Homeజాతీయ వార్తలుTelangana Farmers: రైతులను గాలికి వదిలేసిన కేసీఆర్

Telangana Farmers: రైతులను గాలికి వదిలేసిన కేసీఆర్

Telangana Farmers: జూలై నెల సగం ముగిసింది. వానా కాలం ప్రారంభమై దాదాపు నెల దాటింది. బలమైన కార్తెలు కూడా వెళ్ళిపోతున్నాయి. కానీ ఇంతవరకు అనువైన వర్షాలు కురవలేదు. దేశానికి అన్నం పెడుతున్నామని చెబుతున్న రాష్ట్రంలో సగం విస్తీర్ణంలో కూడా పంటలు సాగు కాలేదు.. సాగు చేసిన పంటలు ఎండల ధాటికి మాడిపోతున్నాయి. మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో వల్ల ఈసారి కరువు తప్పదని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రభుత్వం రైతులకు చేయూతనివ్వాలి. వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో దానికి అనువైన పంటలు సాగు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలి. మరి ప్రస్తుతం తెలంగాణలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయంటే లేవనే చెప్పాలి.

చిత్తశుద్ధి ఏది

2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రైతు జపం చేస్తున్న ప్రభుత్వం.. రైతుబంధు, రైతు బీమా మినహా.. సంబంధించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న పాపాన పోలేదు. రైతుబంధు పేరుతో అనేక రాయితీ పథకాలకు ప్రభుత్వం మంగళం పాడింది. చివరికి మద్దతు ధర విషయంలోనూ రైతులను మోసం చేసింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా రాజకీయం చేసింది. మిల్లర్లతో ముందే మూలాఖత్ అయి రైతులను నిలువు దోపిడీ చేసింది. అంతటి కోవిడ్ కాలంలో రైతుల పండించిన యాసంగి ధాన్యంలో తేమ, తాలు పేరుతో అడ్డగోలుగా తరుగు విధించింది. వందల కోట్లు మిల్లర్లు వెనకేసుకుంటే చోద్యం చూసింది. గత ఏడాది వరి సాగు చేయ వద్దంటూ రైతులకు ఆదేశాలు జారీ చేసింది. విత్తన ధాన్యం సంచులను విక్రయించకుండా కంపెనీల ప్రతినిధులను ముప్పు తిప్పలు అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేయాలని, అలా సాగు చేసిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. ఈ ఏడాది యాసంగిలోనూ అడ్డగోలుగా ధాన్యంలో కోతలు విధిస్తున్నప్పటికీ మిల్లర్లకే వంత పాడింది. క్షేత్రస్థాయిలో రైతులను ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తూ కూడా “అబ్ కీ బార్ కిసాన్ సర్కార్” అంటూ శ్రీరంగనీతులు చెబుతోంది.

ప్రణాళిక అంటూ ఉందా

వాస్తవానికి వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్నప్పుడే ప్రభుత్వం ఒక ప్రణాళిక విడుదల చేస్తుంది. ఏఏ ప్రాంతాల్లో ఎలాంటి పంటలు వేయాలో ఒక నిర్ణయానికి వస్తుంది. ఇలా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్లనే పంటల ఉత్పాదకత పెరిగి ధరల స్థిరీకరణ జరుగుతుంది. కానీ ఇదేం పోయే కాలమో.. ఈ వ్యవసాయ సీజన్ కు సంబంధించి ప్రభుత్వం ఇంతవరకు పంటల ప్రణాళిక ఖరారు చేయలేదు. ఎలాంటి పంటలు వేసుకోవాలో చెప్పలేదు. ఏ పంటలకు ధర ఎక్కువగా ఉంటుందో ప్రకటించలేదు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఇంతవరకు చెప్పలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అనేది ఒకటుందా అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తం అవుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కాలానికి అనుగుణంగా కొన్ని పంటలు సాగు చేయాల్సి ఉంటుంది. తీవ్రమైన బెట్టను ఎదుర్కొని పండే పంటలను రైతులు సాగు చేయాల్సి ఉంటుంది.. అయితే ఆ పంటలకు సంబంధించి విత్తనాలు అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. కానీ కందిని విస్తారంగా సాగు చేయాలని ఉచిత సలహా మాత్రం పడేసింది. మరి ఈ కంది విత్తనాలను మాత్రం తెలంగాణ సీడ్స్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచలేకపోయింది.. నామమాత్రంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో మాత్రం జీలుగు, పిల్లి పెసర విత్తనాలు మాత్రం అందుబాటులో ఉంచింది. ఆ విత్తనాలు కొన్ని కొన్నిచోట్ల మొలవకపోవడంతో రైతులు ఆందోళనలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఇంత విపత్కరమైన పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం తమను తాము రైతు ఉద్దారకులుగా చెప్పుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular