Karnataka: భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ప్రైవేటు, కార్పొరేట్‌రంగంపైనే ఆధారపడి ఉంది. ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోవడం, ప్రైవేటురంగం వేగంగా విస్తరించడంతో ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంలో కార్పొరేట్ పన్ను శాతమే ఎక్కువ. ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ఉపాధి కల్పన కోసం ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తున్నాయి. కంపెనీలు ఇచ్చే పన్నులతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. మరోవైపు ఎన్నికల్లో ప్రైవేటు సంస్థలు ఇచ్చే విరాళాలపై రాజకీయ పార్టీలు ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేట్ సంస్థల్లో స్థానిక రిజర్వేషన్ల అమలు సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ నుంచి కర్ణాటక వరకు..
ప్రైవేటురంగంలోని పరిశ్రమల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై దాదాపు దశాబ్దాకాలంగా పోరాటాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గుతున్న నేపథ్యంలో స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలన్న నినాదంతో పలు సంస్థలు పోరాటాలు చేశాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇది ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి కలిసి వచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రైవేట్ పరిశ్రమలలో స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. దీనికి మంత్రిమండలి కూడా ఆమోదం తెలిపింది. స్థానికులకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. తర్వాత 2023లో హరియాణా ప్రభుత్వం కూడా ప్రైవేటు పరిశ్రమల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపింది. తర్వాత కోర్టు రద్దు చేసింది. తాజాగా కర్ణాటక కూడా ప్రైవేటు రిజర్వేషన్ల బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో సిద్ధరామయ్య సర్కార్ నిర్ణయం వాయిదా వేసింది.
ఫలితాలు అంతంతే..
గతంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రైవేటులో స్థానికులకే రిజర్వేషన్లు కల్పించే ప్రయోగాలు చేశాయి. కానీ ఆశించిన ఫలితాలు పొందలేకపోయాయి. ప్రైవేట్ రంగంలోని పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఇండస్ట్రియల్/ ఫ్యాక్టరీస్ యాక్ట్ 2019 పేరుతో చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాన్ని హైకోర్టులో సవాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రమే సామరస్యపూర్వక వాతావరణంలో ఎటువంటి ఒతిళ్లు లేకుండా ప్రైవేట్ రంగంలో స్థానిక రిజర్వేషన్లు అమలు చేస్తామంటోంది. తర్వాత పెట్టుబడులను ఆకర్షించడానికి ఎటువంటి ప్రతిబంధకాలుండవని భావిస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలో అమలు చేసిన స్థానిక రిజర్వేషన్లను అక్కడి పరిశ్రమలు పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. ప్రభుత్వాలు ఇస్తానన్న రాయితీలపై కూడా ఆసక్తి చూపలేదు.
లాభార్జనే ముఖ్యం..
ప్రైవేట్ కంపెనీల లక్ష్యం లాభార్జనే. అందుకు కంపెనీలకు సమర్థమైన నైపుణ్యం ఉన్న మానవ వనరులు అవసరం. కంపెనీలు నైపుణ్యం, శిక్షణ ఉన్నవారినే ఎంపిక చేసుకుంటాయి. ప్రభుత్వాలు ఇచ్చే రాయితీల కోసం తమ లాభార్జన లక్ష్యాన్ని పణంగా పెట్టవు. నైపుణ్యం లేని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వవు. ఇది ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిరూపితమైంది. ఉద్యోగుల సామర్థ్యాన్ని సెల్ఫ్ అప్రైజల్, సూపర్వైజరీ నివేదికల ద్వారా కంపెనీలు నిరంతరం పరీక్షిస్తుంటాయి. కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి లేదా ఒక టీం లాభాలకు ఎంత వరకు ఉపయోగపడతారని మాత్రమే యాజమాన్యాలు ఆలోచిస్తాయి. ఈ విషయంలో ఏమాత్రం వెనుకబడినా.. పొపాటు చేసినా.. పనితీరు అంచనాల మేరకు లేకపోయినా నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి తొలగిస్తాయి.
పెట్టుబడులకు విఘాతం..
ఇక ప్రభుత్వాలు స్థానిక రిజర్వేషన్లు అమలు చేయడం వలన పెట్టుబడులపై ప్రభావం ఉంటుందని పారిశ్రామిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీలకు సమర్థులైన, సంబంధిత సాంకేతికతలో అనుభవం, నైపుణ్యం ఉన్న ఉద్యోగులు అవసరమవుతారని, స్థానిక రిజర్వేషన్ కారణంగా అలాంటి అవకాశాలు దూరమవుతాయని పేర్కొంటున్నాయి. తద్వారా ఆర్థికంగా నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో స్థానిక కోటా గురించి ఆలోచించవు. స్థానిక రిజర్వేషన్ల విధానం తమ లక్ష్య సాధనకు, అభివృద్ధికి ఆటంకమని కంపెనీలు భావిస్తాయి. ఈ విధానం అమలు చేసే యంత్రాంగం పని మరింత క్లిష్టతరమవుతుంది. దీంతో పెట్టుబడులు వెనక్కువెళ్లే అవకాశం ఉంటుంది.
ప్రాంతీయ విద్వేషాలు..
స్థానిక రిజర్వేషన్ల కారణంగా ప్రాంతీయ విద్వేషాలు తలెత్తే అవకాశం ఉంది. మహారాష్ట్రలో అమల చేసిన రిజర్వేషన్ల కారణంగా ముంబైలో లోకల్స్, నాన్ లోకల్స్ మధ్య హింసకు కారణమయ్యాయి. స్థానిక రిజర్వేషన్ల కారణంగా ఉప ప్రాంతీయ విద్వేషాలు కూడా రగిలే అవకాశం ఉంటుంది. స్థానిక రిజర్వేషన్లలో రాష్ట్రమంతా ఒకే జోన్‌గా ఉంటుంది. ఆయా ప్రాంతాలలో ఉన్న పరిశ్రమలలో ఉన్న ఉద్యోగాలు ఆ ప్రాంతవాసులకే ఇవ్వాలని డిమాండ్ రావచ్చు. దీంతో ఇప్పటి వరకు అమలు చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ హరియాణా రాస్ట్రాల్లో ప్రైవేట్ రంగంలో స్థానిక రిజర్వేషన్లు కాగితాల మీదే మిగిలిపోయాయి.
స్థానిక రిజర్వేషన్లను తప్పు పట్టిన కోర్టు..
గతేడాది హరియాణాలోని మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ప్రైవేటు సంస్థల్లో 75 శాతం రిజర్వేషన్లను పంజాబ్–హరియాణా హైకోర్టు కొట్టివేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. హరియాణాలోని ప్రయివేటు సంస్థల్లో నెల జీతం రూ.30 వేల కన్నా తక్కువగా ఉన్న ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం హరియాణా స్టేల్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ చట్టం చేసింది. స్థానికత సర్టిఫికెట్‌గానీ, స్థానిక నివాసం సర్టిఫికెట్‌నుగానీ సమర్పిస్తేనే ఉద్యోగాలకు పరిశీలించాలని నిబంధన విధించింది. దీనిపై ప్రైవేటు కంపెనీల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు ప్రయివేటు సంస్థల్లో స్థానిక రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. ప్రైవేటు రిజర్వేషన్ చట్టాని కొట్టేసింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Karnataka effect local reservation in private sector why are companies opposing it is implementation impossible
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com