Congress : కర్ణాటక కాంగ్రెస్ లో మరో ముసలం పుట్టింది. మొన్నటిదాకా సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ మధ్య జరిగిన వివాదం ముగిసిపోక ముందే.. ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడి అనుచరులు చేసిన పాకిస్తాన్ జిందాబాద్ నినాదాల వ్యవహారం మరో అగ్గి రాజేసింది. దీంతో ఆ పార్టీ నాయకులు పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది.
గత నెల 27న బెంగళూరులోని విధాన సభలో కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బళ్లారి కాంగ్రెస్ అభ్యర్థి నాసిర్ హుస్సేన్ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో పొరుగు దేశమైన పాకిస్తాన్ కు అనుకూలంగా నాసిర్ హుస్సేన్ అనుచరులు నినాదాలు చేశారు. ఈ నినాదాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీనిపై భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయితే ఆ నినాదాలు బిజెపి సోషల్ మీడియా సృష్టి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టి పారేశారు. అయితే ఈ వివాదాన్ని భారతీయ జనతా పార్టీ మరింత రాజేయడంతో ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. దీనిపై ఒక విచారణ కమిటీ వేస్తామని ప్రకటించింది.
ఫోరెన్సిక్ బృందం ఆ వీడియోను పరిశీలించి అది నిజమే అని ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఒకసారిగా డిఫెన్స్ లో పడింది. పాకిస్తాన్ దేశానికి అనుకూల నినాదాలు చేసిన వారిని కర్ణాటక పోలీసులు గుర్తించారు. ఢిల్లీ వాసి ఇల్తాద్, బెంగళూరు ఆర్తి నగరానికి చెందిన మునావర్, బడగి ప్రాంతానికి చెందిన మహమ్మద్ హసీనా పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. వారిని కస్టడీలోకి తీసుకొని రిమాండ్ నిమిత్తం బెంగళూరు కోర్టుకు తరలించారు..
పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ ఉదంతం జరగడంతో కర్ణాటక కాంగ్రెస్ నాయకులు తల దించుకోవాల్సి వచ్చింది. మరోవైపు భారతీయ జనతా పార్టీ నాయకులు దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. ” అప్పట్లో మేం విమర్శలు చేస్తే సోషల్ మీడియా సృష్టి అని ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో ఫోరెన్సిక్ తనిఖీలో వారు చేసిన మాటలు నిజమని తేలింది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలుస్తోందా” అంటూ బిజెపి నాయకులు విమర్శలు చేస్తున్నారు. “పాకిస్తాన్ దేశానికి అనుకూల నినాదాలు చేసినవాళ్లతో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సహవాసం చేస్తున్నాడు. ఇలాంటి వాటితో ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు అంటూ ” నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదంతంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని అక్కడి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.