MLC Kavitha- KCR: ఢిల్లీ లిక్కర్ స్కార్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. తెలంగాణ ముఖ్యమంత్రి గారాల తనయ, ఎమ్మెల్సీ కవిత ఈ స్కాంలో సౌత్ లాబీలో కీలకంగా వ్యవహరించారని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. దీనికి సంబంధించిన ఆధారాలు దొరకకుండా పది సెల్‌ఫోన్లు, రెండు సిమ్ కార్డులు ధ్వంసం చేసిందని ఆధారాలతో సహా కోర్టుకు విన్నవించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ కూడా కవితకు సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అయితే మొదట విచారణకు వస్తానని చెప్పిన కవిత.. కేసీఆర్‌ను కలిసిన తర్వాత వ్యూహం మార్చారు.

-ఎస్కేప్‌కు ఎత్తుగడ..
సీబీఐ నోటీసులు అందుకున్న మరుసటి రోజు కవిత తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో సుదీర్ఘంగా, రహస్యంగా మంతనాలు జరిపారు. ఈ భేటీలో హైకోర్టు, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు పాల్గొన్నట్లు సమాచారం. కేసీఆర్‌తో భేటీ తర్వాత కవిత సీబీఐ ఎదుట హాజరు నుంచి తప్పించుకునేందుకు ఎత్తుగడ వేశారు. తండ్రి సూచన మేరకు తనకు ఫిర్యాదు కాపీ, ఎఫ్‌ఐఆర్ కావాలని సీబీఐకి లేఖ రాశారు. అవి ఇచ్చిన తర్వాతే హాజరవుతానని పేర్కొన్నారు. నిజానికి ఈడీ అధికారికంగానే ఒకరి రిమాండ్ రిపోర్టులో ఆమె పేరును ప్రస్తావించింది. సీబీఐ ఫలానా కేసుకు సంబంధించి మీ దగ్గర చాలా సమాచారం ఉన్నట్టుంది, ఓసారి ప్రశ్నించాలి అనడిగింది. ఆమెను నిందితురాలిగా చూపించ లేదు.
-ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేదంటూ మరో లేఖ..
తాజాగా ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదని, సీబీఐ ఎదుట విచారణకు ఎందుకు రావాలని కవిత సోమవారం సీబీఐకి మరో లేఖ రాశారు. న్యాయ నిపుణుల సూచన మేరకే ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా తనకు బిజీ షెడ్యూల్ ఉన్నందున మంగళవారం విచారణకు రావడం లేదని, ఈనెల 11, 12, 13, 14 తేదీల్లో ఏదైనా ఒక రోజు వస్తానని తెలిపారు. తేదీ ఖరారు చేయాలని సూచించారు. తద్వారా ఈడీ, సీబీఐలతో ఈ కాలయాపన, దోబూచులాట చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈడీ, సీబీఐ సీరియస్‌గా ఉన్నాయనేది నిజం. వెనుక కేంద్రం కూడా సీరియస్ అనేదీ నిజం.. గతం ఏమిటో గానీ ఎమ్మెల్యేల కొనుగోలు వీడియోలతో బీజేపీకి బాగా కాలుతోందనేదీ నిజం. ఈ క్రమంలో ఎఫ్‌ఐఆర్‌లో నా పేరు లేదు అని లేఖ రాయడం అంటే ఎఫ్‌ఐఆర్‌లో ముందుగా పేరు పెట్టి, తరువాత రండి అని చెప్పినట్టుంది కవిత తీరు. పైగా 6వ తేదీన రానని పేర్కొనడం అనుమానాలకు తావిస్తోంది.

-కేంద్రంతో రహస్య చర్చలు..
ఎఫ్‌ఐఆర్‌లో పేరున్నా లేకపోయినా సీబీఐ అడిగితే కేసు దర్యాప్తుకు సహకరించాల్సిందే. అందుకే స్కాం కేసుల్లో వీలైనంత మౌనంగా, తగ్గి ఉండటం మంచిదని అంటుంటారు న్యాయనిపుణులు. ఇది రాజకీయ ప్రేరితమైన కేసు, ఎదురుదాడే శరణ్యం అనుకునే పక్షంలో పదాల్ని, అడుగుల్ని ఆచితూచి వేయడం కరెక్టు. 6వ తేదీన ఉండను, వీలుకాదు అని చెబితే సరిపోయేది. మళ్లీ ఆల్టర్నేట్ తేదీలు తనే చెప్పడం దేనికి..? మరో రోజున మీకు అందుబాటులో ఉండటానికి ప్రయత్నిస్తాను అంటే సరిపోయేది. కానీ.. కవితే తేదీలు ఖరారు చేశారు. అంటే ఆలోగా సీబీఐ నోటీసులు ఉపసంహరించుకుంటుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఈమేరకు కేసీఆర్ తన దూతల ద్వారా కేంద్రంలోని పెద్దలతో రాయబేరం నడుపుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూతురును బయట పడేసేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నందునే కవిత తండ్రిపై ధీమాతో సీబీఐతో ఇలాంటి పద ప్రయోగం చేస్తుందేమో.. అన్న సందేహాలు కలుగుతున్నాయి.