KCR On AP: ఏపీ సీఎం జగన్ కు రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ మరోసారి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.జగన్ ను గట్టెక్కించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. జగన్ వైఖరితో ఏపీలో కాపులు దూరమైన సంగతి తెలిసిందే. వారంతా జనసేన వైపు టర్న్ అయ్యారు. టీడీపీ, జనసేన కూటమి కట్టే క్రమంలో కాపులంతా ఏకపక్షంగా సపోర్టు చేస్తే భారీ విజయం దక్కే అవకాశముంది. దానిని ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని కేసీఆర్ చూస్తున్నారు. అందుకే కాపు సామాజికవర్గానికి చెందిన ప్రముఖులను ప్రగతిభవన్ కు పిలిచారు. విందు సమావేశం ఏర్పాటుచేసి ఏకంగా మూడు గంటల పాటు చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కేసీఆర్ అపాయింట్ మెంట్ లభించడమే కష్టం. అటువంటిది తానే కాపు ప్రముఖులను పిలిపించుకొని మరీ వారికి విలువైన సమయాన్ని కేటాయించారు. మేఘాలయ రిటైర్డ్ సీఎస్ కుమార్ ఆధ్వర్యంలో నాలుగు రాష్ట్రాలకు చెందిన కాపు ప్రముఖుల సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. దీని వెనుక బీజేపీ ఉందని గ్రహించిన కేసీఆర్ కొందమంతి కాపు ప్రముఖులను ప్రగతి భవన్ కు ఆహ్వానించినట్టు తెలిసింది. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహనరావు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారులు పీవీరావు, రంగంశెట్టి మంగబాబు, లక్ష్మీకాంతంతో పాటు మరో 25 మంది వరకూ ప్రముఖులు హాజరైనట్టు తెలిసింది.
ముందుగా తెలంగాణలో కాపులు బీఆర్ఎస్ కు దూరమైన విషయాన్ని ప్రస్తావించారు. ఎలా టర్న్ అవుతారన్నదానిపై చర్చించారు. వారి మద్దతు ఎలా సంపాదించాలో వారందరి సలహాలు తీసుకున్నారు. జంట నగరాల్లో కాపు, మున్నూరుకాపు, తెలగ, బలిజల కోసం ఒక భవనం ఏర్పాటుచేయాలని.. రూ.10 కోట్ల నిధులు ఇవ్వాలని వారు అడిగినట్టు తెలుస్తోంది. తెలంగాణలోని 25 లక్షల మంది మున్నూరు కాపుల ఓట్లు గుంపగుత్తిగా బీఆర్ఎస్ కు పడేలా చేస్తే అడిగినవన్నీ చేస్తానని కేసీఆర్ వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నందుున మీ వంతు ప్రయత్నాలు ప్రారంభించాలని కేసీఆర్ వారికి సూచించినట్టు సమాచారం.
పనిలో పనిగా ఏపీలో జగన్ కు మద్దతుగా కాపు ప్రముఖులకు కీలక బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాపుల్లో చీలిక తేవాలని పురమాయించినట్టు సమాచారం. ఏపీలో జనసేన వెంట కాపులు బలంగా నడుస్తున్నారని.. జనసేన గ్రాఫ్ గణనీయంగా పెరిగిందని… పవన్ ను సీఎం అభ్యర్థిగా ఫోకస్ అయితే బాగుంటుందని.. ఈ లెక్క చెప్పే ఒంటరిగా పోటీచేసేందుకు ఒప్పించాలని కోరినట్టు సమాచారం. అది కుదరకపోతే కాపుల్లో చీలిక వచ్చే ప్రయత్నాలు చేయాలని పురమాయించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మాజీ అధికారుల ప్రభావం ఏపీలో అంతంతమాత్రమే. అటువంటి వారిని పట్టుకొని కేసీఆర్ జగన్ కు గట్టెక్కించాలని చూడడం వృథా ప్రయాసేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.