ఆధారపడి జవాబులిస్తారు. కానీ కెసిఆర్ తనే స్వయంగా అథారిటీ తో జవాబులు ఇచ్చినట్లు చర్చ చూసిన వాళ్లకు అర్ధమవుతుంది. అందుకే ఇప్పట్లో కెసిఆర్ కి ఎదురు లేదని చెప్పొచ్చు. ఒక్క రాజకీయ చాణక్యం లోనే కాదు తెలంగాణా సమాజ సమస్యల పై పూర్తి అవగాహన వున్న వ్యక్తి కెసిఆర్. ఈ రెండూ సమాన స్థాయిలో కలిగి వుండటం వలనే తనకు ఇప్పట్లో తిరుగులేదనిపిస్తుంది. అదే సమయం లో కొన్ని సమస్యల పై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పటం లోనూ తనకు తనే సాటి. భట్టి లేవనెత్తిన కౌలుదారుల హక్కులపై తన అభిప్రాయాన్ని దాచుకోకుండా చెప్పాడు. తను ముఖ్యమంత్రి గా వున్నంతకాలం అసలు కౌలుదారుల్ని అనుభవదారుడిగా గుర్తించటం జరగదని ఖరాఖండిగా చెప్పాడు. ఒకనాటిలాగా ఈరోజు జమీందారులు, దేశముఖులు, భూస్వాములు లేరని 93 శాతం చిన్న, సన్నకారు రైతులని అటువంటప్పుడు కౌలు దారుల హక్కుల పేరుతో ఆగమాగమం చేయటం తగదని చెప్పాడు. పట్టణాల్లో ఇల్లు అద్దెకిస్తే ఎలాగో ఇదీ అలాగేనని ఎవరు ఎక్కువ కౌలు కిస్తే వాళ్ళకు రైతు ప్రతి సంవత్సరం కౌలుకిచ్చుకోవచ్చని అందుకే నేనున్నంత కాలం ఈ కౌలు దారి వ్యవస్థను గుర్తించనని ప్రకటించాడు. నిజానికి ఏ రాజకీయ నాయకుడు ఇటువంటి ప్రకటన ఇవ్వడు. ఒకవేళ మనసులో వున్నా బయటకి చెప్పారు. అదే కెసిఆర్ ప్రత్యేకత. తను నమ్మినదాన్ని చెప్పటం లో ఎప్పుడూ వెనకాడడు.
కెసిఆర్ కి ఇప్పట్లో ఎదురులేదు
ఈ మాట చెప్పటానికి కూడా సాహసం కావాలేమో. ఎందుకంటే ఒక విధంగా ఆ మాట అంటే మీడియా సర్కిళ్లలో ప్రభుత్వ గులాం గా చూసే అవకాశముంది. కానీ నా అంచనా అలా వున్నప్పుడు మనసులోని మాట చెప్పటానికి వెనకాడకూడదు కదా. కెసిఆర్ కుటుంబ పాలనను ప్రోత్సహించవచ్చు, ముస్లిం వోట్ల ని దృష్టిలో వుంచుకొని ఒవైసీ మాటకు విలువివ్వొచ్చు, దొరతనం తన మాటల్లో అడుగడుగునా ప్రతిబంబించ వచ్చు, కరోనా మహమ్మారిని నిలవరించటం లో నిజాయితీగా వ్యవహరించి ఉండకపోవచ్చు ( మరణాలను రికార్డు చేయకపోవటం లాంటివి ), రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టి ఉండొచ్చు కానీ ప్రత్యామ్నాయంగా తనని ఎదుర్కొనే ధీటయిన వ్యక్తి తారసపడనంతవరకూ తనకు ఎదురులేదనే అనిపిస్తుంది. నీళ్ళ విషయం లో తను చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే పైన చెప్పిన బలహీనతలు ఎన్ని వున్నా ప్రజలు తనకి బ్రహ్మ రధం పడతారు. కాంగ్రెస్ ముఠా కుమ్ములాటల్లో సతమత మవుతుంది, బిజెపి ఇంకా దక్షిణ తెలంగాణా లో బలపడాల్సి వుంది. బండి సంజయ్ దూకుడుగా వెళ్ళినా తను కెసిఆర్ కి ధీటయిన వ్యక్తని ప్రజల్లో ఇంకా ముద్ర పడలేదు. కాబట్టి ప్రస్తుతానికి కెసిఆర్ కి ఎదురులేదనిపిస్తుంది.
Also Read : విపక్షాల గొంతు కేసీఆర్ నొక్కేస్తున్నారా? సీతక్క ఆవేదన ఇదీ..