CM KCR On AP BRS: తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రా ప్రాంతాన్ని, ఆంధ్రా ప్రజలను తిట్టిన తిట్టు తిట్టకుండా ఉన్న కేసీఆర్… ఇప్పుడు ఆ ప్రాంత జపం చేస్తున్నారు.. సంక్రాంతిని పెద్ద పండుగగా అభివర్ణించారు.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన తోట చంద్రశేఖర్ ను ఆ ప్రాంతానికి అధ్యక్షుడిని చేశారు. అంతేకాదు మొన్న జరిగిన కార్యక్రమంలో జై భారత్, జై భారత రాష్ట్ర సమితి నినాదాలు మాత్రమే పరిమితమయ్యారు.

టార్గెట్ ఆ పార్టీనే
భారతీయ జనతా పార్టీకి, భారత రాష్ట్ర సమితికి ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది.. మొన్న జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా కెసిఆర్ కు మరింత శక్తి వచ్చింది. ఈ దశలో మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్ అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ… తగ్గేదే లేదు అన్నట్టుగా ముందుకు వెళ్తున్నారు.. ఇక తెలంగాణ కంటే ఆంధ్రాలో భారతీయ జనతా పార్టీకి జనసేన తోడ్పాటు అవసరం.. అక్కడ బలం పెంచుకోవాలంటే పవన్ సహకారం అవసరం. అందు గురించే ఆయనను భారతీయ జనతా పార్టీ చేరదీస్తోంది.. అంతేకాదు పొత్తు కూడా పెట్టుకుంది. ఒకవేళ పవన్ చరిష్మాతో అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవు.. అందుకే ఈసారి అటు భారతీయ జనతా పార్టీని, ఇటు పవన్ కళ్యాణ్ ను దెబ్బ కొట్టాలని కెసిఆర్ ఆంధ్రా ప్రాంతంలో అడుగు పెట్టారు. అంతేకాదు పవన్ కుడి భుజమైన తోట చంద్రశేఖర్ ను భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడి ని చేశారు.
టిడిపి నీ దెబ్బ కొట్టాలని
కెసిఆర్ భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన నేపథ్యంలో చంద్రబాబు తెలంగాణ ప్రాంతంపై ఫోకస్ పెట్టారు. గతంలో ఓటుకు నోటు కేసు ద్వారా కేసీఆర్ చేతిలో అవమానానికి గురయిన చంద్రబాబు.. మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టలేదు. మరోవైపు 2018 ఎన్నికల్లో చంద్రబాబు బూచిని చూపి సెంటిమెంట్ రగిల్చి కెసిఆర్ గెలిచారు.. ఈసారి ఆ అవకాశం లేకపోవడంతో ఎలాగైనా తెలంగాణలో టిడిపిని బలోపేతం కాకుండా చూసేందుకు ఆంధ్రాలో భారత రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. అంతేకాదు చంద్రబాబు ఆంధ్రాకే పరిమితమయ్యేలా అనేక ఎత్తులు వేస్తున్నారు. దీంతో తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. అయితే ఇటీవల ఖమ్మంలో చంద్రబాబు నిర్వహించిన సభకు జనం భారీగా హాజరయ్యారు.. కానీ ఆయన ఎక్కడా కూడా ఎవరినీ విమర్శించలేదు. కేవలం తాను చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడం వరకే పరిమితమయ్యారు. దీంతో భారత రాష్ట్ర సమితి నాయకులకు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది.. అయినప్పటికీ పువ్వాడ అజయ్ కుమార్ లాంటివారు చంద్రబాబు సభ నిర్వహించిన మరుసటి రోజే హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబుపై ధ్వజమెత్తారు.. కానీ అనుకున్నంత ఫాయిదా దక్కకపోవడంతో కెసిఆర్ ఆంధ్రా ప్రాంతంలో పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి… ఆ తంతు పూర్తి చేశారు.

వైసీపీకి లాభం కలిగించే చర్యలు
ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఎదురీదుతోంది. అక్కడ బిజెపి, టిడిపి, జనసేన కూటమి కలిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.. ఒకవేళ ఇదే జరిగితే అధికారం జగన్ చేతిలో నుంచి వెళ్లిపోవడం ఖాయం.. ఇది జరిగితే కేసీఆర్ కు చాలా నష్టం.. పైగా పెట్టుబడులు ఆంధ్రా ప్రాంతానికి తరలిపోతాయి. ఈ నేపథ్యంలో ఇది జరగకుండా ఉండాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి.. అందుకు బలమైన సామాజిక వర్గం అండ కావాలి.. అందుకే చంద్రశేఖర రావు ఏపీలో భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేశారు.. దానికి అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించారు. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది.. కాపు సామాజిక వర్గం చీలికలు పీలికలు అవుతుందని కెసిఆర్ అంచనా.. జరిగితే జగన్ సర్కారు మళ్ళీ అధికారంలోకి వస్తుంది.. అప్పుడు కెసిఆర్ అనుకున్నవన్నీ చేసేయవచ్చు.. తెరపైకి కెసిఆర్ ప్రణాళికలు ఇలా కనిపిస్తున్నాయి..కానీ వీటన్నింటినీ ఓటరు జాగ్రత్తగా గమనిస్తున్నాడు..