Teenmaar Mallanna : తీన్మార్‌ మల్లన్నను వేటాడుతున్న కేసీఆర్‌–కేటీఆర్‌.. మళ్లీ దాడి వెనుక కథేంటి? 

Teenmaar Mallanna :  తెలంగాణలో అధికార పార్టీ దౌర్జన్యాలు పారాకష్టకు చేరుతున్నాయి. ఎన్నికలకు మరో 10 నెలల సమయమే ఉండడంతో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ తన పాలనపై వ్యతిరేక వార్తలను సహించలేకపోతోంది. నిలదీస్తున్నవారిపై సామ, దాన, బేధ దండోపాయాలు సంధిస్తోంది. ఇక మీడియాను తన గడీలో బంధీ చేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే మెయిన్‌ స్ట్రీం మీడియాను ఇప్పటికే తన గుప్పిట పెట్టుకున్న అధికార బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు సోషల్‌ మీడియాపై పడింది. ఈ క్రమంలోనే ‘వెలుగు’ను బహిష్కరించింది. […]

Written By: Raj Shekar, Updated On : March 20, 2023 10:50 am
Follow us on

Teenmaar Mallanna :  తెలంగాణలో అధికార పార్టీ దౌర్జన్యాలు పారాకష్టకు చేరుతున్నాయి. ఎన్నికలకు మరో 10 నెలల సమయమే ఉండడంతో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ తన పాలనపై వ్యతిరేక వార్తలను సహించలేకపోతోంది. నిలదీస్తున్నవారిపై సామ, దాన, బేధ దండోపాయాలు సంధిస్తోంది. ఇక మీడియాను తన గడీలో బంధీ చేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే మెయిన్‌ స్ట్రీం మీడియాను ఇప్పటికే తన గుప్పిట పెట్టుకున్న అధికార బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు సోషల్‌ మీడియాపై పడింది. ఈ క్రమంలోనే ‘వెలుగు’ను బహిష్కరించింది. ఈమేరకు బీఆర్‌ఎస్‌ కార్యాలయం నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ‘తొలి వెలుగు’ను కొనేసింది. ఇక మిగిలిన మరో స్ట్రాంగ్‌ సోషల్‌ మీడియా తీన్‌మార్‌ మల్లన్న ‘క్యూ న్యూస్‌’ ఇప్పటికే తీన్‌మార్‌ మల్లన్నను కొనేందుకు అధికార పార్టీ అనేక ప్రయత్నాలు చేసింది. అవి విఫలం కావడంతో దాడులకు తెగబడింది. ఆదివారం జరిగిన దాడి మొదటిదేం కాదు.. చివరిది కూడా కాకపోవచ్చు. గతంలో మూడుసార్లు దాడులు జరిగాయి. తీన్‌మార్‌ మల్లన్నను సుమారు ఆరు నెలలు జైల్లో కూడా పెట్టించింది. బీఆర్‌ఎస్‌ సర్కార్‌. తాజాగా గురువారం మంత్రి మల్లన్న అనుచరులతో దాడిచేయించింది.

20 మంది విధ్వంసం.. 
మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్న తీన్మార్‌ మల్లన్న(చింతపడు నవీన్‌)కు సంబంధించిన క్యూ న్యూస్‌ కార్యాలయంపై ఆదివారం మధ్యాహ్నం దాదాపు 20 మందికిపైగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నేరుగా కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగులు ఫర్నీచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఆ తర్వాత అక్కడ్నుంచి నిందితులు పరారయ్యారు. ఆ సమయంలో మల్లన్న కార్యాలయంలో లేరు. దాడి అనంతరం కార్యాలయ సిబ్బంది, మల్లన్న అనుచరులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.

మంత్రులు, కవిత అనుచరులే..
తన కార్యాలయంపై దాడిచేసింది మంత్రులు మల్లారెడ్డి, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత అనుచరులే తమపై దాడికి పాల్పడ్డారని మల్లన్న టీం ఆరోపించింది. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. తాను బయటకు వెళ్లిన సమయంలో వచ్చి తన కార్యాలయంపై దాడి చేశారని మల్లన్న తెలిపారు. బీఆర్‌ఎస్‌ గూండాలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. నంబర్‌ ప్లేట్‌ లేని మూడు కార్లలో వచ్చి దాడి చేశారని ఆయన చెప్పారు.
పోలీసులకు తెలిసే దాడి జరిగిందని, ఇందులో పోలీసుల పాత్ర కూడా ఉందని తీన్మార్‌ మల్లన్న ఆరోపించారు. గతంలో జరిగిన దాడికి సంబంధించి ఇప్పటికీ ఒక్కర్ని కూడా పోలీసులు పట్టుకోలేదని తీన్మార్‌ మల్లన్న తెలిపారు.

నాలుగోసారి దాడి.. 
తీన్‌మార్‌ మల్లన్న క్యూ న్యూస్‌ చానెల్‌పై దాడి ఇది నాలుగోసారి. గతంలో మూడుసార్లు అధికార పార్టీ నాయకులే దాడిచేశారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం కేసులు నమోదు చేయడం లేదు. తాజాగా కూడా మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఒక్కరిని కూడా పోలీసులు పట్టుకోలేదు. మరోవైపు మల్లన్న తన కార్యాలయంపై దాడిచేసిన వ్యక్తి ఫొటో కూడా విడుదల చేశాడు. మంత్రి మల్లన్న, కేటీఆర్, కేసీఆర్, కవితతో దిగిన ఫొటోలు ఉన్నాయి.

అధికార పార్టీకి మింగుడు పడని వాస్తవం.. 
వాస్తవాన్ని తెలుసుకునే ఓపిక అధికార పార్టీలో నశిస్తోంది. తొమ్మిదేళ్ల పాలనపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. మరోవైపు ప్రజావ్యతిరేక విధానాలు పెరుగుతున్నాయి. గులాబీ బాస్‌ కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లో అసహనం పెరుగుతోంది. ప్రజా వ్యతిరేక విధానాలను మెయిన్‌స్ట్రీం మీడియా రాయడానికి సాహసించడం లేదు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలను కొన్ని యూ ట్యూబ్‌ చానెళ్లు ఎండగడుతున్నాయి. అవి బలంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. మెయిన్‌ స్ట్రీం మీడియాకు ఏమాత్రం తీసిపోకుండా ఆధారాలతో సోషల్‌ మీడియాలో పాలకుల దౌర్జన్యాలను, లోపాలను, అక్రమాలను, దోపిడీని ఎండగడుతున్నారు. ఇదే అధికార బీఆర్‌ఎస్‌కు మింగుడు పడడం లేదు. ఎన్నికల వేల ప్రజా వ్యతిరేక విధానాలు బలంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. ప్రజల్లో పాలకులపై వ్యతిరేకత పెంచుతున్నాయి. దీనిని గ్రహించి వాస్తవాలు వెలుగులోకి రాకుండా చేయాలని పాలకులు ఆలోచిస్తున్నారు. కానీ, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు చేయాల్సింది. ఇది కాదు, వాస్తవ పరిస్థితి తెలుసుకుని తప్పులు సరిదిద్దుకోవాలి. కానీ, తప్పులు, వెలుగులోకి రాకుండా మరిన్ని తప్పులు చేయడం, మీడియా గొంతు నొక్కాలని చూడడమే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ధోరణి అధికార పార్టీకి ఇబ్బందే అంటున్నారు జర్నలిస్టులు. మీడియాను గుప్పిట పెట్టుకోవాలనే ఆలోచనే సరికాదని పేర్కొంటున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు.. ఎన్నికల ఏడాది బీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీపై ప్రజల్లో మరింత వ్యతిరేకత పెంచుతుందని సీనియర్‌ జర్నలిస్టులు పేర్కొంటున్నారు.